అగ్రహారం ఇళ్ల మీద గద్దలు వాలడం చూసి అగ్రహార వాసులు హాహాకారాలు చేస్తారు. అలా గద్దలు వాలడం వారు ఎరగరు. కాని గద్దలు మాత్రం ఏం చేస్తాయి ఇళ్లల్లో ఉండాల్సిన ఎలుకలు వీధుల్లోకి వచ్చి దౌడు తీస్తున్నాయి. కలరా వచ్చింది. కలరా విలయతాండవం ఆ ప్రాంతంలో మొదలయ్యింది. ఆ మహమ్మారిని ఎదుర్కొనాలా సనాతన సంప్రదాయాల సంక్లిష్టతను ఎదుర్కొనాలా యు.ఆర్.అనంతమూర్తి నవల ‘సంస్కార’ పాఠకునికి ఎన్నో ప్రశ్నలు చేతికి ఇస్తుంది. ఎన్నో సమాధానాలు వెతకమంటుంది. 50 ఏళ్ల క్రితం వచ్చిన ఈ నవల నేటికీ చర్చను లేవదీస్తూనే ఉంది.
‘సుదీర్ఘ వచనం’ సమగ్ర జీవితాన్ని చూపిస్తుంది. సమస్య సమగ్రతను చూపుతుంది. ఒక చారిత్రక సందర్భాన్ని సమూలంగా చర్చిస్తుంది. అనుభూతినో, ఆలోచననో, దర్శనాన్నో, వికాసాన్నో అది ప్రతిపాదిస్తుంది. సుదీర్ఘ వచనం కలిగిన ‘నవల’ ఆ పని చేస్తుంది. ఒక రచయిత తాను రచయితనని నిరూపించుకోవడానికి నవల రాయాలని పాశ్చాత్యులు భావిస్తారు. పాశ్చాత్యులకు నవల ప్రియ పఠన వచనం. నేటికీ అమెరికా, యూరప్‌లలో నవలకు ఉన్న గిరాకీ హ్రస్వ వచనం కలిగిన కథకు లేదు. అంతర్జాతీయ అవార్డులు, నోబెల్ బహుమతి నవలను పరిగణించినట్టుగా ఇతర వచనాలను పరిగణించవు. ఆ విధంగా పోల్చి చూసినప్పుడు తెలుగు నవల ప్రయాణం ఎత్తు పల్లాలను చూస్తూ ముందుకు సాగుతోంది. పాశ్చాత్యులకు యుద్ధం ఒక ప్రధాన నవలా వస్తువు. లైంగిక వ్యామోహాలు కూడా. కాని తెలుగు నవల ఆదర్శాన్ని తన ఆత్మగా స్వీకరించింది. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి, ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి ఉద్దండులు ఒజ్జలుగా మారి తెలుగు నవలా బాటలు వేశారు. ఆ తర్వాత గుడిపాటి చలం, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, ఒద్దిరాజు సోదరులు, సురవరం, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య తదితరులు ఆ బాట లను విశాలం చేస్తూ అశ్వ రథాలను, ఏనుగు అంబారీలను నడిపించారు. ఆపై స్త్రీలు ఆ రచనా కళను హస్తగతం చేసుకున్నారు. రంగనాయకమ్మ పురోగామి నవలకు ఆధార కేంద్రం నిర్మించారు. వాసిరెడ్డి సీతాదేవి నవల ‘మరీచిక’ నిషేధం పొందే స్థాయిలో నవల శక్తిమంతం అయ్యింది.
నవల ఏం చేసిందంటే భాషను పాఠకులకు పరిచితం చేసింది. అక్షరాస్యత పట్ల ఆసక్తి పెంచింది. జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పింది. సంస్కరణ అభిలాషను పాదుకొల్పింది. చారిత్రక ఘటనలను రీప్లే చేసింది. తాత్త్విక దృష్టిని అలవర్చింది. సామాన్యుడికి అతడి బలహీనతలు బలాలు తెలియచేసింది. గోపిచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, వడ్డెర చండీదాస్ ‘అనుక్షణికం’, రావిశాస్త్రి ‘అల్పజీవి’, కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’, భాస్కరభట్ల కృష్ణారావు ‘వెల్లువలో పూచికపుల్లలు’, నవీన్ ‘అంపశయ్య’, శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’... ఇవన్నీ నవీన వస్తు శిల్పాలతో పాఠకులను ఉక్కిరి బిక్కిరి చేశాయి.
కాలం మారింది. కాలక్షేప నవలలు పెరిగాయి. వీక్లీలు వచ్చి కమర్షియల్ నవలను ప్రోత్సహించాయి. సామాజిక అంశాలను, సామాజిక జీవితాన్ని రాసే నవలలు వేదికలు కోల్పోయాయి. ఆ కాలంలో కూడా కె.ఎన్.వై.పతంజలి, కేశవరెడ్డి, ఓల్గా, కాశీభట్ల వేణుగోపాల్ తదితరులు మెరిసి తమ ఉనికిని, నవల ఉనికిని నిలబెట్టారు. అయితే 1990–2000 కాలంలో సీరియస్ నవల కంటే సీరియస్ కథ పాఠకులకు చేరువయ్యింది. ఇక నవల సంగతి ముగిసినట్టే అని కూడా అనుకున్నారు.
కాని ఇప్పుడు తెలుగు నవల మళ్లీ విస్తృత కృషిలో ఉంది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ ప్రాంతాల సమర్థులైన రచయితలు సుదీర్ఘ వచనం మేము రాయగలం, రాస్తున్నాం అని నిరూపిస్తున్నారు. అల్లం రాజయ్య, స్వామి, సన్నపరెడ్డి వెంకటరామి రెడ్డి, మధురాంతకం నరేంద్ర, రాసాని, సలీం, పెద్దింటి అశోక్ కుమార్, చంద్రలత... తదితరులు ఎందరో నవలను ముందు వరుసలోకి తెచ్చారు. ప్రవాసాంధ్ర సంస్థలైన తానా, ఆటా, రాష్ట్రంలోని సంస్థలు నిర్వహిస్తున్న నవలా పోటీలు కూడా ఇందుకు ఊతం ఇస్తున్నాయి. ఇప్పుడే తెలుగు నవల అవసరం మరింతగా కనపడుతోంది. దేశ రాజకీయ సందర్భాలను, సామాజిక పరిణామాలను, పూర్తిగా వేగమంతమయ్యి మనిషిని ఒంటరి చేస్తున్న పోటీ జీవితాన్ని, వలసప్రవాస బతుకులను, హింసా ధోరణి, విలువల పతనం, ద్వేషం, మానసిక అలజడులు, స్త్రీ పురుష సంబంధాలు... ఇవన్నీ ఇప్పుడు సుదీర్ఘ వచనంలో పాఠకులకు చూపాల్సి ఉంది. కరోనా సంక్షోభం కారణంగా దేశంలో, తెలుగు రాష్ట్రాలలో మనిషి జీవితం ఎంతగా సంక్షుభితమయ్యిందో గమనించి చూస్తే రాబోయే రోజుల్లో ఈ కాలాన్ని నవలా వస్తువుగా తీసుకుంటే ఎన్ని నవలలు వస్తాయో కదా.
అంతే కాదు ప్రపంచంలో వస్తున్న గొప్ప నవలలు ఇటుకి, ఇక్కడ వస్తున్న మంచి నవలలు అటుకి అనువాదమయ్యి ఆదాన ప్రదానాలు జరగాల్సి ఉంది. బెంగాల్ నుంచి రాసిన శరత్ దేశ రచయిత కావడానికి తెలుగునాడు నుంచి రాసిన చలం ప్రాంతీయ రచయితగా మాత్రమే ఉండిపోవడానికి ఇన్‌స్టిట్యూషన్ల వైఫల్యమే కాక సాహితీ బృందాల అలసత్వమూ కారణమే. ఎవరో అన్నట్టుగా తెలుగు నవల అంతర్జాతీయ స్థాయిలోనే ఉంది... కాకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉందని రచయితలకు నమ్మకం కలిగించాలి. ఓటీటీలలో పది పన్నెండు ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌లు చూస్తున్న వీక్షకులను వందా రెండు వందల పేజీల నవల చదివించేలా చేయడమే ఇప్పుడు రచయితలకు అసలైన సవాలు. తెలుగు నవల వేయి కలాలతో విరచితం వికసితం కావాలని కోరుకుందాం.
నవల కావాలి
Published Mon, Aug 16 2021 12:06 AM | Last Updated on Mon, Aug 16 2021 4:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment