పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో బుధవారం నుంచి ఆరు రోజుల పాటు సెక్స్ వర్కర్ల ఉత్సవాలు జరగనున్నాయి.
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో బుధవారం నుంచి ఆరు రోజుల పాటు సెక్స్ వర్కర్ల ఉత్సవాలు జరగనున్నాయి. చిన్నారులను బలవంతంగా తరలించి వారిని వ్యభిచార రొంపిలోకి దించడాన్ని అరికట్టడంపై ఈసారి ఈ ఉత్సవాలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాయి. దాంతోపాటు, సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి కూడా కృషి చేస్తాయి. మొత్తం 14 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది సెక్స్ వర్కర్లు ఈ ఉత్సవంలో పాల్గొంటారు.
దర్బార్ మహిళా సమన్వయ కమిటీ (డీఎంఎస్సీ) అనే సంస్థ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. నగరంలోని ట్రయాంగ్యులర్ పార్కులో ఫిబ్రవరి మూడో తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజూ మూడు వేల మందికి తగ్గకుండా పాల్గొంటారని భావిస్తున్నారు. వేదిక చాలా చిన్నది కాబట్టి, కేవలం మూడువేల మందికి మాత్రమే ఆతిథ్యం ఇవ్వగలమని చెప్పారు. సినిమా స్క్రీనింగులు, థియేటర్లు, నృత్యాల ద్వారా తమ వర్గం మహిళలకు స్ఫూర్తినిస్తామని కమిటీ అధికార ప్రతినిధి మహాశ్వేతా ముఖర్జీ తెలిపారు.