సొహైలా అబ్దుల్ అలీ
‘సామాజిక వేదనలకు స్థానం కల్పించడం... రాసే వారికి సమాన వేదిక ఇవ్వడం’ ప్రతి ఏటా జైపూర్‌లో జరిగే ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ (జెఎల్‌ఎఫ్) ప్రధాన లక్ష్యం. ఆసియాలోనే అతి పెద్ద లిటరేచర్ ఫెస్టివల్‌గా చెప్పుకునే ఈ సాహితీ ఉత్సవం 15వ వేడుక మార్చి 10 నుంచి 14 వరకూ 5 రోజుల పాటు జరిగింది. పురుషుల సంఖ్యతో సమానంగా స్త్రీలు పాల్గొని తాము ఏమి ఆలోచిస్తున్నారో, ఏమి రాశారో, ఏమి రాయాలనుకుంటున్నారో పాఠకులతో పంచుకున్నారు. కథలు, కవిత్వం, నవల, నాన్ ఫిక్షన్, పరిశోధన, ప్రచురణ, పురాణాల పునఃకథనం, చిత్రలేఖనం, గానం... ఓహ్... భారతదేశపు నలు మూలల నుంచి వచ్చిన స్త్రీల ప్రతిభ, వర్తమాన సృజన ఈ ఫిస్టివల్‌లో పాఠకులకు తెలిసింది. ‘జెఎల్‌ఎఫ్ 2022’లో పాల్గొన్న మహిళా రచయితల్లో కొందరి పరిచయం నేటి నుంచి ధారావాహికంగా... సాక్షి పాఠకులకు ప్రత్యేకంగా.
ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి ఊపేసింది. వణికించింది. తాళాలు బిగించుకుని కూచునేలా చేసింది. కాని...ఈ మహమ్మారికి నీడలా ‘షాడో పాండమిక్’ లేదా ‘సైలెంట్ పాండమిక్’ కూడా నడిచింది. అదే స్త్రీలపై సాగిన హింస. లాక్‌డౌన్ కాలంలో ప్రపంచవ్యాప్తంగా స్త్రీలపై సాగిన హింసను ‘షాడో పాండమిక్’ అంటున్నారు. యుద్ధాలు వచ్చినా, రోగాలు వచ్చినా తొలి బాధితులు స్త్రీలే అంటారు సొహైలా అబ్దుల్ అలీ. ఆమె రాసిన ‘వాట్ వుయ్ టాక్ అబౌట్ వెన్ వుయ్ టాక్ అబౌట్ రేప్’ పుస్తకం ఆరు భాషల్లో అనువాదం అయ్యింది. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022’ ప్రారంభ సెషన్‌లో ఆమె మాట్లాడింది ఏమిటి?
‘సునామి వచ్చినా, యుద్ధం వచ్చినా, కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా మొదట నష్టపోయేది స్త్రీలేనని మనకు తెలుసు. ‘షాడో పాండమిక్’ అనుకుంటూ ఇంకా ఎంత కాలం దాని గురించి ఆశ్చర్యపోవడం. స్త్రీల జీవితాల మెరుగు కోసం చర్చించాలి’ అంటుంది సొహైలా అబ్దుల్ అలీ. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ‘ది జెండర్ కంటాజియన్’ అనే అంశం మీద ఆమె మాట్లాడారు. ‘నాలుగు గోడల మధ్య మనకు చాలా ఇష్టమైన వారితో బంధింపబడ్డా మనకు విసుగు వస్తుంది. అది ప్రదర్శించబుద్ధవుతుంది.
లాక్‌డౌన్‌లో ఇళ్లల్లో ఈ విసుగును బయటకు చూపలేని హింసను స్త్రీలు భరించారు. మగవారికి కలిగిన విసుగు తమ మీద హింసగా మారినా భరించారు. మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి సమయాల్లో ఇంటి నుంచి బయటపడటానికి మనకు సరైన హెల్ప్‌లైన్లు లేవు, షెల్టర్లు లేవు, ఆర్థికంగా ఆదుకునే వ్యవస్థ లేదు. వాటి గురించి ఆలోచించాలి. అయితే ఇలాంటి సమయాల్లోనే మన దేశంలో కొన్నిచోట్ల స్త్రీల మధ్య ఐక్యత కనిపించింది. ఇంట్లో హింస ఎదుర్కొంటున్న స్త్రీలు గోడల మీద బాది సంకేతాలు ఇవ్వడం ద్వారా పక్కింటి స్త్రీల మద్దతు సంపాదించి రక్షణ పొందారు’ అంటారామె.
న్యూయార్క్‌లో స్థిరపడ్డ ఈ మహారాష్ట్ర యాక్టివిస్ట్ భారతదేశపు తొలి ‘రేప్ సర్వయివర్’. అవును. తన మీద జరిగిన గ్యాంగ్ రేప్‌ను తన పేరును దాచుకోకుండా మొట్టమొదటిసారి మన దేశంలో బయటకు చెప్పిన మహిళ. ‘రేప్‌కు గురైన స్త్రీలకు నేటికీ మన దేశంలో గొంతు లేదు. వారు తమపై జరిగిన ఘోరాన్ని తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ బయటకు చెప్పే పరిస్థితులు ఈ దేశంలో లేవు’ అంటారు ఆమె.
1980లో గ్యాంగ్ రేప్
సొహైలాకు 17 ఏళ్ల వయసు ఉండగా 1980లో ముంబైలోని ఒక గుట్ట మీదకు మిత్రునితో సాయంత్రపు షికారుకు వెళ్లింది. చీకటి పడుతుండగా నలుగురు వ్యక్తులు కత్తులు చూపించి వాళ్లను మనుషులు తిరగనివైపు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతణ్ణి చావబాదారు. సొహైలాపై సామూహిక అత్యాచారం చేశారు. చంపుదామా వద్దా అని చర్చించుకుని ఎందుకో చంపకుండా వదిలి వెళ్లిపోయారు. ‘వాళ్లు నా శరీరాన్నే అగౌరపరిచారు. నా అస్థిత్వాన్ని, ఉనికిని కాదు’ అంటుంది సొహైలా.
ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఆమెకు చాలా ధైర్యం ఇచ్చారు. ‘తెలిసిన వారు ఒకరిద్దరు ఇలా ఉండే బదులు చావే నయం’ అని అన్నారు కాని ప్రాణం కంటే శారీరక దాడి విలువైనది కాదు అని అనుకున్నాను. నా జీవితం విలువ నా శరీరంలో లేదు అనుకున్నాను. భవిష్యత్తు మీద విశ్వాసం ఉంచాను. ఇవాళ నాకో కూతురు ఉంది. నా జీవితంలో రుతువులు ఉన్నాయి. నవ్వు ఉంది. ఇవన్నీ నాలా మన దేశంలో రేప్‌కు గురైనవారు పొందడం లేదు. రేప్ అయ్యిందంటే ఇక జీవితమే లేదనుకుంటున్నారు’ అంటుందామె.
పుస్తకం రాసి
1983లో సొహైలా తన మీద జరిగిన అత్యాచారాన్ని వివరంగా ఒక హిందీ పత్రికలో రాసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2012లో ‘నిర్భయ’ ఘటన జరిగినప్పుడు తన రేప్ క్షోభను ఆమె న్యూయార్క్ టైమ్స్ ఎడిట్‌లో రాస్తే ఆ పేజీని అంతకుముందు ఎప్పుడూ చదవనంత మంది పాఠకులు చదివారు. 1998 నుంచి సొహైలా రచనలు చేస్తోంది. ఆమె రెండు నవలలు ‘మేడ్‌ఉమన్ ఆఫ్ జాగోర్’, ‘ఇయర్ ఆఫ్‌ది టైగర్’ పాఠకాదరణ పొందాయి.
2018లో ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం జరుగుతున్నప్పుడు ‘వాట్ వుయ్ టాక్ అబౌట్ వెన్ వుయ్ టాక్ అబౌట్ రేప్’ పుస్తకం విడుదలైంది. రేప్‌గు గురైన స్త్రీలు తమను తాము కూడగట్టుకోవడం గురించి, సమాజం వారికి ఇవ్వాల్సిన మద్దతు గురించి ఈ పుస్తకం చర్చిస్తుంది.
‘స్త్రీలు ఎవరికీ సొంత ఆస్తులు కాదు’ అంటుంది సొహైలా. ‘పెళ్లి అయినంత మాత్రాన ఆమె భర్త ఆస్తి అయిపోతుందా? ఆమె అనుమతి లేకుండా సాగే మారిటల్ రేప్‌ను ఎలా సమర్థిస్తాం?’ అంటుందామె.
అందరూ తెలుసుకోవాల్సిన వ్యక్తిత్వం సొహైలాది. ‘రేప్’ గురించి ఆమె రాసిన పుస్తకం తప్పక తెలుసుకోదగ్గది.
– సాక్షి ప్రత్యేక ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment