‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024’లో సుధామూర్తి; సుధామూర్తి బయోగ్రఫీ
1974. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం మొదటిసారి సుధామూర్తి, నారాయణమూర్తి పూణెలో కలిశారు. వారి మధ్య ప్రేమ చిగురించడానికి దోహదం చేసింది పుస్తక పఠనం. ఆ ప్రేమ కథ ఏమిటో 50 ఏళ్ల తర్వాత ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024’లో పంచుకున్నారు సుధామూర్తి. తమ సుదీర్ఘ వైవాహిక జీవితం సఫలం కావడానికి ఇద్దరూ తీసుకున్న జాగ్రత్తలు చెప్తూ
ఈనాటి యువతకు అనుభవంతో నిండిన సూచనలు చేశారు.
అందమైన ప్రేమకథలు, సఫలమైన ప్రేమకథలు తెలుసుకోవడం బాగుంటుంది. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో ఫిబ్రవరి 5న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి పాల్గొన్నారు. చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన బయోగ్రఫీ ‘యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ డేస్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’ విడుదలైన సందర్భంగా తనకు నారాయణమూర్తికీ మధ్య ఎలా ప్రేమ పుట్టిందో కొద్దిగా సిగ్గుపడుతూ, ముసిముసిగా నవ్వుకుంటూ గుర్తు చేసుకున్నారు. ఆ ప్రేమ కథ వినండి.
1974 అక్టోబర్.
పూణెలోని ‘టెల్కొ’లో మొదటి మహిళా ఇంజనీరుగా చేరిన సుధ రోజూ కంపెనీ బస్‌లో వచ్చి వెళుతుండేవారు. ప్రసన్న ఆమె కొలీగ్. అతను ఏదో ఒక పుస్తకం చదువుతుంటే ఏ పుస్తకమా అని సుధ తొంగి తొంగి చూసేవారు. అతను చదివే ప్రతి పుస్తకం మీద ఒకే పేరు ఉండేది... మూర్తి అని. ఒకరోజు ఉండబట్టలేక ‘ఎవరీ మూర్తి’ అని అడిగారు సుధ. ‘నా రూమ్మేటు. పుస్తకాల పిచ్చోడు. చాలా పుస్తకాలు చదువుతాడు’ అన్నాడు ప్రసన్న.
‘నీకూ పుస్తకాల పిచ్చేగా. కావాలంటే పరిచయం చేస్తానురా’ అన్నాడు. ‘అమ్మో... బేచిలర్‌ల రూముకు వెళ్లడమా’ అని సుధ జంకారు. కాని కుతూహలం పట్టలేక ‘ఫలానా రోజున ఐదు నిమిషాలకు వచ్చి వెళతా’ అని ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఆలోచనలు రకరకాలుగా సాగాయి. ఈ మూర్తి ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడా... రింగుల రింగుల జుట్టుతో ఉంటాడా.. షోగ్గా (అప్పటికి హిందీ సినిమాల ఫ్యాన్ కాబట్టి) రాజేష్ ఖన్నాలా ఉంటాడా అని ఒకటే ఊహలు.
తీరా రూముకు వెళ్లేసరికి దళసరి కళ్లద్దాల బక్కపలచటి యువకుడు ఎదురుపడ్డాడు. సుధని చూసి, ఆమెకు పుస్తకాలంటే ఇష్టమని తెలిసి తన దగ్గరున్న పుస్తకాలన్నీ చూపించాడు. ఆమె బయల్దేరే ముందు అబ్బాయిలు వేసే పాచిక ‘కావాలంటే తీసుకెళ్లి చదివి ఇవ్వు’ అన్నాడు. కొన్నిరోజుల తర్వాత ‘మనం డిన్నర్ చేద్దామా’ అని ఆహ్వానించాడు. దానికీ భయమే సుధకు. ‘వస్తా. కాని మన కామన్‌ఫ్రెండ్ ప్రసన్న కూడా మనతో ఉండాలి.
నా వాటా బిల్లు డబ్బులు నేనే కడతా’ అందామె. వారి స్నేహం బలపడింది. ఒకరోజు నారాయణమూర్తి ధైర్యం చేసి సుధతో చెప్పాడు– ‘ఆరోజు నువ్వు మొదటిసారి నా రూమ్‌కు వచ్చి వెళ్లాక అంతవరకూ లేని వెలుగు వచ్చినట్టయ్యింది. జీవితం పట్ల ఇంత ఆసక్తి ఉన్న అమ్మాయిని నేను చూళ్లేదు’... ఆ మాటలే ప్రేమను ప్రపోజ్ చేయడం. ఆమె సంతోషంగా నవ్వడమే ప్రేమను అంగీకరించడం. ప్రేమ మొదలైన నాలుగేళ్లకు సుధ.. సుధామూర్తి అయ్యారు.
‘నారాయణమూర్తి, నేను భిన్నధృవాలం. నేను అన్నింటికీ మాట్లాడతాను. అతను అసలు మాట్లాడడు. నాకు అన్నింట్లో జోక్యం కావాలి. అతను అవసరమైతే తప్ప జోక్యం చేసుకోడు. మా జీవితంలో అనంగీకారాలు, ఆర్గ్యుమెంట్లు లేవని కాదు. ఇన్ఫోసిస్ మొదలెడుతున్నప్పుడు నువ్వు ఇందులో ఉండకూడదు అన్నాడు నారాయణమూర్తి.
ఐదేళ్లు నేను పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను. అప్పుడప్పుడు కొంత చివుక్కుమంటూండేది. కాని తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా నేను సామాజిక సేవతో ఎందరి జీవితాలకో చేయూతనిచ్చి తృప్తి పొందాను. వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఎవరిని వారులా ఉండనివ్వాలి. నారాయణమూర్తి కోరుకున్నట్టుగా నేను అతణ్ణి ఉండనిచ్చాను, నాలా నన్ను అతను ఉండనిచ్చాడు’ అన్నారామె.
‘ఇన్ఫోసిస్ పెట్టాక అతి కష్టమ్మీద ఒక క్లయింట్ దొరికాడు. కాని పేమెంట్స్ ఇష్టమొచ్చినప్పుడు ఇచ్చేవాడు. నారాయణమూర్తికి ఉద్యోగుల జీతాలు సమయానికి చెల్లించాలని నియమం. అతను టెన్షన్ పడుతుంటే– ఎందుకంత టెన్షన్... నగలు బ్యాంకులో కుదవ పెట్టి డబ్బు తెస్తాను. సర్దుబాటు చేసుకో అన్నాను. నారాయణమూర్తి కదిలిపోయాడు.
ఎందుకంటే ఏదో అవసరం వచ్చి గతంలో తల్లి నగలు కుదువ పెట్టాల్సి వచ్చిందట. అవి విడిపించుకోలేకపోయారు. అది గుర్తొచ్చి వద్దు వద్దు అన్నాడు. ఏం పట్టించుకోకు.. లోను తీసుకోవడానికి సెంటిమెంట్లు ఏమిటి అని తెచ్చి ఇచ్చాను. ఆ రోజు గాజులు లేని నా బోసి చేతులను చూసి నారాయణమూర్తి చాలా బాధ పడ్డాడు. కొన్నాళ్లకు విడిపించాడనుకోండి. ఈ మాత్రం సర్దుబాట్లు కాపురంలో అవసరం’ అన్నారామె.
వైవాహిక బంధం ఎలా నిలబడుతుంది? ఆడియెన్స్‌లో ఎవరో అడిగారు.
‘నమ్మకం, సహనం, సర్దుబాటుతనం వల్ల మాత్రమే. జీవితంలో సహనం ముఖ్యమైనది. సహనంగా ఉంటే జీవితం మనకు కావలసినవి ఇస్తుంది. వైవాహిక జీవితంలో అనుకున్నవన్నీ చేసే స్వేచ్ఛ, వీలు లేకపోవచ్చు. అప్పుడు ఉన్న పరిమితుల్లోనే ఎలా ఆనందంగా ఉండాలో తెలుసుకోవాలి.
నారాయణమూర్తి ఇన్ఫోసిస్ మొదలుపెట్టి బిజీగా ఉండగా నేను ఐదేళ్లూ పిల్లల్ని చూసుకుంటూ కూడా పుస్తకాలు రాసి సంతోషపడ్డాను. వీలైనంతగా కొత్త ప్రాంతాలు చూశాను. మగవాళ్లకు సాధారణంగా ఆడవాళ్లు తమ కంటే తెలివితక్కువగా ఉండాలని ఉంటుంది. అవసరమైతే వారిని అలా అనుకోనిచ్చేలా చేస్తూ స్త్రీలు తమ సామర్థ్యాలను వీలైనంత ఉపయోగించుకోవాలి. జీవితంలో, వైవాహిక జీవితంలో రాణించాలి’ అన్నారు సుధామూర్తి.
– జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment