ముంబై:నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ ముంబైలోని బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. అతనిపై ముగ్గురు నిందితులు కాల్పులు జరిపారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అరెస్టు అయిన నిందితులు విచారణలో తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని చెప్పారని సమాచారం.
అరెస్టయిన ఇద్దరు నిందితుల పేర్లు కర్నైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్ అని పోలీసులు గుర్తించారు. కర్నైల్ సింగ్ హర్యానా నివాసి కాగా, ధర్మరాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్ నివాసి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు గత 25-30 రోజులుగా ఆ ప్రాంతంలో రెక్కీ చేశారు. ముగ్గురు నిందితులు ఆటో రిక్షాలో బాంద్రా వద్దకు వచ్చారు. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరపడానికి ముందు, ఆ ముగ్గురూ కొంతసేపు అక్కడ వేచి ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.
బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపేందుకు నిందితులు 9.9 ఎంఎం పిస్టల్‌ను ఉపయోగించారు. ముష్కరులు మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపారని బాంద్రా పోలీసు వర్గాలు తెలిపాయి. అందులో నాలుగు బుల్లెట్లు బాబా సిద్ధిఖీకి తగిలాయి. హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. పరారైన మూడో నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు కోణాల్లో క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకటి బాంద్రాలోని ఎస్‌ఆర్‌ఏ వివాదానికి సంబంధించినది. మరొకటి లారెన్స్ బిష్ణోయ్‌కి సంబంధించినది. బాబా సిద్ధిఖీ.. బాంద్రా (పశ్చిమ) అసెంబ్లీ స్థానానికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు.
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి
Comments
Please login to add a commentAdd a comment