నందనపల్లిలో వ్యక్తి దారుణ హత్య
Published Mon, Feb 27 2017 11:49 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
– గొంతు కోసి, చేతులు నరికిన వైనం
– వివాహేతర సంబంధమే కారణమంటున్న పోలీసులు
కర్నూలు సీక్యాంప్: కర్నూలు మండలం నందనపల్లి గ్రామంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన యడవల్లి రాఘవేంద్ర (36) కొంత కాలంగా గ్రామంలో ఫైనాన్స్ వ్యాపారం, సీడీ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వ్యాపారంలో భాగంగా అదే గ్రామానికి చెందిన దాసు, ఆటోరాజు, సురేష్‌తో పరిచయం ఏర్పడింది. వీరంతా గ్రామంలో గ్యాంగ్‌లా ఏర్పడి తిరిగేవారు. ఈ క్రమంలో దాసు భార్యతో రాఘవేంద్రకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆటో రాజు తన స్నేహితుడు రాఘవేంద్ర భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాఘవేంద్ర.. ఆటో రాజును అంతమొందించాలని మూడు సార్లు ప్రయత్నించాడు. తృటిలో తప్పించుకున్న ఆటో రాజు, దాసు గ్రామం వీడి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
కొన్నాళ్లకు రాఘవేంద్రతో రాజీకి వచ్చినా ఒప్పుకోలేదు. గ్రామంలోకి వస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆటోరాజు, దాసు తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకుని రాఘవేంద్రను చంపడానికి రెండు వారాల నుంచి రెక్కీ నిర్వహించారు. ఆదివారం రాత్రి రాఘవేంద్ర వివాహేతర సంబంధం ఉన్న మహిళ ఇంటికెళ్లాడు. బయటకు వస్తే హత్య చేయాలని ఆటో రాజు, దాసు, సురేష్ మాటు వేశారు. సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో రాఘవేంద్ర బయటకు రావడంతో వెంబడించారు. వెంకాయపల్లె ఎల్లమ్మ గుడి సమీపంలోని నందనపల్లె బస్సు స్టేజ్ వద్ద చిక్కుచ్చుకుని కళ్లలో కారం చల్లి గొంతు కోసి, చేతులు నరికి ప్రాణాలు తీసి పరారయ్యారు. సమాచారం అందుకున్న తాలుకా పోలీసులు గ్రామానికి చేరుకుని హత్యకు కారణాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement