ఒక లక్ష్యం కోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూ, పని చేస్తున్నవారు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. 48 ఏళ్ల అనిల్ బిష్ణోయ్ అటువంటివాడే. ఆయన విద్యావంతుడే కాదు రైతు కూడా! ఆవాలు, పత్తి పండించేవాడు. వన్యప్రాణుల ప్రేమికుడు, జంతువులు... ముఖ్యంగా కృష్ణ జింకలు అంటే ఆయనకు చిన్నతనం నుంచీ ప్రేమ ఎక్కువ! జంతువులను వేటాడేవారిని అతడు తీవ్రంగా నిరసిస్తాడు. హనుమాన్‌గఢ్‌లోని శ్రీగంగానగర్‌లో జంతువులను రక్షించే మిషన్‌ను ప్రారంభించడానికి వేటగాళ్లే కారణం అంటాడు అనిల్.
బిష్ణోయ్ కమ్యూనిటీ వారికి కృష్ణ జింక పవిత్ర జంతువు. ఈ కమ్యూనిటీ వారి గురువైన భగవాన్ జాంబేశ్వర్ అడవినీ, వన్యప్రాణులనూ రక్షించాలనీ, తద్వారా మాత్రమే పర్యావరణ పరి రక్షణ ఉంటుందనీ చెప్పేవారు! ఆ బోధనల ప్రభావం బిష్ణోయ్ కమ్యూ నిటీపై ఎక్కువ ఉంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మీద ఇదే ప్రాంతంలో జింకను చంపిన కేసు నమోదు అవ్వడం గమనార్హం. ఇప్పుడు ఆయనకు చంపుతామనే బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. నిజానికి బిష్ణోయ్ సమాజానికి చెందినవారు సల్మాన్‌ను తమ మందిర్‌కు వచ్చి క్షమాపణ కోరమన్నారు. దీనిని ఆసరా చేసుకుని జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగస్టర్ ముఠా బెదిరింపులకు దిగిందని అంటారు. జాతీయ మీడియా అసలు హీరో అనిల్‌ను వదిలేసి లారెన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు.
హనుమాన్ గఢ్ జిల్లా శ్రీగంగా నగర్‌కు చెందిన అనిల్ చిన్న నాటి నుంచే జింకల వేటగాళ్ల పట్ల కోపంగా ఉండేవాడు! వారిని పోలీస్‌లకు పట్టించేవాడు, సాక్ష్యం చెప్పి వారికి శిక్షలు పడే విధంగా చూసేవాడు! 30 ఏళ్లుగా ఈ సంరక్షకుడు 10 వేల కృష్ణ జింకలను వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడాడు! వాటి రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. గత మూడు దశా బ్దాలుగా జింకల రక్షణ కోసం ప్రచారం చేస్తున్నాడు.
చదవండి: ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!
50 పంచాయతీలలో కృష్ణ జింకల సహజ అవాసాలకు కలిగిన నష్టం, వేటగాళ్ల దుశ్చర్యల గురించి ప్రచార కార్యక్రమం చేపట్టాడు. కృష్ణ జింకలకు నీరు వంటి కనీస వసతులు కల్పించడానికి పూనుకుని... తన గ్రామ ప్రజల నుంచి రెండు లక్షల రూపాయలు చందా పోగు చేశాడు. దానికి తన సొంత డబ్బు కొంత జతచేసి కృష్ణ జింకల అవసరాలను తీర్చడానికి 60కి పైగా చిన్న, మధ్య తరహా నీటి వనరులను ఏర్పాటు చేశాడు. వాటికి గాయాలు అయినపుడు చికిత్స ఏర్పాట్లు కూడా చేశాడు.
చదవండి: వ్యక్తిగా రతన్ టాటా ఎలా ఉండేవారు?
1990లో సూరత్ గఢ్‌లో కళాశాల చదువు చదువుతున్న కాలంలోనే అటవీ రక్షణ, వన్య ప్రాణుల రక్షణ మీద జరిగిన ఒక సదస్సులో అనిల్ పాల్గొన్నాడు. ‘ఈ సదస్సు నా మనస్సుపై చాలా ప్రభావాన్ని చూపింది’ అంటాడు అనిల్! బీఏ. బీఈడీ చదువు పూర్తి కాగానే గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. రాజస్థాన్ లోని 12 జిల్లాలలో 3,000 మంది వివిధ ఉద్యోగాలు చేసుకునే వారితో కలిసి వన్యప్రాణ రక్షణ మీద, శాంతి ర్యాలీలు, సమావేశాలు పెట్టడం మొదలు పెట్టాడు. ఇప్పటి దాకా వేటగాళ్ల మీద 200లకు పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో 30 కేసులు ముగింపు దశకు చేరాయి. కొందరికి జరిమానాలు పడ్డాయి. అనిల్ బిష్ణోయ్ తుంహే సలాం!
– ఎండి. మునీర్
సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment