
ఎం.సి.మేరి కోమ్
బురదలో పుట్టినా పద్మంలా వికసించిన ఎం.సి.మేరి కోమ్ ఆత్మకథ, అన్‌బ్రేకబుల్. మణిపుర్ సాధారణ అమ్మాయి ఆమె. తండ్రి వ్యవసాయ కూలీగా చేస్తూనే, మోతుబరి రైతు పొలం కౌలుకి తీసుకుని వ్యవసాయం చేసేవాడు.కోమ్ సమాజంలో మగవాళ్లు చదువుకునేవాళ్లు, ఆడవాళ్లు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళేవాళ్లు. ఆమె తండ్రి భిన్నంగా ఆలోచించి బడిలో చేర్చడంతో జీవితం మలుపు తిరిగింది. బడి నుండి వచ్చిన తరువాత, వెళ్ళే ముందు ఇంటి పనుల్లో అమ్మకూ, పొలం పనుల్లో నాన్నకూ సాయం చేసేది. వారున్న గ్రామానికి విద్యుత్ సదుపాయం లేనందున పత్తి వత్తితో చేసిన దీపంలో కిరోసిన్ పోసి ఇల్లంతటికీ అదే వెలుగు ఇస్తుండగా చదువుకునేది. ఆటలంటే మోజు ఉంది కానీ తండ్రికి ఇష్టం లేదు. శరీర సౌష్ఠవం కోసం బలమైన ఆహారం, పోటీల్లో పాల్గొనడానికి తరచూ ప్రయాణాలకయ్యే ఖర్చు కోసం ఆలోచించేవాడు. కుమార్తె పట్టుదల చూసి అంగీకరించక తప్పలేదు.
ఎస్.ఎ.ఐ.లో బాక్సింగ్ శిక్షణ కోసం ఇంఫాల్‌లో అద్దె ఇంట్లో గడిపిన రోజుల్లో వంట చేయడానికి బియ్యం నిండుకోవడం, చేతిలో డబ్బు లేకపోవడం వలన నాలుగు గంటలు సైకిలు తొక్కుతూ కాంగతైలోని ఇంటికి వెళ్లి బియ్యం తెచ్చుకున్న విషయం ఆమె మరచిపోలేదు. కష్టాలలో గడపడం వలన బాక్సింగ్‌కు అవసరమైన కష్ట సహిష్ణుత, సహనం అలవాటయినట్టు చెప్పుకుంది. రోజూ ఆరు గంటలు వ్యాయామం చేస్తూ శత్రువుని ఓడించడానికి ఉత్తమ మార్గం వేగంగా, తీవ్రంగా విజృంభించడమే అన్న అవగాహన పెంచుకుంది. తండ్రి వ్యవసాయం చేస్తూ, తల్లి బట్టలు నేస్తూ సంపాదించేది తక్కువ కావడంతో పంపించిన 50, 100 రూపాయలతోనే సర్దుకునేది. బాక్సింగ్ సామగ్రి ఖరీదైనది కాబట్టి అవేవీ లేకుండానే శిక్షణలో చేరింది. సౌకర్యవంతమైన బూట్లు కావాల్సినప్పటికీ స్థోమత లేక చౌక బూట్లు కొని సాధన చేసింది.
ఎన్నో కష్టాలకు ఓర్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానానికి చేరిన మేరి కోమ్ 5 సార్లు వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్ అయ్యింది. 2012 సమ్మర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక భారత మహిళా బాక్సర్ అయ్యి, 51 కిలోల విభాగంలో కాంస్య పతకం గెలిచి దేశ జెండాను గర్వంగా ఎగరేసింది. 2014 ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా బాక్సర్ అయ్యింది. అలాగే 2018 కామన్‌వెల్త్ గేమ్స్‌లోనూ బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళా బాక్సర్ అయ్యింది. ఫుట్‌బాల్ ఆటగాడు ఆన్‌లెర్‌తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుని, ముగ్గురు పిల్లల తల్లి అయ్యాక ఇవన్నీ సాధించిందని మరవకూడదు. ఈ అన్ని విషయాలనూ క్షుణ్ణంగా ఈ ఆత్మకథ ఆవిష్కరించింది. తండ్రి రుణం తీర్చుకున్న కూతురులా నిలవాలని ఆయనకు బొలెరో కారు బహూకరించింది. ఇంగ్లిష్‌లో ‘అన్‌బ్రేకబుల్’గా వచ్చిన కోమ్ ఆత్మకథను డాక్టర్ డి.వి.సూర్యారావు ‘అభేద్యం’ పేరుతో తెలుగులోకి అనువదించగా ‘రీమ్’ ప్రచురించింది.
నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment