National Savings Certificates
-
చిన్న పొదుపులపై వడ్డీరేట్లు యథాతథం
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) సహా చిన్న పొదుపు పథకాలపై 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఉన్న వడ్డీరేట్లు వచ్చే 3 నెలల్లో కొనసాగనున్నాయి. చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు త్రైమాసికం ప్రాతిపదికన నోటిఫై చేసే సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాను ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4 శాతం) వరుసగా పది ద్వైమాసిక సమావేశాల్లో ఒకేరీతిన కొనసాగిస్తూ, నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులపై అదనపు వడ్డీ చెల్లింపు భారం అవకాశం లేదు. దీనివల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు, రుణాలపై రేట్లు దాదాపు యథాతథంగానే కొనసాగే వీలుంది. ఈ పరిణామం చిన్న పొదుపులపై కూడా రేట్లను ఎక్కడివక్కడే ఉంచడానికి కారణమవుతోంది. కొన్ని పథకాల రేట్లు ఇలా... ► పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై రేటు 7.1 శాతంగా ఉంది. ► నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ 6.8%. ► ఏడాది డిపాజిట్ స్కీమ్ 5.5% వడ్డీ ఆఫర్ చేస్తోంది ► బాలికా పథకం– సుకన్య సమృద్ధి యోజనపై అత్యధికంగా 7.6% వడ్డీ ఉంది. ► ఐదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై వడ్డీరేటు 7.4%. వీటిపై త్రైమాసిక పరంగా వడ్డీ అందుతుంది. ► సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీరేటు వార్షికంగా 4%గా కొనసాగుతుంది. ► ఏడాది నుంచి ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ 5.5 శాతం 6.7% శ్రేణిలో ఉంది. వీటిపైనే వడ్డీ త్రైమాసికంగా అందుతుంది. ► ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ 5.8%. -
ఎన్ఎస్సీ, పీఎఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్లలో వడ్డీరేట్లు.. పన్ను రాయితీలు ఇలా
ట్యాక్స్ ప్లానింగ్‌లో భాగంగా ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ వారం మరికొన్నింటి గురించి తెలుసుకుందాం. ప్రతి ఉద్యోగికి పి.పి.ఎఫ్. తప్పనిసరే. యజమాని తప్పనిసరిగా పీఎఫ్ రికవరీ చేసి, తాను మరికొంత చేర్చి, భవిష్య నిధికి జమ చేస్తారు. ఇది కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ.1,50,000 ఉంటుంది. కాస్త ఎక్కువ జీతం ఉన్న వారికి పీఎఫ్ మొత్తం రూ. 1,50,000 దాటిపోతుంది. వీరికి 80సి కింద సేవింగ్స్ చేసినా ఎటువంటి మినహాయింపు ఉండదు. ఇతర అంశాల జోలికి పోవడంవల్ల ఉపయోగం ఉండదు. తక్కువ రికవరీ ఉన్నవారు అవసరం అయితే పెంచుకోవచ్చు. వడ్డీ 8.5 శాతం వస్తుంది. వడ్డీ మీద ఎటువంటి పన్ను భారం లేదు. 15 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో 3 సదుపాయాలు ఉంటాయి. దీన్ని E,E.E. అంటారు. ఇన్వెస్ట్ చేసినందుకు మినహాయింపు, వడ్డీకి మినహాయింపు, విత్‌డ్రా చేసుకున్నప్పుడు వచ్చే మొత్తానికి కూడా మినహాయింపు లభిస్తుంది. అంటే పన్నుభారం లేదు. దాచిన మొత్తాన్ని ఏడాదికి ఒకసారి విత్‌డ్రా చేసుకోవచ్చు (5వ సంవత్సరం తర్వాత నుండి). కోర్టుద్వారా ఎటువంటి అటాచ్మెంట్ చేయరు. రుణం తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఇది వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. జాయింట్‌గా తీసుకోవడానికి వీలుండదు. ఎన్నారైలకు వర్తిం చదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆలోచించుకోండి. ఉన్నవాటిలో ఇది అత్యుత్తమమైనది. కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ఇక ఎన్ఎస్సీలు.. అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు. ఒకప్పుడు ఆరు సంవత్సరాల్లో రెట్టింపై ఎంతో లాభసాటిగా ఉండేవి. క్రమేపీ వడ్డీ రేటును తగ్గించేశారు. ఇప్పుడు 6.8 శాతం వస్తుంది. ఇక్కడ E.E.E నియమం వర్తిస్తుంది. కనీసం రూ. 1,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు. 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. వడ్డీని అసలుకు కలుపుతారు. 80సి కింద దక్కే ప్రయోజనం పరిమితి రూ. 1,50,000. కొన్ని సందర్భాల్లో ముందుగానే నగదుగా మార్చుకోవచ్చు. ఏడాదిలోపే తీసేసుకుంటే వడ్డీ ఇవ్వరు. మొదటి సంవత్సరం దాటి 3 సంవత్సరాల లోపల అయితే సాధారణ వడ్డీ ఇస్తారు. నామినేషన్ సదుపాయం ఉంది. మరోవైపు, పోస్టాఫీస్‌లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంటులో జమకి 80సి మినహాయింపు లేదు. ఏటా 4 శాతం వడ్డీ ఉంటుంది. కనీసం రూ. 50 నుంచి గరిష్టంగా ఎంతైనా ఉంచవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా కొనసాగించవచ్చు. జాయింటుగా చేరవచ్చు. సింగిల్‌లో రూ. 3,500, జాయింటులో రూ. 7,000 వడ్డీకి మినహాయింపు ఉంటుంది. కానీ 80 టీటీఏ కింద రూ. 10,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు 80 టీటీబీ కింద రూ.50,000 వరకూ మినహాయింపు ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఒక స్కీమ్ ఉంది. వడ్డీ 7.4 శాతం లభిస్తుంది. కనీసం రూ. 1,000, గరిష్టంగా రూ. 15,00,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. 5 సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది. మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. వడ్డీకి మినహాయింపు ఉంటుంది. వడ్డీ రూ. 50,000 దాటితే టీడీఎస్ ఉంటుంది. దీనికి 80సి వర్తిస్తుంది.60 సంవత్సరాల వారికే ఇది వర్తిస్తుంది. 55 సంవత్సరాలు దాటిన వారు రిటైర్ అయిపోతే ఇందులో చేరవచ్చు (కొన్ని షరతులకు లోబడి). జాయింటు అకౌంటు తెరిచేందుకు వీలుంటుంది. ఇలా ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఉన్నాయి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
Post Office Schemes: పోస్ట్ ఆఫీస్ టాప్ - 5 డిపాజిట్ స్కీమ్స్
ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి ఆదాయం రావాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి అని చెప్పుకోవాలి. పోస్టాఫీసు పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడి కూడా అందిస్తుంది. పోస్టాఫీసు పథకాలు నమ్మదగినవి. ఈ పథకాలు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. గరిష్ట వడ్డీ రేట్లతో ప్రజాదరణ పొందిన తపాలా కార్యాలయ పథకాలు కొన్ని సుకన్య సమృద్ధి పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం, కిసాన్ వికాస్ పాత్రా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ వంటివి ఉన్నాయి. వీటి గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం. (చదవండి: వన్‌ప్లస్ 9 ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్) సుకన్య సమృద్ధి పథకం సుకన్య సమృద్ధి పథకాన్ని సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల పేరిట ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు. సంవత్సరానికి 7.6 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రాతిపదికన లెక్కిస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం అనేది రిటైర్డ్ వ్యక్తులు, వృద్ధులకొరకు ప్రజాదరణ పొందిన పథకం. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు రూ.1000తో ఈ స్కీమ్‌లో ఖాతా తెరవొచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఒకేసారి రూ.10 లక్షలు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్లలో మీకు రూ.14 లక్షలకు పైగా వస్తాయి. వడ్డీ రూపంలో రూ.4,28,964 వరకు పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)ను ఎవరైనా తెరవవచ్చు. పిపిఎఫ్ కింద పెట్టుబడి పెట్టె నగదుపై ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1,50,000 నగదు జమ చేయవచ్చు. పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మనిహాయింపు లభిస్తుంది. పీపీఎఫ్ ఖాతాలో ఏడాదికి రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. 15 ఏళ్ల తర్వాత చేతికి రూ.40 లక్షలకు పైగా వస్తాయి. కిసాన్ వికాస్ పత్ర కిసాన్ వికాస్ పాత్రా పథకం కింద కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు. 124 నెలల్లో (10 సంవత్సరాలు 4 నెలలు) పెట్టుబడి పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది. వార్షికంగా 7.7 వడ్డీ వడ్డీ రేటు లభిస్తుంది మీరు రూ.50,000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కాలం తర్వాత రూ.73,126 లభిస్తాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు. వార్షికంగా 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే మెచ్యూరిటీ కాలం తర్వాత మాత్రమే వడ్డీ అసలు చెల్లిస్తారు. ఎన్ఎస్సీ స్కీమ్‌లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత చేతికి దాదాపు రూ.21 లక్షలు వస్తాయి. -
పొదుపు పెంచుకుందాం...
ధరలు పెరుగుతున్నా, పొదుపు మినహాయింపుల్లో చాలా ఏళ్ళ నుంచి మార్పులు లేకుండా ఉన్న సెక్షన్ 80సీ, సెక్షన్ 24బీలను ఎట్టకేలకు సవరించారు. కనీస ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచి ప్రతి ఒక్కరికీ కొంత లాభం కలిగించారు. ఈ మూడింటితో పాటు మరికొన్ని నిర్ణయాలు మన ఫైనాన్షియల్ ప్లానింగ్‌పై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ప్రతి ఒక్కరికీ ప్రయోజనం బేసిక్ లిమిట్‌ను రూ.50,000 పెంచడంతో పన్ను పరిధిలోకి వచ్చే అందరికీ కనీసం రూ.5,000 పన్ను భారం తగ్గింది. 80 ఏళ్లు దాటిన వారికి ఈ ఉపశమనం లేకపోవడం ఆ వర్గాలను నిరాశపరిచింది. 60 ఏళ్ల లోపు ఉన్న వారి వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచగా, 60 నుంచి 80 ఏళ్ల లోపు వారి బేసిక్ లిమిట్‌ను రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. కానీ 80 ఏళ్లు దాటిన వారి బేసిక్ లిమిట్ రూ.5 లక్షల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మార్పులు తప్ప పన్ను శ్లాబులు, సుంకాల్లో మార్పులు జరగలేదు. పన్ను భారం తగ్గించుకో... పన్ను మినహాయింపుల్లో సెక్షన్ 80సీ చాలా కీలకమైనది. అనేక పొదుపు పథకాలు, వ్యయాలన్నీ ఈ సెక్షన్ పరిధిలోనే ఉండటంతో అవకాశం ఉండి కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారు. పీఎఫ్, పీపీఎఫ్, బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, ట్యూషన్ ఫీజులు, ఇంటి రుణానికి చెల్లించే అసలు వంటి అనేక అంశాలన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి వినియోగించుకుంటే మరికొన్నింటిపై లభించే ప్రయోజనాలను వదులుకోవాల్సి వస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ చదువుల ట్యూషన్ ఫీజులే లక్షల్లో చేరుకున్న తరుణంలో 80సీ కింద వచ్చే ఇతర ప్రయోజనాలను వాడుకోలేకపోతున్నారు. ఇటువంటి తరుణంలో సెక్షన్ 80సీ పరిమితిని లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచడం కొంత ఊరటనిచ్చే అంశం. దీంతో పన్ను భారం రూ.5,000 నుంచి రూ.15,000 వరకు తగ్గుతుంది. అదే బాటలో గృహ రుణం రియల్ ఎస్టేట్ ధరలు బాగా పెరగడంతో గృహరుణాలపై లభిస్తున్న పన్ను మినహాయింపులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడంతో ఈ పరిమితిని స్వల్పంగా పెంచుతూ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. రుణం తీసుకొని ఇంటిని నిర్మించుకొని, ఆ ఇంటిలో నివసిస్తున్న వారు చెల్లించే వడ్డీపై లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచారు. సెక్షన్ 24బీ పరిధి కింద రుణంలో చెల్లించే వడ్డీపై ఇప్పటి వరకు రూ. 1.5 లక్షలు మాత్రమే ఆదాయం నుంచి తగ్గించి చూపించుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు మరో రూ.50,000 అదనంగా తగ్గించి చూపించుకోవచ్చు. దీనివల్ల పన్ను భారం రూ.5,000 నుంచి రూ.15,000 వరకు తగ్గుతుంది. మరింత దాచుకో... సెక్షన్ 80సీ పరిధి కింద వచ్చే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఇప్పటి వరకు ఏడాదికి గరిష్టంగా లక్ష రూపాయల వరకు దాచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ పరిమితిని కూడా రూ. 1.5 లక్షలకు పెంచారు. ఎటువంటి రిస్క్ లేకుండా పన్ను లాభాలతో స్థిరాదాయం కావాలనుకునే వారికి పీపీఎఫ్ అనువైనది. ఈ ఏడాది నుంచి ఇందులో అదనంగా రూ.50,000 దాచుకోవచ్చు. ఇది కాకుండా గతంలో బాగా ప్రాచుర్యం పొందిన కిసాన్ వికాస ప్రతాలను తిరిగి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. 2011లో వీటిని రద్దు చేశారు. ప్రస్తుతం ఈ పథకం కాలపరిమితి, ఎంత వడ్డీ లభిస్తుందన్న విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఆడపిల్లల చదువుకు సంబంధించి ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టారు. భారంగా డెట్ పథకాలు బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే పన్ను లాభాల పరంగా డెట్ పథకాలు ఆకర్షణీయంగా ఉండేవి. కానీ బడ్జెట్లో జరిగిన సవరణలతో డెట్ పథకాలు ఆ ఆకర్షణను కోల్పోయాయి. ఇప్పటి వరకు డెట్ ఫండ్స్‌లో 12 నెలలు మించి ఇన్వెస్ట్ చేస్తే వాటిపై 10 శాతం లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఈ పన్నును రెట్టింపు చేయడంతో పాటు, కాలపరిమితిని మూడు రెట్లు చేశారు. అంటే ఇక నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పరిధిలోకి రావాలంటే కనీసం 36 నెలలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకే అకౌంట్ ఒకే ఎలక్ట్రానిక్ అకౌంట్లో అన్ని ఆర్థిక పథకాలను భద్రపర్చుకునే విధంగా ఏకీకృత డీమ్యాట్ ఖాతాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఈ నిర్ణయం మదుపుదారులకు ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం షేర్లు మాత్రమే ఎలక్ట్రానిక్ ఖాతాలో దాచుకునే వెసులుబాటు ఉంది. ఈ మధ్యనే బీమా పథకాల్లో ప్రవేశపెట్టినా అంది ఇంకా ప్రాచుర్యం పొందకపోగా, దీని కోసం మరో ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. అలా కాకుండా బ్యాంకు డిపాజిట్లు, బీమా, ఫండ్స్, షేర్లు ఇలా అన్ని ఫైనాన్షియల్ అసెట్స్‌ను ఒకే అకౌంట్లో భద్రపర్చుకునే అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది.