
కొత్త బంగారం
పెరీ, బేబీ గర్ల్ అనబడే డయోనా, స్నేహితురాళ్ళు. టీనేజర్లు. అరగంట కిందట తాము దొంగిలించిన కార్లో వాళ్ళిద్దరూ కూర్చుని ఉండటంతో నవల ప్రారంభం అవుతుంది. కారు డ్రైవ్ చేస్తున్న బేబీ గర్ల్‌ను చూస్తూ, ‘నకిలీ టక్కరి’ అనుకుంటుంది పెరీ. దానితోనే, వాళ్ళిద్దరికీ ఉన్న స్నేహం అంత నిలకడైనది కాదని తెలుస్తుంది. ట్రైలర్ పార్కులో ఉండే పెరీ తల్లి మైరా తాగుబోతు. హ్యాంగోవర్ వల్ల తరచూ పనికి వెళ్ళలేకపోతుంది. సవతి తండ్రి జైలు కాపరి. బేబీ గర్ల్ జీవితం ఇంతకన్నా కనాకష్టంగా ఉంటుంది. ఆ అమ్మాయి తన మేనమామతోనూ, మోటర్ సైకిల్ ప్రమాదంలో మతి చెడిన అన్నతోనూ ఉంటుంది.
ఇద్దరూ కలిసి కార్లు దొంగిలిస్తూ, స్కూల్ ఎగ్గొడుతూ, రాత్రివేళలు బయట తిరుగుతూ ఉంటారు. కలిసి ఎంతో సమయం వెచ్చించినప్పటికీ, ఒకరినొకరు అనుమానించుకుంటూ ఉంటారు. వారిద్దరికీ ఉన్న సామాన్యమైన నేపథ్యం– అస్థిరమైన కుటుంబాలు. బేబీ గర్ల్ స్థూలంగా ఉండి, తన తిరుగుబాటు ధోరణిని కనపరచడానికి సగం తల గొరిగేసుకుని, మందపాటి మేకప్ వేసుకుని, అన్న జీన్స్ తొడుక్కుంటుంది. ఇంకా కన్య. పెరీ అందమైన బ్లాండ్. లైంగిక సంబంధాలకి వెనకాడదు.
ఇద్దరూ ఫేస్‌బుక్లో ‘టీనేజర్’ని అని చెప్పుకున్న జేమీతో చాట్ చేస్తుంటారు. అతను పెరీ ఉండే పార్కులోనే మరొక ట్రైలర్లో తల్లితోపాటు ఉండి, కంప్యూటర్ స్క్రీన్ వెనకాల నుంచి పెరీని చూస్తూ ఆమె పైన ఆసక్తి పెంచుకున్న మధ్యవయస్కుడు. పిల్లల పట్ల కామం పెంచుకునే స్వభావం ఉన్న వ్యక్తి. అమ్మాయిలిద్దరికీ అతని వివరాలు తెలియవు. పెడసరంగా ఉండే బేబీ గర్ల్‌కు ఇతరులు తన్ని ఇష్టపడాలని ఉంటుంది. జేమీ వల్ల ఇద్దరమ్మాయిల మధ్యా దూరం ఎక్కువవుతుంది.
ఒక వర్షపు రాత్రి జేమీని కలుసుకోడానికి బేబీ గర్ల్– పెరీతో పాటు వెళ్ళినప్పుడు, జరిగిన ఘర్షణలో– అతను కాలు జారి రోడ్డు పక్కనున్న డొంకలో పడి చనిపోతాడు. పోలీసధికారులకి జరిగినది చెప్పమని బేబీ గర్ల్ దబాయించినప్పటికీ, పెరీ వినదు. ఇద్దరూ మృతదేహాన్ని వదిలేసి పోతారు. లిండ్సే హంటర్ పాత్రలకి తమ బలహీనతలు తెలుసు. తమని తాము ఏవగించుకుంటూనే, తమ తప్పుడుదారులు మాత్రం విడవరు. అయితే, పాఠకులకి మాత్రం సానుభూతి కలిగిస్తారు. నవల– కష్టాలని అధిగమించడం గురించినది కాక, తమలో ఉన్న చీకటి కోణాలతో రాజీ పడే పాత్రల చిత్రీకరణ.
కథనం ప్ర«థమ పురుష స్వరంతో వినిపిస్తుంది. నెమ్మదిగా మొదలయి, హఠాత్తుగా ముగుస్తుంది. చివరి అధ్యాయాలు కొన్ని– కేవలం ఒకే పేరాతో పూర్తయేవి. పుస్తకం–గలీజైన, గరుకైన జీవితాల గురించినదైనప్పటికీ, కథాంశం పాత్రలని తాజా రీతిలో ముందుకు నడిపిస్తూ ఉన్నందువల్ల, విసుగు పుట్టించదు. ఆ విధమైన జీవితాల గురించీ, పాత్రల గురించీ పాఠకులు ఆలోచించేలా చేస్తుంది. ప్రతీ ఒక్కరూ అంతర్గతంగా చెడ్డవారేనన్న సూత్రం నవలంతటా కనబడుతుంది.
ఇక్కడ ‘అగ్లీ’ అన్నది అమ్మాయిలని కాదు. ‘అగ్లీ’గా ఉండేది– మనుష్యులు, జీవితాలు, ఆలోచనలు, నైతిక స్థాయులు. కథాంశం–గ్రామీణ పేదరికం, టీనేజిలో కలిగే నిరుత్సాహపు సుఖదుఃఖాలు, లైంగిక పరిపక్వతకి ముందు వచ్చేచిక్కులు. గతంలో రచయిత్రి రెండు కథా సంకలనాలు రాశారు. అగ్లీ గర్ల్స్ ఆమె తొలి నవల. విడుదల అయినది 2014లో.
కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment