వలసవాద విముక్తి గీతం గూగీ
సందర్భం
నేను ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్ సెక్యూరిటీ జైలులో 1978లో టాయిలెట్ పేపర్ మీద రాశాను. నా మరో పుస్తకం ‘యుద్ధకాలంలో స్వప్నాలు’ను జి.ఎన్. సాయిబాబా నాగపూర్ హై సెక్యూరిటీ జైలులో ఖైదీగా ఉండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి!
సీగుల్ పబ్లిషర్స్ ఆహ్వానంపై ఇండియాకు వస్తున్న సుప్రసిద్ధ కెన్యా రచయిత గూగీ వాథియాంగో ‘మలుపు’ ప్రచురణల ఆహ్వానానికి స్పందిస్తూ ‘ఇండియాకు రావాలని ఉత్సుకతతో ఉన్నాను. ఇంక హైదరాబాదుకు రావడమంటే నాకెంతో ఇష్టం. ప్రత్యేకించి ప్రొ.జి.ఎన్. సాయిబాబా అనువదిం చిన నా బాల్యజ్ఞాపకాలు ‘యుద్ధకాలంలో స్వప్నాలు’ (Dreams in a Time of War : A Childhood Memoir) పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడమంటే అంతకన్నా ఏంకావాలి. ప్రొఫెసర్ సాయిబాబాను కలిసే అవకాశం ఉంటే ఇంకెంతో బాగుండేది’ అని రాశారు.
గూగీ నవలల్లో ఆఫ్రికా ప్రజలు ద్వేషించే యూరపు వలసవాదుల తర్వాత మనకు కనిపించేది గుజరాతీ వ్యాపారులే. కాని ఆయనకు భారతప్రజల పట్ల వాళ్ల పోరాటాల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. గూగీ మొదటిసారి 1996 ఫిబ్రవరిలో ఎఐపిఆర్ఎఫ్ (ఆల్ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్) ఆహ్వానంపై ఢిల్లీలో జరిగిన జాతుల సమస్యపై అంతర్జాతీయ సదస్సుకు వచ్చాడు. అక్కడ ఆయన ప్రపంచీకరణ జాతుల సమస్య గురించి చేసిన ప్రసంగానికి సాయిబాబా అధ్యక్షత వహించాడు.
అక్కడినుంచి గూగీ హైదరాబాదు, కాకతీయ వర్సిటీ, 1990 వరకు కరీంనగర్ విప్లవోద్యమ అమరుల స్మృతిలో నిర్మించిన హుస్నాబాద్ స్థూపం చూశారు. తన ఇండియా పర్యటన ప్రభావంతోనే ‘విజార్డ్ క్రౌ’ అనే బృహత్తర నవల రాశాడు. నాటినుంచీ తెలంగాణ ప్రాంతంలోని విప్లవోద్యమం, ఇక్కడి జీవితానికి, పోరాటానికి తాను ఎంచుకున్న ఒక సంభాషణ వంటి సాయిబాబాతో తనకు గాఢానుబంధం ఏర్పడింది.
గూగీని ఢిల్లీ జాతీయ సదస్సుకు పిలిచిన నవీన్‌బాబు, ఆ తర్వాత కాలంలో విప్లవోద్యమంలో ఎన్కౌంటర్లో అమరుడయినాడని రాసినపుడైనా, పీపుల్స్‌వార్ కేంద్రకమిటీ సభ్యుల ఎన్కౌంటర్ తర్వాత 1999 డిసెం బర్ ఆఖరులో రాజ్యం హుస్నాబాదు స్థూపాన్ని కూల్చేసిందని రాసినా ఆయన ఈ చీకటిమబ్బు అంచున ఎప్పుడూ మీ వర్తమానంలో ఒక మెరుపుతీగ వంటి ఆకాంక్ష, ఆశ మిగిలే ఉంటాయి అని రాసేవాడు. మీకు పోరా టం ఉంటుంది, అమరుల జ్ఞాపక చిహ్నాలను తుడిచేసినా వాళ్ల ఆకాంక్షలను జెండాలుగా పూని నడిచే పోరాటం ఉంటుందని రాశారు.
మనసును వలసవాదం నుంచి విముక్తం చేయాలని, భాషను ఒక పదునైన అస్త్రంగా, సాహిత్యాన్ని అత్యంత ఆధునిక, సాంకేతిక నైపుణ్యంతో మెత్తటి మట్టిలాగ మార్చగలగాలంటే భాషా సాహిత్యాలు కూడ మానవశ్రమ నుంచి ఉత్పత్తి అయినవేననే ఎరుక కలగాలని ఆయన ఢిల్లీ సదస్సులోనూ, నిజాం కాలేజి సభలోను, చలసాని ప్రసాద్ అధ్యక్షతన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విరసం సభలోనూ మాట్లాడాడు.
తెలుగు భాషలో వస్తున్న ప్రజా విప్లవ సాహిత్యాన్ని నేరుగా గికియు భాషలోకి తీసుకుపోగలిగితే ఎంత బాగుండునని ఆశించాడు. ఈ అవగాహనే గూగీని ప్రజాస్వామిక పోరాటయోధుడైన సాయిబాబాతో నిరంతర అనుబంధంలో కొనసాగించింది. గూగీ తన నవలలు, నాటకాలు, ప్రజారంగస్థల నిర్మాణం వలన కెన్యాలోని నియంతలకు కన్నెర్ర అయి 1978–79 కెన్యా ఆత్యయికస్థితి కాలంలో జైలుపాలయినట్లుగానే సాయిబాబా తన గ్రీన్‌హంట్ వ్యతిరేక పోరాటం వలన జైలుపాలయ్యాడు. బెయిలుపై విడుదల కావడానికన్నా ముందే నాగపూర్ హై సెక్యూరిటీ జైల్లోని అండా సెల్లోనే గూగీ ఆత్మకథను తెలుగు చేశాడు.
‘‘అది అక్షరాలా ఒక యుద్ధకాలంలో పుట్టిన శిశువు స్వప్నాలకు ఒక యుద్ధఖైదీ చేసిన అనుసృజన. ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా దీన్ని అనువదించడం నాకు చాలా సంతోషం కలిగింది. 1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో కలిసినపుడు ఆయనతో నా కలయిక జ్ఞాపకాలను నేనెన్నటికీ మరచిపోలేను. హైదరాబాదులో ఒక పుస్తకాల దుకాణంలో అనుకో కుండా దొరికిన నా పుస్తకం ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ తన జీవితం మీద ఎంత ప్రభావం వేసిందో తాను చెప్పడం నాకింకా గుర్తుంది. నేను ఆ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్ సెక్యూరిటీ జైలులో 1978లో టాయిలెట్ పేపర్ మీద రాశాను. నా పుస్తకాల్లో మరొకదాన్ని (యుద్ధకాలంలో స్వప్నాలు) అదే సాయిబాబా మహారాష్ట్రలోని నాగపూర్ హై సెక్యూరిటీ జైలులో ఖైదీగా ఉండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి! దుర్భరమైన పరిస్థితులో అనువాదం చేయడం! ఆయన తన జీవిత, సాంస్కృతిక కార్యాచరణ కోసం జైలుజీవితం గడుపుతున్నాడంటే నాకు ఆయనతో ఇప్పుడు, మరొకసారి, ఒక ప్రత్యేకమైన బంధం ఉందనిపిస్తుంది’’.
ఆ బంధం వల్లనే, ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా అతని సహచర ఖైదీలు, ఇతర రాజకీయ ఖైదీల విడుదల కోసం, నిర్బంధాలు లేని, వ్యవస్థ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘీభావ పోరాటంలో తన వంతు కర్తవ్యంగా గూగీ వా థియాంగో ఈ ఫిబ్రవరి 18న జి.ఎన్. సాయిబాబా అనువదించిన తన పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడానికి హైదరాబాదుకు వస్తున్నాడు. కానీ మన మధ్యన మన భాషలో గూగీ యుద్ధకాలపు బాల్య జ్ఞాపకాలు వివరించిన సాయిబాబా ఉండకపోవచ్చు. తానాశించినట్లుగా నాగపూర్‌కు వెళ్లి గూగీ సాయిబాబాను కలు సుకోలేక పోవచ్చు. ఇప్పటికీ ఇరువురి భావజాలంతో పెనవేసుకొని సుదృఢమవుతున్న మన స్వేచ్ఛాకాంక్షల్ని పంచుకోవడానికి ఒక సాహిత్య, సాంస్కృతిక పోరాట సాయంత్రం కలుసుకుందాం.
ముఖ్యంగా ఈ బాధ్యత మనపై ఎందుకుందో తాను జైలులో బందీ అయిన రోజుల్లోనే 1978లో, కార్ల్‌మార్క్స్ మాటల్లో చెప్పాడు. అవి కార్ల్ల్ మార్క్స్‌కు ఒక కార్మిక ప్రతినిధి రాసినవి. కార్ల్‌మార్క్స్ 25 ఆగస్టు 1852 న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్‌కు చేసిన రచనలో ఉల్లేఖించాడు.
‘‘నేను నీ హక్కుల్ని విస్తృతపరచడానికి ప్రయత్నించాను. కాబట్టే నా హక్కుల్ని హరించారు. మీ అందరికోసం స్వేచ్ఛామందిరాన్ని నిర్మిం చాలని ప్రయత్నించాను. కాబట్టే నన్ను హంతకుణ్ణి చేసి జైల్లోకి తోసేశారు, నేను సత్యానికి స్వరాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాను. కాబట్టి నన్ను నిశ్శబ్దంలోకి తోసివేశారు. జైల్లో ఒంటరి నిర్బంధంలో నిశ్శబ్ద వ్యవస్థలో ఉంచారు. నువ్వు ఇది ప్రజా సంబంధమైన సమస్య కాదనవచ్చు. కానీ ఇది అయితీరుతుంది. ఎందుకంటే ఖైదీ భార్య గురించి పట్టించుకోని మనిషి కార్మికుని భార్య గురించి కూడ పట్టించుకోడు. బంధితుని పిల్లల గురించి వ్యగ్రత చూపనివాడు శ్రామిక సేవకుని పిల్లల గురించి కూడ వ్యగ్రత చూపడు. అందువల్ల ఇది ప్రజాసమస్య.
(గూగీ వా థియాంగో జైలు డైరీ ‘బందీ’ జైలు నోట్స్ నుంచి)
(ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా అనువదించిన గూగీ వా థియాంగో ‘యుద్ధకాలంలో స్వప్నాలు’ పుస్తకాన్ని హైదరాబాదు, తెలుగు విశ్వవిద్యాలయంలో రేపు సాయంత్రం 5.30 గంటలకు ఆవిష్కరిస్తారు)
వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యులు
వరవరరావు