RG Kar Hospital: 50 మంది డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా | 50 Senior Doctors At RG Kar Hospital Resign To Support Juniors Protest | Sakshi
Sakshi News home page

RG Kar Hospital: 50 మంది డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా

Published Tue, Oct 8 2024 3:26 PM | Last Updated on Tue, Oct 8 2024 3:43 PM

50 Senior Doctors At RG Kar Hospital Resign To Support Juniors Protest

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీఆర్‌ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతుగా ఆర్జీకర్‌ ఆసుపత్రికి చెందిన 50 మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు మంగళవారం  మూకుమ్మడి రాజీనామా చేశారు.

కాగా హాస్పిటల్‌లో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్‌కున్యాయం చేయాలని, ఆసుపత్రిలో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు జూనియర్ డాక్టర్లు గత శనివారం సాయంత్రం నుంచి'ఆమరణ నిరాహార దీక్ష' చేపట్టిన విషయం తెలిసిందే. రోజురోజుకీ వీరి నిరసనలకు వైద్యుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలోనే నిరసనలు చేస్తున్న డాక్టర్లకు మద్దతుగా 50 మంది సీనియర్‌ వైద్యులు రాజీనామా చేశారు. దీంతో అక్కడున్న విద్యార్ధులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు.

కాగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు కేంద్రీకృత రెఫరల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, పడకల ఖాళీల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు. పని ప్రదేశాల్లో సీసీటీవీ ఆన్-కాల్ రూమ్‌లు వాష్‌రూమ్‌ల కోసం అవసరమైన నిబంధనలను నిర్ధారించడానికి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు, ఆసుపత్రుల్లో పోలీసు రక్షణను పెంచాలని, పర్మినెంట్ మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని, వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల విషయంలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని జూనియర్‌ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌పై సీబీఐ కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక పోలీసుల దగ్గర పౌర వలంటీరుగా పనిచేస్తున్న సంజయ్‌ రాయ్‌ ఆగస్టు 9న ఈ నేరానికి పాల్పడ్డాడని పేర్కొంది. 

ఆస్పత్రి సెమినార్‌ హాల్‌లో ట్రెయినీ డాక్టర్‌ తన బ్రేక్‌ సమయంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అయితే చార్జిషీటులో గ్యాంగ్‌రేప్‌ గురించి ప్రస్తావించలేదు. అలాగే విచారణ ముగిసినట్లూ పేర్కొనలేదు. దాదాపు 200 మంది స్టేట్‌మెంట్లను సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. సుమారు 100 మంది సాక్షులను విచారించింది. ఇవన్నీ రాయ్‌నే ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్నాయని సీబీఐ వర్గాల సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement