bishnoi community
-
అసలు హీరో అనిల్‌ను వదిలేసి.. లారెన్స్‌కు ప్రాధాన్యం.. కరెక్ట్ కాదు!
ఒక లక్ష్యం కోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూ, పని చేస్తున్నవారు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. 48 ఏళ్ల అనిల్ బిష్ణోయ్ అటువంటివాడే. ఆయన విద్యావంతుడే కాదు రైతు కూడా! ఆవాలు, పత్తి పండించేవాడు. వన్యప్రాణుల ప్రేమికుడు, జంతువులు... ముఖ్యంగా కృష్ణ జింకలు అంటే ఆయనకు చిన్నతనం నుంచీ ప్రేమ ఎక్కువ! జంతువులను వేటాడేవారిని అతడు తీవ్రంగా నిరసిస్తాడు. హనుమాన్‌గఢ్‌లోని శ్రీగంగానగర్‌లో జంతువులను రక్షించే మిషన్‌ను ప్రారంభించడానికి వేటగాళ్లే కారణం అంటాడు అనిల్.బిష్ణోయ్ కమ్యూనిటీ వారికి కృష్ణ జింక పవిత్ర జంతువు. ఈ కమ్యూనిటీ వారి గురువైన భగవాన్ జాంబేశ్వర్ అడవినీ, వన్యప్రాణులనూ రక్షించాలనీ, తద్వారా మాత్రమే పర్యావరణ పరి రక్షణ ఉంటుందనీ చెప్పేవారు! ఆ బోధనల ప్రభావం బిష్ణోయ్ కమ్యూ నిటీపై ఎక్కువ ఉంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మీద ఇదే ప్రాంతంలో జింకను చంపిన కేసు నమోదు అవ్వడం గమనార్హం. ఇప్పుడు ఆయనకు చంపుతామనే బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. నిజానికి బిష్ణోయ్ సమాజానికి చెందినవారు సల్మాన్‌ను తమ మందిర్‌కు వచ్చి క్షమాపణ కోరమన్నారు. దీనిని ఆసరా చేసుకుని జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగస్టర్ ముఠా బెదిరింపులకు దిగిందని అంటారు. జాతీయ మీడియా అసలు హీరో అనిల్‌ను వదిలేసి లారెన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు.హనుమాన్ గఢ్ జిల్లా శ్రీగంగా నగర్‌కు చెందిన అనిల్ చిన్న నాటి నుంచే జింకల వేటగాళ్ల పట్ల కోపంగా ఉండేవాడు! వారిని పోలీస్‌లకు పట్టించేవాడు, సాక్ష్యం చెప్పి వారికి శిక్షలు పడే విధంగా చూసేవాడు! 30 ఏళ్లుగా ఈ సంరక్షకుడు 10 వేల కృష్ణ జింకలను వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడాడు! వాటి రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. గత మూడు దశా బ్దాలుగా జింకల రక్షణ కోసం ప్రచారం చేస్తున్నాడు. చదవండి: ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!50 పంచాయతీలలో కృష్ణ జింకల సహజ అవాసాలకు కలిగిన నష్టం, వేటగాళ్ల దుశ్చర్యల గురించి ప్రచార కార్యక్రమం చేపట్టాడు. కృష్ణ జింకలకు నీరు వంటి కనీస వసతులు కల్పించడానికి పూనుకుని... తన గ్రామ ప్రజల నుంచి రెండు లక్షల రూపాయలు చందా పోగు చేశాడు. దానికి తన సొంత డబ్బు కొంత జతచేసి కృష్ణ జింకల అవసరాలను తీర్చడానికి 60కి పైగా చిన్న, మధ్య తరహా నీటి వనరులను ఏర్పాటు చేశాడు. వాటికి గాయాలు అయినపుడు చికిత్స ఏర్పాట్లు కూడా చేశాడు.చదవండి: వ్యక్తిగా రతన్ టాటా ఎలా ఉండేవారు?1990లో సూరత్ గఢ్‌లో కళాశాల చదువు చదువుతున్న కాలంలోనే అటవీ రక్షణ, వన్య ప్రాణుల రక్షణ మీద జరిగిన ఒక సదస్సులో అనిల్ పాల్గొన్నాడు. ‘ఈ సదస్సు నా మనస్సుపై చాలా ప్రభావాన్ని చూపింది’ అంటాడు అనిల్! బీఏ. బీఈడీ చదువు పూర్తి కాగానే గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. రాజస్థాన్ లోని 12 జిల్లాలలో 3,000 మంది వివిధ ఉద్యోగాలు చేసుకునే వారితో కలిసి వన్యప్రాణ రక్షణ మీద, శాంతి ర్యాలీలు, సమావేశాలు పెట్టడం మొదలు పెట్టాడు. ఇప్పటి దాకా వేటగాళ్ల మీద 200లకు పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో 30 కేసులు ముగింపు దశకు చేరాయి. కొందరికి జరిమానాలు పడ్డాయి. అనిల్ బిష్ణోయ్ తుంహే సలాం! – ఎండి. మునీర్సీనియర్ జర్నలిస్ట్ -
వారి పిల్లలు చెట్లు, దైవం కృష్ణజింక
సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు రావడంతో బాలీవుడ్ సూపర్‌స్టార్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ‘కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్ నిర్దోషి’ అని అతని తండ్రి సలీంఖాన్ ప్రకటనపై బిష్ణోయ్ సంఘాలు నిరసన ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కృష్ణజింకలు, వాటితో బిష్ణోయ్ సమాజానికి ఉన్న అనుబంధం మరో సారి వార్తల్లోకి వచ్చింది.వారిది 550 సంవత్సరాల అనుబంధం!పదిహేనవ శతాబ్దంలో గురు జంబేశ్వర్ (జాంబాజీ అని కూడా పిలుస్తారు) స్థాపించిన బిష్ణోయ్ శాఖ 29 సూత్రాలతో మార్గనిర్దేశం చేయబడింది. జాంబాజీ బోధనలు వన్య ప్రాణులు, చెట్ల ప్రాముఖ్యత, సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తాయి. కృష్ణజింకను తమ ఆధ్యాత్మిక గురువుగా జాంబేశ్వర్ పునర్జన్మగా నమ్మి పూజిస్తారు.బిష్ణోయ్‌ల జానపద కథల్లోనూ కృష్ణజింక ప్రధానంగా కనిపిస్తుంది. కృష్ణజింకను తన ప్రతీకగా, వ్యక్తీకరణగా ఆరాధించమని జాంబేశ్వర్ తన అనుచరులకు ఆదేశించినట్లు చెబుతారు. తాము కృష్ణజింకలుగా పునర్జన్మ పొందుతామని బిష్ణోయ్‌లు నమ్ముతారు.చెట్లను బిడ్డల్లా చూసుకోవడం విషయానికి వస్తే...1730లో జోద్పూర్ సమీపంలోని ఖేజర్లీ గ్రామంలో చెట్లను నరికి వేయకుండా కాపాడే క్రమంలో 362 మంది బిష్ణోయిలు మరణించారు. జోద్పూర్ మహారాజా అభయ్‌సింగ్ ఆదేశాల మేరకు ఈ మారణకాండ జరిగింది.కొత్త రాజభవనాన్ని నిర్మించడానికి అభయ్ సింగ్ కలప కోసం చెట్లను నరికి వేయడానికి సైనికులను పంపాడు. అమృతాదేవి అనే మహిళ నాయకత్వంలో బిష్ణోయ్ ప్రజలు ప్రతిఘటించారు. అమృతాదేవి తదితరులు చెట్లను కౌగిలించుకొని వాటిని రక్షించడానికి సాహసోపేతంగా ప్రతిఘటించారు. ఈ సంఘటన 1973 చిప్కో ఉద్యమానికి ప్రేరణ ఇచ్చింది.(చదవండి: భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!) -
మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్
ముంబై:నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ ముంబైలోని బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. అతనిపై ముగ్గురు నిందితులు కాల్పులు జరిపారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అరెస్టు అయిన నిందితులు విచారణలో తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని చెప్పారని సమాచారం.అరెస్టయిన ఇద్దరు నిందితుల పేర్లు కర్నైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్ అని పోలీసులు గుర్తించారు. కర్నైల్ సింగ్ హర్యానా నివాసి కాగా, ధర్మరాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్ నివాసి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు గత 25-30 రోజులుగా ఆ ప్రాంతంలో రెక్కీ చేశారు. ముగ్గురు నిందితులు ఆటో రిక్షాలో బాంద్రా వద్దకు వచ్చారు. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరపడానికి ముందు, ఆ ముగ్గురూ కొంతసేపు అక్కడ వేచి ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపేందుకు నిందితులు 9.9 ఎంఎం పిస్టల్‌ను ఉపయోగించారు. ముష్కరులు మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపారని బాంద్రా పోలీసు వర్గాలు తెలిపాయి. అందులో నాలుగు బుల్లెట్లు బాబా సిద్ధిఖీకి తగిలాయి. హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. పరారైన మూడో నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు కోణాల్లో క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకటి బాంద్రాలోని ఎస్ఆర్ఏ వివాదానికి సంబంధించినది. మరొకటి లారెన్స్ బిష్ణోయ్‌కి సంబంధించినది. బాబా సిద్ధిఖీ.. బాంద్రా (పశ్చిమ) అసెంబ్లీ స్థానానికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి -
చాలా అందమైన ఫొటో..ఆమె గొప్పతల్లి...
ప్రకృతితో మమేకమై జీవించే బిష్ణోయి తెగ గురించి పర్యావరణ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకానొకనాడు చెట్ల కోసం ప్రాణాలను అర్పించిన బిష్ణోయిలు నేటికీ ప్రకృతిలోని ప్రతీ జీవితో తమ ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. జంతువులను సైతం కన్నబిడ్డల్లా సాకుతూ మానవతను చాటుకుంటున్నారు. రెండేళ్ల క్రితం జింక పిల్లకు పాలు పట్టిన ఓ బిష్ణోయి మహిళ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తప్పిపోయి వాళ్లింటికి వచ్చిందో ఏమోగానీ జింక పిల్ల ఆకలిని గుర్తించిన సదరు మహిళ... దానిని కన్నబిడ్డలా ఒళ్లో పడుకోబెట్టుకుని తన చనుబాలు తాగించింది. మాతృత్వపు వరానికి అసలైన అర్థం చెబుతూ అమ్మ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అద్భుతమైన ఫొటో.. ‘జోధ్‌పూర్‌లోని బిష్ణోయి తెగ జంతువుల పట్ల ఎంతటి ఉదారతను కలిగి ఉంటుందో తెలుస్తోంది కదా. ఇవి వాళ్ల కన్నబిడ్డల కంటే తక్కువేమీ కావు. ఓ మహిళ పాలు పట్టిస్తోంది. 1730లో రాజును ఎదురించి మరీ 363 చెట్ల ప్రాణాలు నిలిపినది వీరే’ అంటూ ప్రవీణ్ కశ్వాన్ అనే అటవీ శాఖ అధికారి మహిళ ఫొటోతో సహా ట్విటర్లో షేర్ చేశారు. ఈ క్రమంలో చిప్కో ఉద్యమకారులైన బిష్ణోయిలు మరోసారి చర్చనీయాంశమయ్యారు. ఇక అద్భుతమైన ఈ ఫొటోపై ప్రకృతి ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘చాలా అందమైన ఫొటో. ఆమె చాలా గొప్ప తల్లి. ఆమెకు శిరస్సు వహించి వందనాలు తెలపాలి. మాతృత్వానికి నిజమైన అర్థం చెప్పారు’ అంటూ సదరు మహిళపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చిప్కో ఉద్యమం క్రీస్తు శకం 1730 లో జోధ్‌పూర్ రాజు అభయ్ సింగ్ ఓ పెద్ద నిర్మాణం నిమిత్తం బికనీర్‌కు సమీపంలో ఉన్న బిష్ణోయి ప్రాంతంలో ఖేజరీ చెట్లను నరికి తీసుకురమ్మని తన సైనికులను ఆదేశించాడు. అయితే ఖేజరీ చెట్టును దైవ సమానంగా భావించే బిష్ణోయి తెగ ప్రజలను ఈ వార్త ఎంతగానో కలచివేసింది. ఈ క్రమంలో అమృతాదేవి అనే గృహిణి పిల్లలతో సహా అక్కడికి చేరుకుని చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వారంతా చెట్లను హత్తుకొని నిల్చున్నారు. ఈ విషయం ఊరంతా పాకడంతో మరో 363 మంది ఆమెకు తోడయ్యారు. చెట్లను కౌగిలించుకుని తమ నిరసన తెలియజేశారు. అయినప్పటికీ రాజు మనుషులు చెట్లను నరికేశారు. ఈ ఘటనలో రెండు వందల మందికి పైగా బిష్ణోయిలు ప్రాణాలు కోల్పోయారు. మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమైన చెట్లను కాపాడేందుకు వీరు చేసిన ‘పర్యావరణ ఉద్యమానికే చిప్కో ఉద్యమం’ అని పేరు. ఇక గురు జాంబేశ్వర్ స్థాపించిన బిష్ణోయి మతాన్ని అనుసరించే బిష్ణోయిలు ఆయనను విష్ణు అవతారంగా భావిస్తారు. వీరికి ఆయన 29 నియమాలు పెట్టాడు. వీటిలో చెట్లు, పశుపక్ష్యాదులను కాపాడటం అతి ముఖ్యమైన నియమం. This is how #bishnoi community in Jodhpur cares for animals. These lovely animals are no less than children to them. A lady feeding one. The same people, who fought King in 1730 and laid 363 life protecting Khejri trees. pic.twitter.com/keBj5SEwdG — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 18, 2019 -
ఈ అమ్మకు సోషల్ మీడియా సలాం!
న్యూఢిల్లీ: అమ్మ ఎవరికైనా అమ్మే అంటారు. ఈ ఫొటో వెనుకున్న స్టోరీ గురించి తెలుసుకుంటే మీరు అదే అంటారు. ఈ చిత్రంలో జింకపిల్లకు పాలిస్తున్న అమ్మ రాజస్థాన్‌లోని బిష్ణోయ్ సామాజిక వర్గానికి మహిళ. ప్రముఖ షెఫ్ వికాస్ ఖన్నా ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మానవత్వానికి చిరునామాగా నిలిచిన ఈ మహిళ గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ‘ఈ ఒక్క జింకపిల్లకే కాదు. తన జీవిత కాలంలో చాలా జింకపిల్లలకు చనుబాలిచ్చినట్టు ఆమె నాతో చెప్పారు. రాజస్థాన్ ఎడారుల్లో అనాథలుగా మిగిలిన, గాయపడిన ఎన్నో జింక పిల్లల ప్రాణాలు ఈవిధంగా కాపాడినట్టు వెల్లడించార’ని వికాస్ ఖన్నా వివరించారు. ప్రకృతిలోని చెట్లు, జంతువుల పట్ల బిష్ణోయ్ మహిళలు ఎంతో అనురక్తి కలిగివుంటారని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోను షేర్ చేసిన కొద్ది గంట్లోనే వేలాది లైకులు వచ్చాయి. బిష్ణోయ్ మహిళల పర్యావరణ ప్రియత్వాన్ని, సహృదయతను మెచ్చుకుంటూ కామెంట్లు వచ్చాయి. చిప్కో ఉద్యమంలో బిష్ణోయ్ మహిళలు ముందుండి పోరాడారని, కృష్ణ జింకలను తమ సొంత పిల్లల్లా సాకుతారని పలువురు ట్వీట్ చేశారు. మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఫొటోలోని మహిళకు సలాం చెబుతూ చాలా మంది పోస్టులు పెట్టారు. -
117 కిలోల నీల్గాయ్ మాంసం, 40 తుపాకులు..
ఉత్తరప్రదేశ్ అడవుల్లో అక్రమంగా వన్యప్రాణులను వేటాడుతూ వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఇంతకాలం దొరక్కుండా దర్జాగా తిరుగుతున్న ముఠా గుట్టు రట్టయింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మీరట్‌లోని రిటైర్డ్ కల్నల్ దేవీంద్ర కుమార్ బిష్ణోయ్ ఇంటిపై అధికారులు ఆదివారం నుంచి 17 గంటలపాటు సుదీర్ఘంగా జరిపిన సోదాలో 40 లైసెన్స్ లేని తుపాకులు, 117 కిలోల నీల్గాయ్ (బ్లూ బుల్) మాంసం, వన్యప్రాణుల తలలు, జింకల కొమ్ములు, ఏనుగు దంతాలు, జంతు చర్మాలతో పాటు కోటి రూపాయల నగదు దొరికింది. రిటైర్డ్ కల్నల్ దేవీంద్ర కుమార్‌తో పాటు జాతీయ స్థాయి షూటరైన ఆయన కుమరుడు కూడా అక్రమ వేట వ్యాపారం చేసే ఈ సిండికేట్‌లో భాగస్వాములని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ముకేష్ కుమార్ మీడియాకు తెలిపారు. వీరితోపాటు కొంతమంది విదేశీయులు కూడా ఈ సిండికేట్‌లో సభ్యులని అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో, డీఐజీ నివాసానికి కేవలం 500 గజాల దూరంలో ఉన్న విలాసవంతమైన తన నివాసం నుంచే దేవీంద్ర కుమార్ ఈ అక్రమ వ్యాపారం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తండ్రీకొడుకులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, వారెక్కడికెళ్లినా అత్యంత ఖరీదైన వాహనశ్రేణిలో, మందీ మార్బలంతో వెళ్తారని స్థానిక ప్రజలు తెలియజేశారు. తమ వీధిలోకి, తన ఇంట్లోకి వచ్చేవారిపై నిఘా కోసం ఇంటి సందులో, ముందు గుమ్మానికి దేవీంద్ర కుమార్ సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ తాజా ఘటనపై ఇంట్లోని పనిమనుషులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఎన్ని విధాలుగా ప్రశ్నించినా వారి నుంచి మౌనమే సమాధానం. రాష్ట్రంలో అక్రమ మాంసం వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ఉన్నతాధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈ సిండికేట్ వెలుగు చూడటం గమనార్హం. వన్యప్రాణి సంరక్షకులుగా ప్రజలు గౌరవించే బిష్ణోయ్ వర్గానికి చెందిన కుటుంబమే వాటిని అక్రమంగా వేటాడటం కూడా ఆశ్చర్యకరమే. కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తదితరులపై సుదీర్ఘ పోరాటం చేయడం ద్వారా బిష్ణోయ్‌లకు మంచి గుర్తింపు వచ్చింది.