కళాపూర్ణోదయం ‘పద్యనవల’
భువన విజయ ప్రసంగాలలో డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు
రాజమహేంద్రవరం కల్చరల్ : అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయాన్ని పద్యనవలగా చెప్పుకోవచ్చని ఆంధ్రపద్యకవితా సదస్సు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్, జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీకళాశాలలో జరుగుతున్న భువన విజయ సాహితీప్రసంగ పరంపరలలో భాగంగా బుధవారం ఆయన 'కళాపూర్ణోదయం–కథాకథనం' అనే అంశంపై ప్రసంగించారు. కళాపూర్ణోదయంలో ఆధునిక నవలా లక్షణాలు అన్నింటినీ చూడవచ్చని, కథాకథనం ఉత్కంఠభరితంగా సాగుతుందన్నారు. సరస్వతీచతుర్ముఖుల రహస్య క్రీడను తీసుకుని, ఎనిమిది ఆశ్వాసాలు, 1800 పద్యాలలో పింగళి సూరన ఈ ప్రబంధాన్ని రచించాడని ఆయన పేర్కొన్నారు. కళాపూర్ణోదయంలో పదిమందికి ఉపయోగపడని విద్య నిరర్ధదకమనే సందేశాన్ని కవి తన రచన ద్వారా సమాజానికి అందించాడని వెంకటేశ్వరరావు తెలిపారు. ‘కేవల కల్పనాకథలు కృత్రిమరత్నములు’ అని భట్టుమూర్తి సాటికవి పింగళి సూరనను ఆక్షేపించాడని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి ఈ ఆక్షేపణను తిప్పికొట్టాడని, కల్పననే సరస్వతీ విలాసంగా, ఒక అద్భుత కథనంగా పింగళి సూరన మలిచాడని పేర్కొన్నాడని వెంకటేశ్వరరావు విరించారు. సభకు అధ్యక్షత వహించిన ప్రాచార్యశలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ మేధకు పదునుపెట్టే గ్రంథం కళాపూర్ణోదయమన్నారు. ముఖ్య డాక్టర సప్పాదుర్గాప్రసాద్ ప్రసంగించారు. నన్నయ వాజ్ఞ్మయవేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి చింతలపాటి శర్మ కార్యదర్శి నివేదికను సమర్పించారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగి ఎం.వి.రాజగోపాల్ స్వాగతవచనాలు పలికారు. సాహిత్యాభిమానులు హాజరయ్యారు.
నేడు పాండురంగమహాత్మ్యంపై ప్రసంగం
భువన విజయ సాహితీప్రసంగాలలో భాగంగా గురువారం సాహితీవేత్త కర్రా కార్తికేయశర్మ పాండురంగ మాహాత్మ్యంపై ప్రసంగిస్తారు.