జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ 2022: ఆ మహిళలవి ప్రాణాలు కావా!! | Jaipur Literature Festival 2022: A Death in Shonagachhi A Novel by Rijula Das | Sakshi
Sakshi News home page

జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ 2022: ఆ మహిళలవి ప్రాణాలు కావా!!

Mar 19 2022 12:53 AM | Updated on Mar 19 2022 12:53 AM

Jaipur Literature Festival 2022: A Death in Shonagachhi A Novel by Rijula Das - Sakshi

‘పేద, దిక్కు మొక్కు లేని స్త్రీల హత్యలు పేపర్లలో వస్తుంటాయి. ఆ తర్వాత ఆ కేసులు ఏమయ్యాయో మీరెప్పుడైనా పట్టించుకున్నారా?’ అని అడుగుతుంది రిజులా దాస్‌. కోల్‌కతాలోని అతి పెద్ద రెడ్‌లైట్‌ ఏరియా ‘సోనాగాచి’లో ఎవరికీ పట్టని వేశ్యల హత్యల నేపథ్యంతో ఆమె రాసిన ‘ఏ డెత్‌ ఇన్‌ సోనాగాచి’ నవల విశేషంగా పాఠకాదరణ పొందింది. వెబ్‌ సిరీస్‌గా కూడా రానుంది. వేశ్యల జీవితాలపై ఎన్ని నవలలు వచ్చినా వారి గురించి సంపూర్ణంగా తెలిసే అవకాశం లేదు అంటున్న రిజులా ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో తన పుస్తకానికై చేసిన పరిశోధన గురించి మాట్లాడింది.

‘మురికివాడల్లో ఉన్న స్త్రీలు, భవన నిర్మాణ రంగంలో ఉన్న స్త్రీలు, కూలి పని చేసే మహిళలు, వేశ్యలు, ఇంకా ఇలాంటి మార్జినలైజ్డ్‌ సెక్షన్‌లలో ఉన్న ఆడవాళ్లలో ఎవరైనా హత్యకు గురైతే ఈ వార్త పేపర్‌లలో వస్తుంటుంది. మనం చదువుతాం. ఆ తర్వాత సౌకర్యంగా మర్చిపోతాం. ఆ హత్యలు చేసింది ఎవరో వారికి శిక్ష పడిందో లేదో పట్టించుకోము. మన సమాజంలో కొందరి ప్రాణాలకే విలువ. ఆ ప్రాణాలు తీసింది ఎవరో మనకు తెలియాలి. కాని ఇలాంటి స్త్రీలు మరణిస్తే ఎవరికీ పట్టదు. పోలీసులకూ పట్టదు. వారివి ప్రాణాలు కాదా? వారు చంపదగ్గ వారే అనుకుంటున్నామా మనం’ అంటుంది రిజులా దాస్‌. 

ఆమె రాసిన తొలి నవల ‘ఏ డెత్‌ ఇన్‌ సోనాగాచి’ గత సంవత్సరం విడుదలైంది. త్వరలో అమెరికన్‌ ఎడిషన్‌ రానుంది. ఇప్పటికే వెబ్‌ సిరీస్‌కు కూడా తీసుకున్నారు.
‘మీరు వెంటనే ఇదేదో మర్డర్‌ మిస్టరీ అని చదవడానికి బయలుదేరకండి. నా నవల యాంటీ మర్డర్‌ మిస్టరీ... యాంటీ థ్రిల్లర్‌. సమాజంలో ఒక అనామక స్త్రీ చనిపోతే ఆ కేసు తేలకపోవడం గురించి మీకెలా చింత లేదో నా నవలలో హత్యకు గురైన వేశ్య కేసు తేలాలన్న చింత నాకూ లేదు. సమాజంలో ఏ ధోరణి ఉందో ఆ ధోరణే నా నవలలో ఉంటుంది’ అంటుందామె.

కోల్‌కతాకు చెందిన రిజులా దాస్‌ చాలా ఏళ్లుగా న్యూజిలాండ్‌లో ఉంటోంది. ఆమె అక్కడ క్రియేటివ్‌ ఫిక్షన్‌లో పిహెచ్‌డి చేసింది. తన తొలి నవల రాయడానికి దక్షిణ ఏసియాలోనే అతి పెద్ద రెడ్‌లైట్‌ ఏరియా అయిన ‘సోనాగాచి’ (కోల్‌కతా) గురించి ఆమె దాదాపు నాలుగైదేళ్లు పరిశోధన చేసింది. మరో రెండేళ్లు రాసింది. అంటే ఈ మొత్తం పనికి ఆమె ఏడేళ్లు వెచ్చించింది. ‘దీనిని రాసే ముందు నేను ఇది రాయడానికి అర్హురాలినా కాదా చూసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ జీవన నేపథ్యం లేదు. ఆ కష్టాలూ తెలియదు. కాని వారు అలా ఉండటానికి నేనూ నా నగరం కోల్‌కతా నా సమాజం కారణమే కదా అనుకున్నాను. అందుకే సోనాగాచి స్త్రీలను విడిగా కాకుండా కోల్‌కతాలో భాగంగా తీసుకున్నాను. నగరం ప్రమేయం లేకుండా సోనాగాచి లేదు’ అంటుందామె.

సోనాగాచిలో దాదాపు 50 వేల మంది వేశ్యలు ఉంటారు. వీరిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్‌... వీళ్లతో కుమ్మక్కు అయిన పోలీసులు... వేశ్యలను బాగు చేస్తాం అని తిరిగే సోషల్‌ వర్కర్లు... ఆధ్యాత్మిక మార్గం పట్టిస్తాం అని చెప్పే భక్త శిఖామణులు... ఇదంతా పెద్ద వ్యవస్థ. ‘అసలు సోనాగాచిలో ఉన్న సెక్స్‌వర్కర్లు తమను రక్షించి ఈ మురికి కూపం నుంచి బయటపడేయమని మనల్ని అడుగుతారా... లేదా వారి మానాన వారిని వదిలేయమంటారా అనేది మనం ఎప్పటికీ కనిపెట్టలేం’ అంటుంది రిజులా దాస్‌.

ఆమె ఈ నవలను ‘లలీ’ అనే వేశ్య పాత్ర ద్వారా చెబుతుంది. నాసిరకం సరసకథలు రాసే రచయిత ఆమె ప్రియుడు. సోనాగాచిలో ఒక వేశ్య దారుణంగా హత్యకు గురైతే వ్యవస్థ అంతా ఇది మామూలే అని ఊరుకుంటుంది. కాని రిజులా ఏం చెబుతుందంటే అలా జరిగిన హత్యలు అంతటితో ఆగవు... అవి సోనాగాచిలో ఒక దానితో ఒకటిగా కలిసి అనేక స్త్రీ వ్యతిరేక ఘటనలకు కారణం అవుతాయి అని.

‘ఈ నవల రాసేప్పుడే డిమానిటైజేషన్‌ వచ్చింది. సెక్స్‌వర్కర్లది నోట్ల ఆధారిత వ్యవస్థ. ‘మేము ఎయిడ్స్‌ విజృంభించినప్పుడు తట్టుకుని నిలబడ్డాం కాని డిమానిటైజేషన్‌లో మాత్రం పూర్తిగా పతనమయ్యాం. అంతటి ఘోరమైన దెబ్బ మా జీవితాల్లో ఎరగం’ అని వారు అన్నారు. ఈ ముఖ్య పరిణామాన్ని నా నవలలో పెట్టడానికి మళ్లీ రీరైట్‌ చేశాను’ అంటుంది రిజులా.

సెక్స్‌వర్కర్ల దగ్గర ఉన్న చాయిస్‌ ఏమిటి? సోనాగాచి విడిచిపెట్టి వెళ్లాలి అంటే వాళ్లకు పచ్చళ్లు పెట్టడం నేర్పించి పంపించేస్తే చాలా? లేదంటే సోనాగాచిలోనే ఉండిపోవాలి అంటే ఈ హింసాత్మకమైన బతుకును ఇలాగే బతకాలా? వారికి ఉన్న చాయిస్‌ ఏమిటి? సమాజం ఇచ్చే చాయిస్‌ ఏమిటి? ఈ ప్రశ్నలను లేవనెత్తుతూ ఈ నవల ముగుస్తుంది.
ఇంగ్లిష్, బెంగాలీలలో రాసే రిజులా బాల్యంలో రష్యన్‌ సాహిత్యంతో ప్రభావితమైంది. రష్యన్‌లో కుప్రిన్‌ రాసిన ‘యమకూపం’ వేశ్యల మీద వచ్చిన గొప్ప నవల. ఇప్పుడు ఈమె రాసింది ఈ దేశ వేశ్యావాటికలను అర్థం చేయించే సమర్థమైన నవల. ఈ రెండూ మీరు చదవతగ్గవే.

సోనాగాచిలో దాదాపు 50 వేల మంది వేశ్యలు ఉంటారు. వీరిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్‌... వీళ్లతో కుమ్మక్కు అయిన పోలీసులు... వేశ్యలను బాగుచేస్తాం అని తిరిగే సోషల్‌ వర్కర్లు... ఆధ్యాత్మిక మార్గం పట్టిస్తాం అని చెప్పే భక్త శిఖామణులు... ఇదంతా పెద్ద వ్యవస్థ.

– సాక్షి ప్రత్యేక ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement