పొదుపు పెంచుకుందాం... | can increase savings | Sakshi
Sakshi News home page

పొదుపు పెంచుకుందాం...

Published Sat, Jul 12 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

పొదుపు పెంచుకుందాం...

పొదుపు పెంచుకుందాం...

ధరలు పెరుగుతున్నా, పొదుపు మినహాయింపుల్లో చాలా ఏళ్ళ నుంచి మార్పులు లేకుండా ఉన్న సెక్షన్ 80సీ, సెక్షన్ 24బీలను ఎట్టకేలకు సవరించారు. కనీస ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచి ప్రతి ఒక్కరికీ కొంత లాభం కలిగించారు. ఈ మూడింటితో పాటు మరికొన్ని నిర్ణయాలు మన ఫైనాన్షియల్ ప్లానింగ్‌పై నేరుగా ప్రభావం చూపనున్నాయి.

 ప్రతి ఒక్కరికీ ప్రయోజనం
 బేసిక్ లిమిట్‌ను రూ.50,000 పెంచడంతో పన్ను పరిధిలోకి వచ్చే అందరికీ కనీసం రూ.5,000 పన్ను భారం తగ్గింది. 80 ఏళ్లు దాటిన వారికి ఈ ఉపశమనం లేకపోవడం ఆ వర్గాలను నిరాశపరిచింది. 60 ఏళ్ల లోపు ఉన్న వారి వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచగా, 60 నుంచి 80 ఏళ్ల లోపు వారి బేసిక్ లిమిట్‌ను రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. కానీ 80 ఏళ్లు దాటిన వారి బేసిక్ లిమిట్ రూ.5 లక్షల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మార్పులు తప్ప పన్ను శ్లాబులు, సుంకాల్లో మార్పులు జరగలేదు.

 పన్ను భారం తగ్గించుకో...
 పన్ను మినహాయింపుల్లో సెక్షన్ 80సీ చాలా కీలకమైనది. అనేక పొదుపు పథకాలు, వ్యయాలన్నీ ఈ సెక్షన్ పరిధిలోనే ఉండటంతో అవకాశం ఉండి కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారు. పీఎఫ్, పీపీఎఫ్, బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, ట్యూషన్ ఫీజులు, ఇంటి రుణానికి చెల్లించే అసలు వంటి అనేక అంశాలన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి వినియోగించుకుంటే మరికొన్నింటిపై లభించే ప్రయోజనాలను వదులుకోవాల్సి వస్తోంది.

ఇంజనీరింగ్, మెడికల్ చదువుల ట్యూషన్ ఫీజులే లక్షల్లో చేరుకున్న తరుణంలో 80సీ కింద వచ్చే ఇతర ప్రయోజనాలను వాడుకోలేకపోతున్నారు. ఇటువంటి తరుణంలో సెక్షన్ 80సీ పరిమితిని లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచడం కొంత ఊరటనిచ్చే అంశం. దీంతో పన్ను భారం రూ.5,000 నుంచి రూ.15,000 వరకు తగ్గుతుంది.

 అదే బాటలో గృహ రుణం
 రియల్ ఎస్టేట్ ధరలు బాగా పెరగడంతో గృహరుణాలపై లభిస్తున్న పన్ను మినహాయింపులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడంతో ఈ పరిమితిని స్వల్పంగా పెంచుతూ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. రుణం తీసుకొని ఇంటిని నిర్మించుకొని, ఆ ఇంటిలో నివసిస్తున్న వారు చెల్లించే వడ్డీపై లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచారు. సెక్షన్ 24బీ పరిధి కింద రుణంలో చెల్లించే వడ్డీపై ఇప్పటి వరకు రూ. 1.5 లక్షలు మాత్రమే ఆదాయం నుంచి తగ్గించి చూపించుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు మరో రూ.50,000 అదనంగా తగ్గించి చూపించుకోవచ్చు. దీనివల్ల పన్ను భారం రూ.5,000 నుంచి రూ.15,000 వరకు తగ్గుతుంది.

 మరింత దాచుకో...
 సెక్షన్ 80సీ పరిధి కింద వచ్చే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఇప్పటి వరకు ఏడాదికి గరిష్టంగా లక్ష రూపాయల వరకు దాచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ పరిమితిని కూడా రూ. 1.5 లక్షలకు పెంచారు. ఎటువంటి రిస్క్ లేకుండా పన్ను లాభాలతో స్థిరాదాయం కావాలనుకునే వారికి పీపీఎఫ్ అనువైనది. ఈ ఏడాది నుంచి ఇందులో అదనంగా రూ.50,000 దాచుకోవచ్చు. ఇది కాకుండా గతంలో బాగా ప్రాచుర్యం పొందిన కిసాన్ వికాస ప్రతాలను తిరిగి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. 2011లో వీటిని రద్దు చేశారు. ప్రస్తుతం ఈ పథకం కాలపరిమితి, ఎంత వడ్డీ లభిస్తుందన్న విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఆడపిల్లల చదువుకు సంబంధించి ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టారు.

 భారంగా డెట్ పథకాలు
 బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే పన్ను లాభాల పరంగా డెట్ పథకాలు ఆకర్షణీయంగా ఉండేవి. కానీ బడ్జెట్‌లో జరిగిన సవరణలతో డెట్ పథకాలు ఆ ఆకర్షణను కోల్పోయాయి. ఇప్పటి వరకు డెట్ ఫండ్స్‌లో 12 నెలలు మించి ఇన్వెస్ట్ చేస్తే వాటిపై 10 శాతం లాంగ్‌టర్మ్  క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఈ పన్నును రెట్టింపు చేయడంతో పాటు, కాలపరిమితిని మూడు రెట్లు చేశారు. అంటే ఇక నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పరిధిలోకి రావాలంటే కనీసం 36 నెలలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

 ఒకే అకౌంట్
 ఒకే ఎలక్ట్రానిక్ అకౌంట్‌లో అన్ని ఆర్థిక పథకాలను భద్రపర్చుకునే విధంగా ఏకీకృత డీమ్యాట్ ఖాతాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ నిర్ణయం మదుపుదారులకు ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం షేర్లు మాత్రమే ఎలక్ట్రానిక్ ఖాతాలో దాచుకునే వెసులుబాటు ఉంది. ఈ మధ్యనే బీమా పథకాల్లో ప్రవేశపెట్టినా అంది ఇంకా ప్రాచుర్యం పొందకపోగా, దీని కోసం మరో ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. అలా కాకుండా బ్యాంకు డిపాజిట్లు, బీమా, ఫండ్స్, షేర్లు ఇలా అన్ని ఫైనాన్షియల్ అసెట్స్‌ను ఒకే అకౌంట్‌లో భద్రపర్చుకునే అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement