Doctors Protest: సుప్రీంకోర్టు చెప్పినా వినరా? | On Collision Course With State Bengal Doctors March To Health Secretariat | Sakshi
Sakshi News home page

సుప్రీం ఆదేశించినా.. విధుల్లో చేరని వైద్యులు.. బెంగాల్‌ ప్రభుత్వానికి తాజా డెడ్‌లైన్‌

Published Tue, Sep 10 2024 6:13 PM | Last Updated on Tue, Sep 10 2024 6:38 PM

On Collision Course With State Bengal Doctors March To Health Secretariat

కోల్‌కతాలోని ఆర్‌జీకర్‌ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై డాక్లర్లు తమ నిరసనలు రోజురోజుకీ ఉధృతం చేస్తున్నారు. ఓ వైపు వైద్యులు వెంటనే విధుల్లోకి చేరాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు ఆందోళనలు విరమించి, విధుల్లో చేరి రోగులకు సేవలు అందించాలని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. విధుల్లో చేరని వారిపై చర్యలు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కూడా  స్పష్టం చేసింది.

అయినప్పటికీ వైద్యులు తమ ఆందోళనలపై వెనక్కి తగ్గడం లేదు. ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తేలేదంటూ వైద్యులు చెబుతున్నారు.

మరోవైపు సుప్రీం ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత బెంగాల్‌ ప్రభుత్వం ముందు కొత్తగా డెడ్‌లైన్‌ పెట్టారు. నేటి సాయంత్రం 5లోగా తమ అయిదు డిమాండ్‌లు నెరవేర్చాలని అల్టిమేటం ఇచ్చారు. లేని పక్షంలో ఆరోగ్య సచివాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ క్రమంలో వందలాది మంది జూనియర్‌ వైద్యులు కోల్‌కతా శివార్లలోని సాల్ట్ లేక్‌లో ఉన్న స్వస్థ భవన్ వైపు ర్యాలీగా కదులుతున్నారు. స్వస్థ భవన్  ప్రవేశద్వారం వద్ద ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాము విధించిన షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాతే తిరిగి విధుల్లో చేరుతామని ప్రకటించారు.

అయితే వైద్యుల అయిదు డిమాండ్లలో కోల్‌కతా సిటీ పోలీస్‌ చీఫ్‌ వినీత్‌ గోయల్‌తో సహా, ఆరోగ్య కార్యదర్శి, హెల్త్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌, వైద్య విద్య డైరెక్టర్‌లను తొలగించాలని కోరుతున్నారు. న్యాయస్థానం విధించిన డెడ్‌లైన్‌ పూర్తి అయినా.. వైద్యులు మాత్రం ఇంకా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement