కోల్‌కతా: ఆర్‌జీకర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై జూనియర్ వైద్యుల నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ముందుకు సాగకపోవడంతో వైద్యులు ఆందోళనల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ కోల్‌కతాలో వైద్యులు నిరసనలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వైద్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ముందు తను మాటను వినాలని, ఆ తర్వాత నినాదాలు చేయాలంటూ వైద్యులకు సూచించారు.
#WATCH | RG Kar Medical College and Hospital rape-murder case: West Bengal CM Mamata Banerjee reaches Swasthya Bhawan in Kolkata to meet the protesting doctors. pic.twitter.com/AbtdOAisKh
— ANI (@ANI) September 14, 2024
‘దయచేసి ఐదు నిమిషాలు నా మాట వినండి. ఆ తర్వాత నినాదాలు చేయండి. ఆందోళనలు చేయడం ప్రజాస్వామ్యంలో మీ హక్కు. నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. నా భద్రతా అధికారులు వద్దని వారించినా.. నేను ఇక్కడకు వచ్చాను. మీ నిరసనలకు నా సెల్యూట్. నేను కూడా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నదాన్నే. ఇంత కంటే నా పదవి పెద్ద విషయం కాదని నాకూ తెలుసు. రాత్రంతా వర్షంలోనూ మీరు నిరసనలు చేశారు. ఎంతో బాధపడి ఉంటారు. నాకు కూడా బాదేసింది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేకపోయాను.
ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నం. ఇక్కడికి నేను ముఖ్యమంత్రిగా రాలేదు. మీ దీదీ (సోదరి)గా వచ్చా. నాకు సీఎం పదవి ముఖ్యం కాదు. నేను డిమాండ్లను అధ్యయనం చేస్తాను, నేనేం ఒంటరిగా ప్రభుత్వాన్ని నడపడం లేదు కదా. ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌తో చర్చించాలి. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటాను. నేను తిలోత్తమ (హత్యాచారానికి గురైన బాధితురాలికి పెట్టిన పేరు). మీ డిమాండ్లను పరిశీలిస్తాను’’ అని ఆమె వైద్యులకు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: కోల్‌కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్..
కాగా కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో గత నెలలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగినప్పటి నుండి వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్త్య భవన్ వెలుపల ఆందోళన చేపట్టిన అనతరం రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను చర్చలకు ఆహ్వానించింది. అయితే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే నిరసనకారుల డిమాండ్‌పై అవి నిలిచిపోయాయి.
మరోవైపు జూనియర్ వైద్యులు- రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతోన్న ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని జూనియర్ వైద్యులు కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ తరఫున రాసిన నాలుగు పేజీల లేఖను ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు సైతం పంపారు.
Comments
Please login to add a commentAdd a comment