Basic Limit
-
వేతన జీవులకు నిరాశే మిగిలింది...
తాజా బడ్జెట్లో ఆదాయపు పన్ను చెల్లించే వారికి నిరాశే మిగిలిందని చెప్పొచ్చు. వీరికి బేసిక్ పరిమితి సహా ఇతర అంశాల్లోనూ ఎటువంటి ప్రయోజనం కలగలేదు. బడ్జెట్లోని కొన్ని అంశాలను ఒకసారి గమనిద్దాం. ⇒ ధరల పెరుగుదలకు విలవిలలాడుతున్న సామాన్యుడికి.. అందులోనూ ప్రతి ఏడాది కచ్చితంగా పన్ను చెల్లించే వారికి బడ్జెట్లో భంగపాటే మిగిలింది. ప్రస్తుతం బేసిక్ లిమిట్ రూ.2,50,000 పరిమితిని పెంచుతారని చాలా మంది ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది. మిగతా శ్లాబుల్లోనూ ఎటువంటి మార్పు లేదు. అన్ని యథాతథంగా ఉన్నాయి. ⇒ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వేతన జీవులకు ఏదో ఒక తాయిలం ఇవ్వకపోతుందా? అని అందరూ అనుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ మళ్లీ వస్తుందని ఎదురు చూశారు. కానీ ఆ ప్రస్తావనే లేదు. ⇒ పీఎఫ్ విత్‌డ్రాయల్స్, వడ్డీ మీద పన్ను వేశారు జైట్లీ. ఈ చర్యపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో తిరిగి వెనక్కు తగ్గారు. ⇒ ఇది వరకు సెక్షన్ 87ఏ కింద రిబేటు రూ.2,000 ఇచ్చే వారు. దీన్ని బడ్జెట్లో రూ.5,000కి పెంచారు. రిబేటు రూ.5,000 పొందాలంటే నికర ఆదాయం రూ.5,00,000 లోపల ఉండాలి. దీని వల్ల కొంత మందికి రూ.3,000 పన్ను భారం తగ్గింది. ⇒ ఇక 80జీజీ కింద ఇంటి అద్దె చెల్లింపు పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కి పెంచారు. దీని వల్ల ఈ పరిమితి రూ.60,000కి పెరిగింది. రూ. 36,000 పెరగడం వల్ల మీ మీ ట్యాక్స్ రేటును బట్టి 10 శాతం, 20 శాతం, 30% చొప్పున ఉపశమనం కలుగుతుంది. ⇒ చిన్న వ్యాపారస్తుల వార్షిక టర్నోవర్ రూ.కోటి లోపు ఉంటే వారి నికర ఆదాయాన్ని 8 శాతం చొప్పున డిక్లేర్ చేస్తే బుక్స్ రాయక్కర్లేదు. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ పరిమితిని రూ.2 కోట్లకు పెంచారు. దీని ప్రకారం పన్ను భారంలో ఉపశమనం లేకపోయినా బుక్స్ నిర్వహణ తదితర వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ⇒ కొంత శాతం దాటి నికర ఆదాయాన్ని లెక్కించడం కేవలం వ్యాపారస్తులకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ సదుపాయాన్ని వృత్తి నిపుణులకు కూడా ఇచ్చారు. ట్యాక్స్ ఆడిట్ వర్తించే పరిమితి రూ. 25,00,000 నుంచి రూ.50,00,000 దాకా పెంచారు. ఇది చాలా మంచి ఉపశమనం. అయితే నికర ఆదాయాన్ని టర్నోవర్‌లో 50 శాతం డిక్లేర్ చేస్తే బుక్స్, ఆడిట్ అక్కర్లేదు. కానీ అన్ని వృత్తుల్లో 50 శాతం నికరంగా మిగలదు. ⇒ నల్లధనం ప్రస్తావన ప్రత్యక్షంగా తీసుకురాకుండా.. ‘ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ 2016’ను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ కింద వారు మొత్తం ఆదాయం/సంపద తదితర వాటిపై 45 శాతం పన్ను చెల్లిస్తే.. వడ్డీలు, ప్రాసిక్యూషన్ లేకుండా చూస్తారు. ⇒ నికర ఆదాయం రూ.1 కోటి దాటిన వారికి సర్‌చార్జీ 12 శాతంగా ఉండేది. ఇప్పుడు దీన్ని 15 శాతానికి పెంచారు. ⇒ ఇప్పుడు రూ.10,00,000 దాటిన డివిడెండ్ ఆదాయంపై 10 శాతం పన్ను కట్టాల్సిందే. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
ఉద్యోగుల్లో అసంతృప్తి
* బేసిక్ లిమిట్ జోలికెళ్లని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ * రెండు కోట్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులకు నిరాశ * ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపులు మాత్రం పెంపు.. సెక్షన్ 80 సీసీడీపై * అదనంగా రూ. 50 వేల మినహాయింపు * రవాణా భత్యం పెంపుతో స్వల్ప ఊరట * ఏడాదికి రూ. కోటి దాటిన వారిపై మరో 2 శాతం సర్‌చార్జి సాక్షి, బిజినెస్ విభాగం: ఈసారి బడ్జెట్లో కేంద్రం తమను విస్మరించటంపై మధ్య తరగతి ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో గెలిచాక నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్లో వేతన జీవులకు ఊరటనిచ్చేలా బేసిక్ లిమిట్ పెంచటం వంటి పన్ను మినహాయింపు ప్రతిపాదనలుంటాయని ఆశించినా అలాంటివేమీ లేవు. అయితే సెక్షన్ 80 సీసీడీ కింద అదనపు మినహాయింపులిచ్చినా... 18 ఏళ్ల కిందట నిర్ణయించిన రవాణా భత్యాన్ని రెట్టింపు చేసినా... 2.1 కోట్ల మందికిపైగా ఉన్న పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగ వర్గాల్లో పెద్దగా హర్షాతిరేకాలేవీ లేవు. నెలకు 800 రూపాయలుగా ఉన్న ఈ పన్ను రహిత రవాణా భత్యాన్ని 1,600కు పెంచటం తెలిసిందే. తాజాగా ఆర్థిక మంత్రి ప్రకటించిన మార్పులివీ... * నెలకు రూ.9 లక్షలు ఆదాయం (ఏడాదికి కోటి) దాటిన వారిపై మరో రెండు శాతం సర్‌చార్జి విధించారు. దీంతో వీరు నెలకు రూ.5,800 వరకూ అదనంగా చెల్లించాలి. * ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంపై మినహాయింపును రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచారు. * 60 ఏళ్లు దాటిన వృద్ధుల విషయంలో దీన్ని ప్రస్తుత రూ.20,000 నుంచి రూ.30,000కు పెంచారు. * 80 ఏళ్లు దాటిన వృద్ధులు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే వారికి వివిధ చికిత్సలకయ్యే వ్యయంలో రూ.30,000 వరకు పన్ను మినహాయింపు ఇస్తారు. * 80 ఏళ్లు దాటిన వారు కొన్ని ప్రత్యేక వ్యాధులకు చేసే చికిత్స వ్యయంపై మినహాయింపును ప్రస్తుత 60,000 నుంచి రూ.80,000కు పెంచారు. * వికలాంగులకు ప్రస్తుతమనున్న మినహాయింపు పరిమితిని మరో రూ.25,000 పెంచారు. * కొత్త పింఛను పథకంలో ఇన్వెస్ట్ చేస్తే ఇచ్చే మిన హాయింపు మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. * కొత్త పింఛను పథకంలో గనక ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80 సీసీడీ కింద అదనంగా రూ.50,000 మినహాయింపు ఇస్తారు. ప్రస్తుతం వార్షిక జీతం నుంచి నేరుగా మినహాయించే బేసిక్ లిమిట్ రూ.2.5 లక్షలు. అంటే ఆ లోపు జీతం ఉన్నవారు అసలు పన్ను పరిధిలోకే రారన్న మాట. ఈ బేసిక్ లిమిట్ ఎప్పుడెప్పుడు ఎలా పెరిగిందంటే... 2010-11 వరకూ 2011-12లో 2012-13లో 2014-15లో రూ.1.5 లక్షలు రూ.1.75 లక్షలు రూ.2 లక్షలు రూ.2.5 లక్షలు 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ విషయంలో... 2010-11 వరకూ 2011-12లో 2012-13లో 2014-15లో రూ.2.4 లక్షలు రూ.2.5 లక్షలు - రూ.3 లక్షలు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పెంపువల్ల ఏడాదికి ఎవరికెంత లాభం? 10% శ్లాబ్ వారికి 20% శ్లాబ్‌కు 30% శ్లాబ్‌కు రూ.989 రూ.1,979 రూ.2,966 -
పొదుపు పెంచుకుందాం...
ధరలు పెరుగుతున్నా, పొదుపు మినహాయింపుల్లో చాలా ఏళ్ళ నుంచి మార్పులు లేకుండా ఉన్న సెక్షన్ 80సీ, సెక్షన్ 24బీలను ఎట్టకేలకు సవరించారు. కనీస ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచి ప్రతి ఒక్కరికీ కొంత లాభం కలిగించారు. ఈ మూడింటితో పాటు మరికొన్ని నిర్ణయాలు మన ఫైనాన్షియల్ ప్లానింగ్‌పై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ప్రతి ఒక్కరికీ ప్రయోజనం బేసిక్ లిమిట్‌ను రూ.50,000 పెంచడంతో పన్ను పరిధిలోకి వచ్చే అందరికీ కనీసం రూ.5,000 పన్ను భారం తగ్గింది. 80 ఏళ్లు దాటిన వారికి ఈ ఉపశమనం లేకపోవడం ఆ వర్గాలను నిరాశపరిచింది. 60 ఏళ్ల లోపు ఉన్న వారి వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచగా, 60 నుంచి 80 ఏళ్ల లోపు వారి బేసిక్ లిమిట్‌ను రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. కానీ 80 ఏళ్లు దాటిన వారి బేసిక్ లిమిట్ రూ.5 లక్షల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మార్పులు తప్ప పన్ను శ్లాబులు, సుంకాల్లో మార్పులు జరగలేదు. పన్ను భారం తగ్గించుకో... పన్ను మినహాయింపుల్లో సెక్షన్ 80సీ చాలా కీలకమైనది. అనేక పొదుపు పథకాలు, వ్యయాలన్నీ ఈ సెక్షన్ పరిధిలోనే ఉండటంతో అవకాశం ఉండి కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారు. పీఎఫ్, పీపీఎఫ్, బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, ట్యూషన్ ఫీజులు, ఇంటి రుణానికి చెల్లించే అసలు వంటి అనేక అంశాలన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి వినియోగించుకుంటే మరికొన్నింటిపై లభించే ప్రయోజనాలను వదులుకోవాల్సి వస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ చదువుల ట్యూషన్ ఫీజులే లక్షల్లో చేరుకున్న తరుణంలో 80సీ కింద వచ్చే ఇతర ప్రయోజనాలను వాడుకోలేకపోతున్నారు. ఇటువంటి తరుణంలో సెక్షన్ 80సీ పరిమితిని లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచడం కొంత ఊరటనిచ్చే అంశం. దీంతో పన్ను భారం రూ.5,000 నుంచి రూ.15,000 వరకు తగ్గుతుంది. అదే బాటలో గృహ రుణం రియల్ ఎస్టేట్ ధరలు బాగా పెరగడంతో గృహరుణాలపై లభిస్తున్న పన్ను మినహాయింపులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడంతో ఈ పరిమితిని స్వల్పంగా పెంచుతూ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. రుణం తీసుకొని ఇంటిని నిర్మించుకొని, ఆ ఇంటిలో నివసిస్తున్న వారు చెల్లించే వడ్డీపై లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచారు. సెక్షన్ 24బీ పరిధి కింద రుణంలో చెల్లించే వడ్డీపై ఇప్పటి వరకు రూ. 1.5 లక్షలు మాత్రమే ఆదాయం నుంచి తగ్గించి చూపించుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు మరో రూ.50,000 అదనంగా తగ్గించి చూపించుకోవచ్చు. దీనివల్ల పన్ను భారం రూ.5,000 నుంచి రూ.15,000 వరకు తగ్గుతుంది. మరింత దాచుకో... సెక్షన్ 80సీ పరిధి కింద వచ్చే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఇప్పటి వరకు ఏడాదికి గరిష్టంగా లక్ష రూపాయల వరకు దాచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ పరిమితిని కూడా రూ. 1.5 లక్షలకు పెంచారు. ఎటువంటి రిస్క్ లేకుండా పన్ను లాభాలతో స్థిరాదాయం కావాలనుకునే వారికి పీపీఎఫ్ అనువైనది. ఈ ఏడాది నుంచి ఇందులో అదనంగా రూ.50,000 దాచుకోవచ్చు. ఇది కాకుండా గతంలో బాగా ప్రాచుర్యం పొందిన కిసాన్ వికాస ప్రతాలను తిరిగి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. 2011లో వీటిని రద్దు చేశారు. ప్రస్తుతం ఈ పథకం కాలపరిమితి, ఎంత వడ్డీ లభిస్తుందన్న విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఆడపిల్లల చదువుకు సంబంధించి ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టారు. భారంగా డెట్ పథకాలు బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే పన్ను లాభాల పరంగా డెట్ పథకాలు ఆకర్షణీయంగా ఉండేవి. కానీ బడ్జెట్లో జరిగిన సవరణలతో డెట్ పథకాలు ఆ ఆకర్షణను కోల్పోయాయి. ఇప్పటి వరకు డెట్ ఫండ్స్‌లో 12 నెలలు మించి ఇన్వెస్ట్ చేస్తే వాటిపై 10 శాతం లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఈ పన్నును రెట్టింపు చేయడంతో పాటు, కాలపరిమితిని మూడు రెట్లు చేశారు. అంటే ఇక నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పరిధిలోకి రావాలంటే కనీసం 36 నెలలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకే అకౌంట్ ఒకే ఎలక్ట్రానిక్ అకౌంట్లో అన్ని ఆర్థిక పథకాలను భద్రపర్చుకునే విధంగా ఏకీకృత డీమ్యాట్ ఖాతాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఈ నిర్ణయం మదుపుదారులకు ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం షేర్లు మాత్రమే ఎలక్ట్రానిక్ ఖాతాలో దాచుకునే వెసులుబాటు ఉంది. ఈ మధ్యనే బీమా పథకాల్లో ప్రవేశపెట్టినా అంది ఇంకా ప్రాచుర్యం పొందకపోగా, దీని కోసం మరో ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. అలా కాకుండా బ్యాంకు డిపాజిట్లు, బీమా, ఫండ్స్, షేర్లు ఇలా అన్ని ఫైనాన్షియల్ అసెట్స్‌ను ఒకే అకౌంట్లో భద్రపర్చుకునే అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది.