నవల రాయనుందా?
గాసిప్
సోనం కపూర్ ఏ ముహుర్తాన జైపూర్ లిటరరీ ఫెస్టివల్‌లో పాల్గొందోగానీ... అప్పటి నుంచి ఆమె పుస్తకాల ప్రేమలో పడిపోయింది. జైపూర్‌లో ఆమె ఎందరో ప్రసిద్ధ సాహితీవేత్తలతో మాట్లాడింది. పనిలో పనిగా... తప్పకుండా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన పుస్తకాల పేర్లు అడిగిందట. అవి చదివిందా లేదా? అనేది తెలియదుగానీ, కొత్త పుస్తకాలు ఏవి విడుదలైనా వాటి గురించి ఆసక్తి ప్రదర్శిస్తుందట. తన కాలక్షేప సమయాన్ని ఒకప్పుడు టీవీకే పరిమితం చేసిన సోనం ఇప్పుడు వీలైనంత ఎక్కువగా పుస్తకాలు చదవడానికే ప్రాధాన్యత ఇస్తుందట.
అంతేనా? తాను చదివిన పుస్తకాలలో నచ్చిన వాక్యాలను, భావాలను డైరీలో నోట్ చేసుకుంటుందట. వాటిని స్నేహితులకు వినిపిస్తుందట. పుస్తకాలు చదివే క్రమంలో రాయాలనే కోరిక పుట్టడం సహజం. ఇప్పుడు సోనం కపూర్ కూడా అదే స్థితిలో ఉంది. తన మనసులోని భావాలను అందంగా కాగితంపై పెడుతుందట. అంతేకాదు... ఒక నవల రాయడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అదేకనుక నిజమైతే, ఆ నవల హిట్ అయితే ఇక ముందు సోనం కపూర్ అనే పేరు ముందు ‘ప్రముఖ రచయిత్రి’ అనే విశేషణం చేర్చడం తప్పని సరేమో!