ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పరారైన మూడవ నిందితుని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాల్పులకు ముందు నిందితులు పెప్పర్ స్ప్రే వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ కేసులో పట్టుబడిన నిందితులిద్దరినీ అక్టోబర్ 24 వరకు పోలీసు కస్టడీకి పంపారు.
ముంబై క్రైమ్ బ్రాంచ్ నిందితులిద్దరి నుంచి రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకుంది. నిందితులు తమ వెంట పెప్పర్ స్ప్రే కూడా తీసుకొచ్చారు. ఒక నిందితుడు గాలిలోకి పెప్పర్ స్ప్రే వెదజల్లి కాల్పులు జరపబోతుండగా, మూడో నిందితుడు(పరారీలో ఉన్న) శివకుమార్ నేరుగా కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో బాబా సిద్ధిఖీ వెంట ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. ఆకస్మిక దాడిలో వారు ఏమీ చేయలేకపోయారు.
ఈ కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ తరపున హత్యకు బాధ్యత వహించినట్లు ప్రకటించిన షుబు లోంకర్ సోదరుడు ప్రవీణ్ లోంకర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షుబు లోంకర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులకు ప్రవీణ్ లోంకర్ ఆశ్రయం కల్పించాడు. బాబా సిద్ధిఖీతో పాటు అతని కుమారుడు జీషన్ సిద్ధిఖీని కూడా చంపాలని ఆదేశాలు అందాయని పోలీసులకు పట్టుబడిన నిందితులు విచారణలో తెలిపారు. డీసీపీ క్రైమ్ బ్రాంచ్ దత్తా నలవాడే తెలిపిన వివరాల ప్రకారం అరెస్టయిన నిందితులిద్దరి నుంచి 28 లైవ్ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య?
Comments
Please login to add a commentAdd a comment