tax concessions
-
బ్యాటరీ బండి దూకుడు
సాక్షి, హైదరాబాద్: బ్యాటరీ బండి పరుగులు పెడుతోంది. పర్యావరణ హితమైన వాహనాల పట్ల నగర వాసులు క్రమంగా ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో చాలా మంది ఇంధన భారాన్ని తగ్గించుకొనేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. వాటిలో రవాణా వాహనాల కంటే ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. గతేడాది 23 వేలకు పైగా ద్విచక్ర వాహనాలు రోడ్డెక్కాయి. ఈ సంవత్సరం మే చివరి నాటికి 12 వేలకు పైగా కొనుగోళ్లు నమోదయ్యాయి. ఈ లెక్కన ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 25 వేలు దాటవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మొదటి లక్ష వాహనాలకు జీవితకాల పన్ను నుంచి రాయితీ కల్పించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కేటగిరీకి చెందిన సుమారు 47 వేలకు పైగా కార్లు, బైక్‌లపైన ఇప్పటి వరకు రూ.220 కోట్ల వరకు రాయితీని అందజేశారు. మరో 53 వేల వాహనాలకు ఈ రాయితీ సదుపాయం వర్తించనుంది. రానున్న రెండేళ్ల వరకు ఈ అవకాశం ఉండవచ్చునని రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు. ద్విచక్ర వాహనాలే టాప్.... మొదట్లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల పట్ల విముఖత చూపారు. నాణ్యత లేని బ్యాటరీల వల్ల ప్రమాదాలు జరిగాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగా సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఉదంతంతో చాలా మంది వెనుకడుగు వేశారు. దీంతో వాహన తయారీ సంస్థలు బ్యాటరీల నాణ్యతపైన ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనరంగంలోకి ప్రవేశించడంతో సమర్థవంతమైన బ్యాటరీలు కలిగిన బండ్లు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో వాహనదారుల్లో వాటిపైన నమ్మకం కలిగింది. ఫలితంగా వీటి కొనుగోళ్లు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 50 వేలకు పైగా నమోదు కాగా, గతేడాది అనూహ్యంగా 27 వేలకు పైగా రోడ్డెక్కాయి. వీటిలో 23 వేలకుపైగా ద్విచక్ర వాహనాలే కావడం గమనార్హం. భారీగా వెయిటింగ్ లిస్టు... ప్రస్తుతం డిమాండ్ మేరకు వాహనాలు లభించడం లేదు. కొన్ని బ్రాండ్లకు చెందిన వాహనాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకొని కనీసం 3 నెలల పాటు ఎదురు చూడవలసి వస్తోంది. పెట్రోల్ వాహనాల కంటే ధర కొద్దిగా ఎక్కువే అయినా ఇంధన భారాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఒకసారి చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు మాత్రమే బండి నడిచేది. ఇప్పుడు వంద కిలోమీటర్ల వరకు పరుగులు పెట్టే వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. నిస్సందేహంగా కొనొచ్చు ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత చాలా బాగుంది. ఎలాంటి సందేహం లేకుండా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. నాణ్యమైన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న వాహనాలే ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో భద్రతా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. – సంధ్య గద్దె, ఎలక్ట్రిక్ వాహన డీలర్, లింగంపల్లి పెట్రో ‘బాదుడు’ నుంచి ఊరట పెట్రోల్ ధరల దృష్ట్యా బండి బయటకు తీయాలంటేనే వెనుకడు గు వేయాల్సి వస్తోంది. బ్యాటరీ బండితో చాలా వరకు ఈ భారం తగ్గుతుంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ అయ్యే వాహనాలు వస్తే బాగుంటుంది. – కోల రవికుమార్ గౌడ్ ధరలు కాస్త ఎక్కువే లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చి నప్పటికీ ధరలు ఎక్కువగా నే ఉన్నాయి. మధ్యతరగ తి వర్గాలకు భారంగానే ఉంది. పెట్రోల్, డీజిల్ భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాల వైపు వస్తున్నా రు. కానీ ధరలు చూడగానే వెనుకడుగు వేయాల్సి వస్తోంది. – సుధాకర్‌రెడ్డి -
ఎన్ఎస్సీ, పీఎఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్లలో వడ్డీరేట్లు.. పన్ను రాయితీలు ఇలా
ట్యాక్స్ ప్లానింగ్‌లో భాగంగా ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ వారం మరికొన్నింటి గురించి తెలుసుకుందాం. ప్రతి ఉద్యోగికి పి.పి.ఎఫ్. తప్పనిసరే. యజమాని తప్పనిసరిగా పీఎఫ్ రికవరీ చేసి, తాను మరికొంత చేర్చి, భవిష్య నిధికి జమ చేస్తారు. ఇది కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ.1,50,000 ఉంటుంది. కాస్త ఎక్కువ జీతం ఉన్న వారికి పీఎఫ్ మొత్తం రూ. 1,50,000 దాటిపోతుంది. వీరికి 80సి కింద సేవింగ్స్ చేసినా ఎటువంటి మినహాయింపు ఉండదు. ఇతర అంశాల జోలికి పోవడంవల్ల ఉపయోగం ఉండదు. తక్కువ రికవరీ ఉన్నవారు అవసరం అయితే పెంచుకోవచ్చు. వడ్డీ 8.5 శాతం వస్తుంది. వడ్డీ మీద ఎటువంటి పన్ను భారం లేదు. 15 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో 3 సదుపాయాలు ఉంటాయి. దీన్ని E,E.E. అంటారు. ఇన్వెస్ట్ చేసినందుకు మినహాయింపు, వడ్డీకి మినహాయింపు, విత్‌డ్రా చేసుకున్నప్పుడు వచ్చే మొత్తానికి కూడా మినహాయింపు లభిస్తుంది. అంటే పన్నుభారం లేదు. దాచిన మొత్తాన్ని ఏడాదికి ఒకసారి విత్‌డ్రా చేసుకోవచ్చు (5వ సంవత్సరం తర్వాత నుండి). కోర్టుద్వారా ఎటువంటి అటాచ్మెంట్ చేయరు. రుణం తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఇది వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. జాయింట్‌గా తీసుకోవడానికి వీలుండదు. ఎన్నారైలకు వర్తిం చదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆలోచించుకోండి. ఉన్నవాటిలో ఇది అత్యుత్తమమైనది. కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ఇక ఎన్ఎస్సీలు.. అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు. ఒకప్పుడు ఆరు సంవత్సరాల్లో రెట్టింపై ఎంతో లాభసాటిగా ఉండేవి. క్రమేపీ వడ్డీ రేటును తగ్గించేశారు. ఇప్పుడు 6.8 శాతం వస్తుంది. ఇక్కడ E.E.E నియమం వర్తిస్తుంది. కనీసం రూ. 1,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు. 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. వడ్డీని అసలుకు కలుపుతారు. 80సి కింద దక్కే ప్రయోజనం పరిమితి రూ. 1,50,000. కొన్ని సందర్భాల్లో ముందుగానే నగదుగా మార్చుకోవచ్చు. ఏడాదిలోపే తీసేసుకుంటే వడ్డీ ఇవ్వరు. మొదటి సంవత్సరం దాటి 3 సంవత్సరాల లోపల అయితే సాధారణ వడ్డీ ఇస్తారు. నామినేషన్ సదుపాయం ఉంది. మరోవైపు, పోస్టాఫీస్‌లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంటులో జమకి 80సి మినహాయింపు లేదు. ఏటా 4 శాతం వడ్డీ ఉంటుంది. కనీసం రూ. 50 నుంచి గరిష్టంగా ఎంతైనా ఉంచవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా కొనసాగించవచ్చు. జాయింటుగా చేరవచ్చు. సింగిల్‌లో రూ. 3,500, జాయింటులో రూ. 7,000 వడ్డీకి మినహాయింపు ఉంటుంది. కానీ 80 టీటీఏ కింద రూ. 10,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు 80 టీటీబీ కింద రూ.50,000 వరకూ మినహాయింపు ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఒక స్కీమ్ ఉంది. వడ్డీ 7.4 శాతం లభిస్తుంది. కనీసం రూ. 1,000, గరిష్టంగా రూ. 15,00,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. 5 సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది. మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. వడ్డీకి మినహాయింపు ఉంటుంది. వడ్డీ రూ. 50,000 దాటితే టీడీఎస్ ఉంటుంది. దీనికి 80సి వర్తిస్తుంది.60 సంవత్సరాల వారికే ఇది వర్తిస్తుంది. 55 సంవత్సరాలు దాటిన వారు రిటైర్ అయిపోతే ఇందులో చేరవచ్చు (కొన్ని షరతులకు లోబడి). జాయింటు అకౌంటు తెరిచేందుకు వీలుంటుంది. ఇలా ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఉన్నాయి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
ఆ‘పన్ను’ హస్తం
కరోనా వైరస్ ధాటికి విలవిల్లాడిన మహా విశాఖ నగర పాలక సంస్థ.. మెల్లమెల్లగా కోలుకుంటోంది. మార్చి నెల నుంచి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టిన కోవిడ్.. కొత్త ఆర్థిక సంవత్సరంలో రూపాయి.. రూపాయి పోగు చేసుకుంటోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో రాయితీ ప్రకటనతో ఖజానాకు కాస్త ఊరటనిస్తోంది. అయితే సర్వర్ సమస్య వేధిస్తోంది. ఫలితంగా పన్ను చెల్లింపుల కోసం ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ ప్రభావంతో 2019–20 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూలులో లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. రూ.350 కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నామని జీవీఎంసీ ప్రకటించినా.. లక్ష్యానికి రూ.120 కోట్ల దూరంలో కేవలం రూ.236 కోట్లతో సరిపెట్టుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీ ప్రకటన చేయడంతో నెమ్మది నెమ్మదిగా జీవీఎంసీ ఖజానాకు కాసులు వచ్చి చేరుతున్నాయి. మూడు నెలల్లో రూ.94.32 కోట్లు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 14 వరకూ లాక్డౌన్ ప్రకటించడంతో అన్నీ మూతపడ్డాయి. ఫలితంగా వ్యాపారాలు దెబ్బతినడంతో పన్ను చెల్లింపులకు కూడా భారమవుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 2019–20 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగిసిపోయింది. 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. తొలుత ఏప్రిల్ నెలాఖరు వరకూ 5 శాతం రాయితీతో పన్ను చెల్లించుకునేందుకు జీవీఎంసీ అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడకపోవడంతో రాయితీ ప్రకటనను జూన్ 30వ తేదీ వరకూ పొడిగించడంతో పన్ను చెల్లింపుదారులు ఊరట చెందారు. ఏప్రిల్, మే, జూన్ 29వ తేదీ వరకూ మూడు నెలల కాలంలో మొత్తం రూ.94.32 కోట్లు వసూలయ్యాయి. మొరాయిస్తున్న సర్వర్లు ప్రతి సంవత్సరం వడ్డీ రాయితీ వంటి ప్రోత్సాహకాలు ప్రకటించిన సమయంలో పెద్ద మొత్తంలో పన్నులు వసూలవుతుంటాయి. రాయితీ కోసమే పన్ను చెల్లింపుదారులు చాలా వరకూ ఎదురుచూస్తుంటారు. లక్షల రూపాయలు పన్నులు చెల్లించే బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, కార్యాలయాల యజమానులు కూడా రాయితీ రోజుల్లోనే పన్ను చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కరోనా ప్రభావంతో మీసేవ, ఈసేవ కేంద్రాల్లో పన్ను చెల్లింపుల్ని నిలిపివేశారు. దీంతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సౌకర్యం కేంద్రంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లపైనే ఆధారపడ్డారు. కొంత మంది మాత్రమే డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ ఎప్పటిలాగానే మొరాయించడంతో పన్ను చెల్లింపుదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి సౌకర్యం సెంటర్‌తో పాటు జోనల్ కార్యాలయాల వద్ద బారులు తీరుతూ పన్ను చెల్లింపు కోసం ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. సర్వర్ మాటిమాటికీ మొరాయిస్తుండటంతో చాలా మంది చెల్లింపులు పూర్తి చేయకుండానే వెనుదిరిగారు. మూతపడిన జోన్–3 కార్యాలయం జోన్–3 పరిధిలో 49,066 అసెస్మెంట్లు ఉన్నాయి. మొత్తం ఈ కార్యాలయ పరిధి నుంచి రూ.50.72 కోట్లు పన్ను చెల్లింపులు జరగాల్సి ఉంది. అయితే ఇటీవలే జోన్–3 కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందికి కరోనా సోకడంతో ఆ కార్యాలయ పరిధిలో పన్ను చెల్లింపు కేంద్రాన్ని మూసివేశారు. దీంతో ఆ పరిధిలో ఉన్న చెల్లింపుదారులంతా సమీపంలో ఉన్న ప్రధాన కార్యాలయ సౌకర్యం కేంద్రంపైనే ఆధారపడ్డారు. దీంతో సోమవారం ఇక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరి అవకాశం వినియోగించుకోండి.. కమిషనర్ సూచనల మేరకు జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన పన్ను చెల్లింపు కౌంటర్లని సది్వనియోగం చేసుకోవాలి. లాక్డౌన్ కాలంలోనూ పన్ను చెల్లింపులు సజావుగా నిర్వహించాం. లాక్డౌన్ కారణంగా పరిమితులు ఉండడంతో చెల్లింపుల్లో జాప్యం జరిగింది. లేదంటే గతేడాది కంటే మెరుగ్గానే పన్నులు వసూలయ్యే అవకాశం ఉండేది. మంగళవారం రాయితీకి చివరి రోజు కావడంతో ప్రజలంతా ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోండి. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –ఫణిరామ్, జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్(రెవెన్యూ) -
'తెలుగు రాష్ట్రాలకు రాయితీలు ఇవ్వవద్దు'
చెన్నై: పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లకు కొత్తగా రాయితీలు ఇవ్వవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. ప్రోత్సాహకాల పేరుతో ఆ రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇస్తే పరిశ్రమలు, పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ చట్టంలో గణనీయమైన ఆర్థిక ప్యాకేజీ ఉందని ఆమె గుర్తు చేశారు. ఆ రెండు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఆ చట్టంలో ఉన్నాయని తెలిపారు. ఆ రాయితీలను రద్దు చేయాలని జయలలిత ఆ లేఖలో కోరారు.