
చరిత్రలో నిలిచిన నవల.. చరిత్ర సృష్టించిన సినిమా
60 యేళ్ళ క్రితం తగళి శివశంకర పిళ్ళై 'చమ్మీన్' నవల రాసి మలయాళ సాహిత్యాన్నీ, సమాజాన్నీ ఓ కుదుపు కుదిపాడు. 50 యేళ్ళ క్రితం దాన్నే సినిమాగా తీసి రాము కరియత్ మలయాళ సినీ చరిత్రలో ఓ కొత్త పేజీకి బంగారు రంగులద్దాడు. ఈ నవలనే కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు 'రొయ్యలు' గా తెలుగులోకి తెచ్చారు.
దక్షిణ మలబారు తీరం జాలరి వాళ్ళు, వాళ్ళ నమ్మకాలు, మూఢ నమ్మకాలు, నా ఒక్కడికే అనే స్వార్థం, ఇవ్వడమే కాని తీసుకోవటం తెలియని ప్రేమ, ఆకాశమంత ప్రేమను తట్టుకోలేని దుఃఖం, అసూయ, ద్వేషం, నిలువెత్తు సామూహిక జీవితం... సముద్రాన్ని దున్నే బెస్తవాళ్ళకి రోజూ ఒక కొత్త జన్మే. సముద్రం మీదికి వెళ్ళి వచ్చేదాకా ఇంటామె కళ్ళు వెతుకులాటలే. మగవాడు సముద్రం మీద ఉండగా, అడది కట్టు తప్పితే కడలి తల్లి ఆ మగాణ్ని మింగేస్తుందనే ఓ గుడ్డి నమ్మకం. ఇదీ 1957లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డునందుకున్న మెదటి మలయాళ నవల నేపథ్యం. శివశంకర పిళ్ళై అప్పటిదాకా తాను రాసిన శైలికి భిన్నంగా, తన నమ్మకానికి వ్యతిరేకంగా ఎలా రాశాడు అని వాదాలు, వివాదాలు, ఖండనలు, చర్చలు... ఇదేదో కొత్త మలుపు అని తీర్మానం. మలయాళంలోనే కాదు, భారతీయ సాహిత్యంలోనే యిదో బెంచ్ మార్కు. అందుకే యునెస్కో 'కలెక్షన్ ఆఫ్ రిప్రజెంటేటివ్ వర్క్స్- ఇండియన్ సిరీస్' కింద ఎంపికై 30 భాషల్లోకి అనువదింపబడింది.
అగ్ని పలకలు బద్దలై ఆకాశం నిండా పడినట్లు ఎర్రని సాయం సంధ్య, పడవల్ని రా...రమ్మంటూ కవ్విస్తూ పిలిచే సముద్రం అల్లరి, తెల్ల నురగల అలల మీద నల్లని హంసల గుంపుల్లా వయ్యారాలు పోతూ వేట పడవలు, ఒడ్డుకు చేపల్ని మోసుకొచ్చినపుడు ఎగరేసుకుపోవటానికి వచ్చిన కొంగలు, కొంగల్లా దళారులు... 1965 ఆగస్టులో వచ్చిన 'చమ్మీన్' సినిమాలో యిలాంటి రంగురంగుల దృశ్యాల్ని సెల్యులాయిడ్ మీద పెయింట్ చేసింది ఫొటోగ్రాఫిక్ చిత్రకారుడు మార్కస్ బార్ట్లే! ('పాతాళ భైరవి'లో ఆకాశంలో ఎగిరే భవంతి గుర్తుంది కదా!) పరికుట్టి పాత్ర యితన్ని చూసే రాశారా అన్పించే మధు నటన. నేనేం తీసి పోలేను అన్నట్లు పళని పాత్రలో సత్యన్. నేనుండగా యింకెవర్ని చూస్తారూ అంటూ చెంబుకుంజుగా కనిపించే కొట్టరక్కర శ్రీధరన్ నాయర్. ఏడవటం ఒక్కటే తెలుసు అన్నట్టు కరుత్తమ్మగా షీలా. మొదటిసారి ఉత్తరాది నుంచి మలయాళ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సలీల్ చౌదరి, మన్నాడే, హృషీకేశ్ ముఖర్జీ. హిందీ ట్యూన్‌లైనా మలయాళంలో ఎంత బాగా ఒదిగిపోయాయో అన్పించే బెంగాలీ రిథమ్‌ను తీసుకొచ్చిన సలీల్ తిరిగి వెనక్కి చూసుకోలేదు.
మన్నాడే మొదటిసారి మలయాళంలో 'మానస మైన వరమ్' పాడి వావ్ అన్పించుకున్నాడు. పి.లీల, జేసుదాసు పాడిన 'కడలి నక్కర పోనూరే' యితర సంగీతం మాటలు పాటలు యిప్పటికీ ఏదో ఒక చోట గాలిలో తేలుతూనే ఉంటాయి. కత్తెర యింత సాంపుగా కూడా వాడొచ్చా అన్పిస్తుంది హృషీకేశ్ ముఖర్జీ ఎడిటింగ్. నవల కన్నా గొప్పగా ఉన్నట్టుందే సినిమా అని ఆ రోజులలో భ్రమింపజేసిన మలయాళ మాంత్రికుడు రాము కరియత్. 50 యేళ్ళ క్రితం కలర్‌లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ భారతీయ చిత్రంగా ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అందుకున్న మొదటి దక్షిణాది సినిమా! రీమేకులు కుదరవు గాని, యిదే చూశేద్దాం అనుకుని ప్రధాన భాషలన్నింటిలోకి డబ్ చేయబడి డబ్బులు చేసుకున్న సినిమా!
గొప్ప నవలలు గొప్ప సినిమాలు కాలేవు. డేవిడ్ లీన్ లాంటివాడే డా.జివాగోకి న్యాయం చేయలేక పోయాడని అభియోగం ఉంది. సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలీ’కి నవల నుంచి ప్రేరణ పొందాడేగాని, నవలని యథాతథంగా సినిమా తీయలేదు. అయితే నవలగా పాఠకుల జ్ఞాపకాలు పచ్చిగా ఉండగానే సినిమాగా వచ్చి ఒక దుమారం రేపింది 'చమ్మీన్' అయితే, ఇన్నేళ్ల తర్వాత తిరిగి చూస్తే, నవల యిప్పటికీ ఉన్నత శిఖరాల మీద ఉండగా, సినిమా మాత్రం మెలోడ్రామా ఎక్కువయిన పాత కళాఖండంగా మిగిలింది. గొప్ప నవలగాని, కవిత్వం గాని, రచయిత పరిధిని, ఆలోచననీ దాటి అనేక మందికి అనేక కోణాలలో కన్పిస్తాయి. కాలాన్ని బట్టి కొత్త కొత్త రంగులు ఆవిష్కరించుకుంటూ నిలబడతాయి. తనకున్న పరిధుల వల్ల సినిమా మాత్రం పరిమితమైన చరిత్రగా ఉండి పోతుంది. ఏమయితేనేం 'చమ్మీన్' చరిత్రలో నిలిచిన నవల. 'చమ్మీన్' చరిత్రను సృష్టించిన సినిమా.
కృష్ణ మోహన్ బాబు
9848023384