ట్యాక్స్ ప్లానింగ్‌లో భాగంగా ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ వారం మరికొన్నింటి గురించి తెలుసుకుందాం. ప్రతి ఉద్యోగికి పి.పి.ఎఫ్. తప్పనిసరే. యజమాని తప్పనిసరిగా పీఎఫ్ రికవరీ చేసి, తాను మరికొంత చేర్చి, భవిష్య నిధికి జమ చేస్తారు. ఇది కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ.1,50,000 ఉంటుంది. కాస్త ఎక్కువ జీతం ఉన్న వారికి పీఎఫ్ మొత్తం రూ. 1,50,000 దాటిపోతుంది. వీరికి 80సి కింద సేవింగ్స్ చేసినా ఎటువంటి మినహాయింపు ఉండదు. ఇతర అంశాల జోలికి పోవడంవల్ల ఉపయోగం ఉండదు. తక్కువ రికవరీ ఉన్నవారు అవసరం అయితే పెంచుకోవచ్చు. వడ్డీ 8.5 శాతం వస్తుంది. వడ్డీ మీద ఎటువంటి పన్ను భారం లేదు. 15 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో 3 సదుపాయాలు ఉంటాయి. దీన్ని E,E.E. అంటారు.
ఇన్వెస్ట్ చేసినందుకు మినహాయింపు, వడ్డీకి మినహాయింపు, విత్‌డ్రా చేసుకున్నప్పుడు వచ్చే మొత్తానికి కూడా మినహాయింపు లభిస్తుంది. అంటే పన్నుభారం లేదు. దాచిన మొత్తాన్ని ఏడాదికి ఒకసారి విత్‌డ్రా చేసుకోవచ్చు (5వ సంవత్సరం తర్వాత నుండి). కోర్టుద్వారా ఎటువంటి అటాచ్‌మెంట్ చేయరు. రుణం తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఇది వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. జాయింట్‌గా తీసుకోవడానికి వీలుండదు. ఎన్నారైలకు వర్తిం చదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆలోచించుకోండి. ఉన్నవాటిలో ఇది అత్యుత్తమమైనది.
కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య
ఇక ఎన్‌ఎస్‌సీలు.. అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు. ఒకప్పుడు ఆరు సంవత్సరాల్లో రెట్టింపై ఎంతో లాభసాటిగా ఉండేవి. క్రమేపీ వడ్డీ రేటును తగ్గించేశారు. ఇప్పుడు 6.8 శాతం వస్తుంది. ఇక్కడ E.E.E నియమం వర్తిస్తుంది. కనీసం రూ. 1,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు. 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. వడ్డీని అసలుకు కలుపుతారు. 80సి కింద దక్కే ప్రయోజనం పరిమితి రూ. 1,50,000. కొన్ని సందర్భాల్లో ముందుగానే నగదుగా మార్చుకోవచ్చు. ఏడాదిలోపే తీసేసుకుంటే వడ్డీ ఇవ్వరు. మొదటి సంవత్సరం దాటి 3 సంవత్సరాల లోపల అయితే సాధారణ వడ్డీ ఇస్తారు. నామినేషన్ సదుపాయం ఉంది.
మరోవైపు, పోస్టాఫీస్‌లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంటులో జమకి 80సి మినహాయింపు లేదు. ఏటా 4 శాతం వడ్డీ ఉంటుంది. కనీసం రూ. 50 నుంచి గరిష్టంగా ఎంతైనా ఉంచవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా కొనసాగించవచ్చు. జాయింటుగా చేరవచ్చు. సింగిల్‌లో రూ. 3,500, జాయింటులో రూ. 7,000 వడ్డీకి మినహాయింపు ఉంటుంది. కానీ 80 టీటీఏ కింద రూ. 10,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు 80 టీటీబీ కింద రూ.50,000 వరకూ మినహాయింపు ఉంటుంది.
అలాగే సీనియర్ సిటిజన్లకు ఒక స్కీమ్ ఉంది. వడ్డీ 7.4 శాతం లభిస్తుంది. కనీసం రూ. 1,000, గరిష్టంగా రూ. 15,00,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. 5 సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది. మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. వడ్డీకి మినహాయింపు ఉంటుంది. వడ్డీ రూ. 50,000 దాటితే టీడీఎస్ ఉంటుంది. దీనికి 80సి వర్తిస్తుంది.60 సంవత్సరాల వారికే ఇది వర్తిస్తుంది. 55 సంవత్సరాలు దాటిన వారు రిటైర్ అయిపోతే ఇందులో చేరవచ్చు (కొన్ని షరతులకు లోబడి). జాయింటు అకౌంటు తెరిచేందుకు వీలుంటుంది. ఇలా ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు ఉన్నాయి.
- కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు)
Comments
Please login to add a commentAdd a comment