117 కిలోల నీల్‌గాయ్ మాంసం, 40 తుపాకులు..
ఉత్తరప్రదేశ్ అడవుల్లో అక్రమంగా వన్యప్రాణులను వేటాడుతూ వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఇంతకాలం దొరక్కుండా దర్జాగా తిరుగుతున్న ముఠా గుట్టు రట్టయింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మీరట్‌లోని రిటైర్డ్ కల్నల్ దేవీంద్ర కుమార్ బిష్ణోయ్ ఇంటిపై అధికారులు ఆదివారం నుంచి 17 గంటలపాటు సుదీర్ఘంగా జరిపిన సోదాలో 40 లైసెన్స్ లేని తుపాకులు, 117 కిలోల నీల్‌గాయ్ (బ్లూ బుల్) మాంసం, వన్యప్రాణుల తలలు, జింకల కొమ్ములు, ఏనుగు దంతాలు, జంతు చర్మాలతో పాటు కోటి రూపాయల నగదు దొరికింది.
రిటైర్డ్ కల్నల్ దేవీంద్ర కుమార్‌తో పాటు జాతీయ స్థాయి షూటరైన ఆయన కుమరుడు కూడా అక్రమ వేట వ్యాపారం చేసే ఈ సిండికేట్‌లో భాగస్వాములని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ముకేష్ కుమార్ మీడియాకు తెలిపారు. వీరితోపాటు కొంతమంది విదేశీయులు కూడా ఈ సిండికేట్‌లో సభ్యులని అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో, డీఐజీ నివాసానికి కేవలం 500 గజాల దూరంలో ఉన్న విలాసవంతమైన తన నివాసం నుంచే దేవీంద్ర కుమార్ ఈ అక్రమ వ్యాపారం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తండ్రీకొడుకులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, వారెక్కడికెళ్లినా అత్యంత ఖరీదైన వాహనశ్రేణిలో, మందీ మార్బలంతో వెళ్తారని స్థానిక ప్రజలు తెలియజేశారు.
తమ వీధిలోకి, తన ఇంట్లోకి వచ్చేవారిపై నిఘా కోసం ఇంటి సందులో, ముందు గుమ్మానికి దేవీంద్ర కుమార్ సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ తాజా ఘటనపై ఇంట్లోని పనిమనుషులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఎన్ని విధాలుగా ప్రశ్నించినా వారి నుంచి మౌనమే సమాధానం. రాష్ట్రంలో అక్రమ మాంసం వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ఉన్నతాధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈ సిండికేట్ వెలుగు చూడటం గమనార్హం.
వన్యప్రాణి సంరక్షకులుగా ప్రజలు గౌరవించే బిష్ణోయ్ వర్గానికి చెందిన కుటుంబమే వాటిని అక్రమంగా వేటాడటం కూడా ఆశ్చర్యకరమే. కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తదితరులపై సుదీర్ఘ పోరాటం చేయడం ద్వారా బిష్ణోయ్‌లకు మంచి గుర్తింపు వచ్చింది.