మా సంతోషాన్ని ఎవరు నిర్ణయిస్తారు? | Ngugi wa Thiongo Novel Weep Not Child | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 27 2018 1:32 AM | Last Updated on Mon, Aug 27 2018 1:38 AM

Ngugi wa Thiongo Novel Weep Not Child - Sakshi

ఏడవకు నా కన్నా
నీ కన్నీళ్లను ఈ ముద్దులతో తుడిచెయ్యనీ
గర్జించే మేఘాల విజయం ఎంతో సేపు నిలవదులే
అవి ఆకాశాన్ని ఎంతో సేపు ఆక్రమించుకొని ఉండలేవులే!
– వాల్ట్‌ విట్‌మన్‌

పై కవితనుంచే కెన్యా రచయిత గూగీ వా థియాంగో స్ఫూర్తి పొంది తన మొదటి నవలకి ‘వీప్‌ నాట్‌ చైల్డ్‌’ అని పేరు పెట్టాడు. 1964లో ప్రచురితమైన ఈ నవల రాసే సమయానికి ఆయన 22 యేళ్ళ యువకుడు. 1938లో పుట్టిన గూగీ తన బాల్యాన్నీ, యవ్వనాన్నీ యుద్ధనీడలలో గడిపాడు. రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయ్యే నాటికి పాఠశాల చదువు కొనసాగిస్తూ చదువు తమ అందరికీ ఒక మంచి భవిష్యత్తును తెచ్చిపెడుతుందనే ఆశతో కన్నీటిని తుడుచుకొంటున్నాడు. అటువంటి అనుభవాన్ని మించిన గొప్ప కథా వస్తువు మరింకేముంటుంది?

సాధారణంగా మొదటి రచన ఆత్మకథాత్మకం కావడం సహజం. ఇటువంటి సంక్లిష్టమైన జీవితానుభవం ఉన్నపుడు మరీనూ. గూగీ కూడా అందుకు మినహాయింపు కాదు. తెల్లవాళ్ళ దాష్టీకాన్ని గురించీ వలసపాలనలోని హింస, దౌర్జన్యం, దోపిడీ గురించీ ఇందులో చిత్రిస్తాడు.

చదువుకోవాలనే బలమైన కాంక్ష ఉన్న పేద పసివాడు జొరొగో. చెప్పకుండానే అతని ఆకాంక్ష  తెలుసుకున్న తల్లి యోకబి. జొరొగో కుటుంబానికి అది చిన్న కోరికేమీ కాదు. చదువు అంటే కేవలం పుస్తకాలే కాదు స్కూలుకు వెళ్ళేందుకు ఒక జత బట్టలు కూడా కావాలి. అందుకే పిల్లలందరిలోకి ఒక్కరికే చదివే అవకాశం ఉంది. అది అందరికన్నా చిన్నవాడైన జొరొగోకి దక్కింది. ఆ ‘అదృష్టాన్ని’ నిలబెట్టుకోవడానికి జొరొగో ఏ పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నదే ప్రధానంగా కథ.

జొరొగో తండ్రి నుగొతో తన సొంత భూమిలోనే వెట్టిచేయాల్సిన పరిస్థితి. భూమిని తన ప్రాణం కన్నా మిన్నగా ఎంచుకొనే నుగొతో తన భూముల్ని ఆక్రమించుకొన్న తెల్ల భూస్వామి హావ్‌లాండ్స్‌ దగ్గరే పనిచేస్తుంటాడు. ఇద్దరు భార్యలు, వాళ్ళ పిల్లలు అంతా కలిపి పెద్ద కుటుంబాన్నే పోషించాల్సి వచ్చినా అతని ఇద్దరు భార్యలూ సొంత అక్కచెల్లెళ్లలా కలిసిపోయి  సఖ్యంగా ఉంటారు. కానీ ఆ కుటుంబం సంతోషం కేవలం ఆ కుటుంబంలోని వ్యక్తుల మీద ఆధారపడినది కాదు. నుగొతో యజమాని హావ్‌లాండ్స్‌; నల్లవాడైనప్పటికీ హావ్‌లాండ్స్‌ తొత్తుగా పనిచేస్తూ తోటి ప్రజలని చిత్రహింసలు పెట్టే నల్ల భూస్వామి జాకబో; నుగొతో కొడుకులు పనిచేసే యజమానులు, ఇంతమంది మీద వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. హావ్‌లాండ్స్‌తో సహా ఈ అందరి పరిస్థితినీ నిర్ణయించేది అప్పటి బ్రిటిష్‌ వలస ప్రభుత్వం. ఈ అందరికీ అప్పటికి ఇంకా పూర్తిగా అర్థం కాకపోయినా ఎక్కడో నేపథ్యంలో జరుగుతూ పీడిత ప్రజలకు ఒక సన్నని వెలుగురేఖలా ఆశని కల్పిస్తున్న ‘మౌ మౌ’ సాయుధ పోరాటం.

ఈ మొత్తం నవలలోని పరిస్థితులు ఇక్కడి పరిస్థితులతో దగ్గరగా కనిపిస్తూ ఆ పాత్రలని మనకి  చేరువ చేస్తాయి. తూర్పు ఆఫ్రికాలో ఇంగ్లీషులో వెలువడిన తొలి తరం గొప్ప నవలలో ఒకటిగా ఇది పేరు పొందింది.
ఈ నవలను ఎ.ఎం. అయోధ్యా రెడ్డి ‘ఏడవకు బిడ్డా’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ప్రచురణ ‘మలుపు’.

బి.అనూరాధ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement