
తెలంగాణ ఏ నవల రాయాలి?
అభిప్రాయం
అన్ని ప్రాంతాలలోనూ నవలకు సంబంధించిన కృషి జరుగుతున్న ఈ సందర్భంలో తెలంగాణ తన తాజా నవలా వస్తువును వెతుక్కోవాల్సి ఉంది.
ఒక నవలను చదవడం మొదలుపెడితే అది పాఠకుణ్ణి తనతో పాటు తీసుకెళ్లాలి. నిద్రను మరచిపోవాలి. పగలు- పనులు మానుకోవాలి. పాత్రల వెంట సన్నివేశాల వెంట వాక్యాల వెంట పరుగులు తీయాలి. చదవడం పూర్తి చేసే వరకు నిమిషం నిలువనీయని కుతూహలానికీ ఆరాటానికీ లోను చేయాలి. అదీ నవలంటే. ప్రాంతంతో, భాషతో సంబంధం లేకుండా అలా చదవించాయి కాబట్టే గోర్కీ ‘అమ్మ’ని, టాల్‌స్టాయ్ ‘అన్నా కెరినినా’ని, శరత్ ‘శ్రీకాంత్’ని, ప్రేమ్‌చంద్ ‘గబన్’ని, చండీదాస్ ‘హిమజ్వాల’ని, చలం ‘జీవితాదర్శాన్ని’, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ని, గోపీచంద్ ‘మెరుపులు మరకల’ని, రంగనాయకమ్మ ‘అంధకారంలో’ని చదివి ఊగిపోయిన రోజులున్నాయి.
మరి తెలంగాణ విషయానికి వస్తే?
నవీన్ ‘అంపశయ్య’ని ఇంటర్ ఫస్టియర్‌లో చదివిన అనుభూతి తాలూకు గుర్తులు ఇప్పటికీ తాజాగా ఉన్నాయి. ఉస్మానియా క్యాంపస్‌లో చదవాలన్న కలకి బీజం వేసిన నవల అది. అందులోని పాత్రలు- రవి, కిరణ్మయి, వేణు... ఇన్‌స్పైర్ చేసే లెక్చరర్ ఉపేంద్ర... ఆత్మీయంగా పలకరిస్తూనే ఉంటారు. ఎక్కడ ఏ పేజీ నుంచి మొదలుపెట్టినా చదవించే నవల ఇది. అలాగే నవీన్ రాసిన ఇతర నవలలు- ‘ముళ్లపొదలు’, ‘చీకటిరోజులు’ కూడా నచ్చాయి. ఇక కందిలి దీపం వెలుతురులో చదివిన బృహత్తర నవల దాశరథి రంగాచార్య ‘జనపథం’. ఆ నవలను చదువుతుండగా ‘ఊళ్లో దొరవారి గడీ ముందు నుంచి సైకిల్ మీద పోకూడదు. సైకిల్ దిగి నడిపించుకుంటూ పోవాల్సిందే’ అని దొర పెత్తనాల గురించి నాయిన చిన్నప్పుడు చెప్పే మాటలు గుర్తుకొచ్చేవి. రంగాచార్య రాసిన ‘చిల్లర దేవుళ్లు’ చదివింప చేసినా ‘మోదుగుపూలు’ ఇంకా శక్తిమంతంగా మన మనసు మీద ముద్ర వేస్తుందనిపించింది. క్యాంపస్‌లోకి వచ్చాక చదివిన నవల వట్టికోట ఆళ్వారు స్వామి ‘ప్రజల మనిషి’. చాన్నాళ్లకు చదివినప్పటికీ ఉద్విగ్నతకు లోను చేసిన నవల అల్లం రాజయ్య-సాహుల ‘కొమురం భీము’.
తర్వాతి కాలాన తెలంగాణ నవలలు మరెన్నో చదివినప్పటికీ వాటి పరిమితులు అనేకం. ఇక్కణ్ణుంచి వచ్చిన చాలా నవలలు డాక్యుమెంట్ల స్థాయిని దాటలేదనిపిస్తుంది. తెలంగాణ జవజీవాలతో కూడిన నేల. వైవిధ్యమైన పల్లెలు, పట్టణాలు, నగరాలతో సారవంతమైన నేల. బహుభాషల, బహుళ సంస్కృతుల జీవన సంరంభం ఇక్కడి ప్రత్యేకత. ఇదంతా ఇంకా తెలంగాణ నవలలోకి రావాల్సి ఉంది. ఇక తెలంగాణ చరిత్రను తీసుకొని చారిత్రక నవలలు రచించాల్సిన కొరత మిగిలే ఉంది. గోల్కొండ నవాబుల కాలంలో, తర్వాత నిజాం నవాబుల ఏలుబడిలో హైదరాబాద్ జీవితం ఎలా ఉన్నదో చెప్పే నవలలు కావాలి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఇప్పటికీ నవలలు రాస్తున్నారు. కాని పోరాట విరమణ అనంతర ఖేదం, దుఃఖం, జీవన విషాదం, విలువల కోసం నిలబడాలన్న తపన, తమ కళ్ల ముందే అవి అంతరించిపోతున్న వైనం... వీటిని ఆవిష్కరించే శక్తిమంతమైన నవలలు రాలేదు. వీటిని ఇప్పుడైనా రాయొచ్చు. నాటి జ్ఞాపకాలను పదిల పరుచుకున్న మనుషులు పల్లెల్లో ఇంకా ఉన్నారు.
1970 నుంచి 1990 మధ్య కాలంలో తెలంగాణలో విప్లవోద్యమాలు ఒక తరాన్ని నడిపించాయి. ఒక తరమంతా విప్లవోద్యమాలను నడిపించింది. అయితే ఈ తరమంతా మెల్లమెల్లగా తన దారుల్ని వదిలి, కల్లోల కడలి మేఘాల్ని దాటుకొని మార్కెట్ పరుగు పందాల్లోకి ఎగబాకి అమెరికాకు పయనమైన వైనం కూడా ఒక మంచి నవలా వస్తువే. ఏ సామ్రాజ్యవాదాన్నయితే నిరసించారో ఆ సామ్రాజ్యవాదపు నీడల్లో తమ కూతుళ్ల కొడుకుల బంగారు భవిష్యత్తు కోసం ఆరాటపడే ‘పోరాటకారుల’ బతుకు నడకను రాస్తే అదో మంచి నవలే కదా? శాస్త్రీయ విద్యావిధానం కావాలని గోడల మీద రాసిన చేతులు కార్పొరెట్ కాలేజీలు, ఆస్పత్రుల అధినేతలైన పరిణామం కూడా తెలంగాణ నవలకు తగిన ఇతివృత్తమే. విప్లవ ఆశయాల కోసం అమరులైన వారి త్యాగాలు, ఆ త్యాగాల మీద రియల్ ఎస్టేట్ సౌధాలను నిర్మించుకున్నవారి బతుకులు కూడా నవలలకు వస్తువులే. తుపాకుల పహారాలోనూ విప్లవాన్ని శ్వాసిస్తూ అజ్ఞాతంలో తిరిగే ఆలివ్ దుస్తుల చలన శీలత కూడా అనివార్యమైన నవలా వస్తువు.
1990 నుంచి 2014 వరకు లోపలా బయటా అనేక పరిణామాలు చూసింది తెలంగాణ. సోవియట్ పతనం, సోషలిస్టు కలలపై కన్నీటి చారికలు, కొంపల్లోకి చొచ్చుకువచ్చిన గ్లోబలైజేషన్, తెలంగాణ పురిటినొప్పులు, ఊపిరాడనివ్వని నిర్బంధంలో నుంచి వెసులుబాటునిచ్చిన తెలంగాణ ఉద్యమాల్లోకి వందలు వేలు లక్షలుగా తరలివచ్చిన వారి ఆశలు, కలలు, ఆత్మహత్యలు... ఇవన్నీ తెలంగాణ నవలకు భారీ వస్తువులే. అసలు జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్ కేంద్రాలుగా వందేళ్ల కాలాన్ని తీసుకుంటే అదే ఒక మహా నవల.
దళితుల ఆత్మావిష్కరణకు కూడా ఇది మంచి సందర్భం. తెలంగాణలో తొలి దళిత నవలగా వచ్చిన వేముల ఎల్లయ్య ‘కక్క’ తర్వాత భూతం ముత్యాలు వంటి వారు గట్టి కృషే చేసినా ఇంకా విస్తృతంగా తెలంగాణ దళిత జీవితం నవలా రూపాన్ని తీసుకోవాల్సి ఉంది. అలాగే స్త్రీల జీవితం కూడా. ముదిగంటి సుజాతారెడ్డి రాసిన ‘ఆకాశంలో విభజనరేఖల్లేవు’ తెలంగాణ రచయిత్రులు స్త్రీవాదాన్ని ఎలా చూస్తారో తెలియచేసింది. ఆమె ‘ముసురు’ శీర్షికన జ్ఞాపకాలు రాశారు. ఇవి ఒకరకంగా ఆత్మకథ రూపాన్ని తీసుకున్నాయి. కానీ ఇలాంటి వారు ఇరవయ్యో శతాబ్దిలో తెలంగాణ స్త్రీల బతుకులోని చైతన్య శీలతను వస్తువుగా స్వీకరించి బృహత్ నవలలు రాయాలి. మూడు నాలుగు తరాల స్త్రీలను చూసిన వారు తెలంగాణ మహిళల జీవితాన్ని నవలల్లోకి తీసుకువస్తే అద్భుతంగా ఉంటుంది.
తొలి నవల వచ్చిన కాలం కంటే తెలంగాణలో ఇవాళ మధ్యతరగతి ప్రబలంగా ఉంది. పెట్టుబడి పోకడలు భిన్న రీతుల్లో ఉన్నాయి. భూస్వామ్య పునాదుల్ని పెకలించుకుంటూ తెలంగాణ మార్కెట్ ఎకానమీలోకి విస్తరిస్తున్నది. ఈ మొత్తం అసలు సిసలు స్వభావాన్ని నవలలో ఆవిష్కరించడమే సాధ్యం. ఇతివృత్తం ఏదైనా దానిని తగిన శిల్పనైపుణ్యంతో మలచగలిగితే నాలుగు తరాలు చదివే నవలగా నిలుస్తుంది. అందుకే శైలీ శిల్పాలకు నిబద్ధులై రాయగలిగిన వారికి తెలంగాణ ప్రజల జీవితం నిజంగానే ఒక మహత్తరమైన గని.
- గుడిపాటి, 9490099327