జయసంహితకు నవలా రూపం | jayasamhitha novel form is the following | Sakshi
Sakshi News home page

జయసంహితకు నవలా రూపం

Published Sun, Aug 23 2015 3:21 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

జయసంహిత

జయసంహిత

2 ఆగస్టు 2015న ప్రచురించబడిన ‘జయమ్-భారతమ్-మహాభారతమ్’ అన్న నా వ్యాసానికి పత్రికాముఖంగా గబ్బిట కృష్ణమోహన్, రామతీర్థగార్లు స్పందించారు. ఒంటరిగా నేను శ్రమిస్తున్నానని కృష్ణమోహన్ గారు అభినందించారు. ‘జయమ్ అన్న ప్రాచీన రచన ఇదమిత్థంగా ఎక్కడాలేదు. లేనిదాని గురించి నవల రాయడం అంత సులభం కాదు’ అని రామతీర్థగారు అభిప్రాయపడ్డారు.
‘జయమ్’ ఒక ఇతిహాసం. చరిత్ర. నిజంగా జరిగి ఉంటుందని ఎక్కువమంది చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. నేనూ నమ్ముతున్నాను. వ్యాసుడి కాలంలో జీవించిన పాండవులు, కౌరవుల మధ్య జరిగిన ఘర్షణ - పర్యవసానంగా మొదలైన యుద్ధం జయేతిహాసంలో ఇతివృత్తం. తనవల్ల కొనసాగిన కురువంశం తన కళ్లముందే సర్వనాశనం కావడం వ్యాసుడి మనసును క్షోభపెట్టింది. వంశ నాశనానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ ‘జయమ్’ పేరుతో కావ్యరూపం కల్పించాడు వ్యాసుడు.

‘జయ సంహిత’ విడిగా ఎక్కడుంది అంటే ఎక్కడా లేదనే సమాధానం చెప్పాలి. వ్యాసుని తర్వాత జయాన్ని జనమేజయుడికి వినిపించిన వైశంపాయనుడు ఎన్నో వివరణలు, పూర్వకథలు, చరిత్రలు, శాస్త్రాలు జోడించి 24 వేల శ్లోకాల భారతంగా మార్చాడు. సౌతి శౌనకాది మునులకు వినిపించినప్చడు జయమ్ విస్తృతి ఇంకా పెరిగింది. లక్ష శ్లోకాల మహాభారతంలో 8,800 శ్లోకాల జయమ్ ను వెదుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. వేల సంవత్సరాలు పైబడిన కాలం నుండి పౌరాణికులు భారతాన్ని పెంచి చెబుతున్నారే కాని మూలకథ ఏమైవుంటుందన్న ఆలోచన చెయ్యలేదు. చరిత్రను నిక్షిప్తం చేయాలనే తత్త్వం మన భారతీయ రక్తంలో లేదేమో! మన చరిత్రకోసం మనం విదేశీయుల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది.

క్రీ.శ.1883-1894 మధ్యకాలంలో స్కాండినేవియన్ సాహిత్యవేత్త సోరెన్  సోరెన్ సన్ మహాభారతం నుండి మూలకథను వేరుచేసే ప్రయత్నం చేశాడు. మొదట లక్ష శ్లోకాల నుండి 27 వేల శ్లోకాలను వేరు చేసి, ఆ సంఖ్యను 7-8 వేలకు తగ్గించే తరుణంలో ఆయన మరణించాడట. అంతవరకూ ఆయన చేసిన కృషి ఏమైందో ప్రచారంలోకి రాలేదు. ఈ సంగతి భండార్కర్ రీసెర్చ్ ఇనఖస్టిట్యూటఖ (పుణే)కు ఒకప్చడు నేతృత్వం వహించిన డా॥వి.ఎస్.సుక్తాంకర్ తన ‘On the Meaning of the Mahabharath’ అనే వ్యాసావళిలో పేర్కొన్నాడు. ఇదే సంకలనంలో జర్మనీకి చెందిన ప్రాచ్యభాషా పరిశోధకుడు హెర్మనఖ ఓల్డెనఖ బర్గ్ ‘The Mahabharath began its existence as a simple epic narrative. It became in course of centuries the monstrous chaos’ అన్నాడని కూడా రాశాడు.
సోరెన్ తర్వాత దాదాపు ఎనభై ఏళ్లకు మహాభారత మూలకథ మీద దృష్టి సారించింది గుజరాత్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అహమ్మదాబాద్ బ్రాంచికి గౌరవ డెరైక్టర్ ప్రొ.కేశవరావ్ రామ్ కె.శాస్త్రి. కొన్నేళ్లపాటు ఒంటరిగా శ్రమించిన కె.కె.శాస్త్రి విజయవంతంగా మహాభారతం నుండి జయమ్ను వేరు చేశారు. 1977లో గుజరాత్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు 8,801 సంస్కృత శ్లోకాలతో ఉన్న ‘జయసంహిత’ను ప్రచురించారు.

బి.ఒ.ఆర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పుణే వారు లక్ష శ్లోకాల మహాభారతాన్ని పరిశోధించి, పరిష్కరించి 78,675 శ్లోకాలకు కుదించారు. ఇందులో 6,073 శ్లోకాల హరివంశం కూడా చేరి ఉంది. కె.కె.శాస్త్రిగారు ఈ పరిశోధిత ప్రతిని ముందు పెట్టుకొని ముఖ్యమైన కథాసూత్రానికి అడ్డంకులుగా ఉన్న వాటిని తొలగించుకొంటూ మొదట 53,575 శ్లోకాలకు, ఆ తరువాతి విడతలో 23,282 శ్లోకాలకు, చివరగా 8,801 శ్లోకాలకు చేరుకొని ‘జయసంహిత’ను విజయవంతంగా మనముందు ఉంచారు. పాండురాజు మరణం తర్వాత కుంతీదేవి కుమారులతో హస్తినకు రావడంతో జయయ్ కథ మొదలవుతుంది. యుద్ధం ముగిసి పాండవులు అశ్వమేధయాగం చేసి హస్తినకు చేరడంతో పూర్తవుతుంది. పాండురాజు మరణానికి ముందు ఎంతో కథ ప్రచారంలో ఉంది. రాజుగా అభిషేకం జరుపుకొన్న పాండురాజు అడవులకు ఎందుకు వెళ్లాడు? అక్కడ కుంతి, మాద్రిలకు పాండవులు ఎలా పుట్టారు? అనేవి ముఖ్యమైన ప్రశ్నలు. వరాలు, శాపాలు, అద్భుతాలు, పునర్జన్మలు లాంటివి లేవు అనుకొంటే పై ప్రశ్నలకు సముచితమైన సమాధానాలు వెతుక్కోవాలి. కన్నడ రచయిత బైరప్ప ‘పర్వ’లో తనదైన ఊహలతో కథను మలుపులు తిప్పాడు. ఇరావతి కర్వే తన వ్యాస సంపుటి ‘యుగాంత’లో స్వేచ్ఛగా ఊహాగానం చేశారు. పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు 1928లో రాసిన ‘మహాభారత చరిత్రము’లో నిక్కచ్చిగా తన మేధాశక్తిని, ఊహాశక్తిని జోడించి ‘ఇది ఇలా జరిగి ఉంటుంది’ అని చెప్పారు.

‘జయమ్’ను యథాతథంగా కాకుండా నవలా రూపంలో రాయాలని నేను అనుకోవడంలో ఉద్దేశం కొంత స్వేచ్ఛ లభిస్తుందని, ఇలా జరిగి ఉంటుంది అని ఊహించి రాయడానికి అవకాశం ఉంటుందని. మహాభారత గౌరవాన్ని కాపాడుతూ రచనను కొనసాగించాను.
  నాయుని కృష్ణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement