సాక్షి, హైదరాబాద్: బ్యాటరీ బండి పరుగులు పెడుతోంది. పర్యావరణ హితమైన వాహనాల పట్ల నగర వాసులు క్రమంగా ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో చాలా మంది ఇంధన భారాన్ని తగ్గించుకొనేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. వాటిలో రవాణా వాహనాల కంటే ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. గతేడాది 23 వేలకు పైగా ద్విచక్ర వాహనాలు రోడ్డెక్కాయి.
ఈ సంవత్సరం మే చివరి నాటికి 12 వేలకు పైగా కొనుగోళ్లు నమోదయ్యాయి. ఈ లెక్కన ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 25 వేలు దాటవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మొదటి లక్ష వాహనాలకు జీవితకాల పన్ను నుంచి రాయితీ కల్పించిన సంగతి తెలిసిందే.
వ్యక్తిగత కేటగిరీకి చెందిన సుమారు 47 వేలకు పైగా కార్లు, బైక్‌లపైన ఇప్పటి వరకు రూ.220 కోట్ల వరకు రాయితీని అందజేశారు. మరో 53 వేల వాహనాలకు ఈ రాయితీ సదుపాయం వర్తించనుంది. రానున్న రెండేళ్ల వరకు ఈ అవకాశం ఉండవచ్చునని రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు.
ద్విచక్ర వాహనాలే టాప్....
మొదట్లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల పట్ల విముఖత చూపారు. నాణ్యత లేని బ్యాటరీల వల్ల ప్రమాదాలు జరిగాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగా సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఉదంతంతో చాలా మంది వెనుకడుగు వేశారు. దీంతో వాహన తయారీ సంస్థలు బ్యాటరీల నాణ్యతపైన ప్రధానంగా దృష్టి సారించాయి.
ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనరంగంలోకి ప్రవేశించడంతో సమర్థవంతమైన బ్యాటరీలు కలిగిన బండ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. దీంతో వాహనదారుల్లో వాటిపైన నమ్మకం కలిగింది. ఫలితంగా వీటి కొనుగోళ్లు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 50 వేలకు పైగా నమోదు కాగా, గతేడాది అనూహ్యంగా 27 వేలకు పైగా రోడ్డెక్కాయి. వీటిలో 23 వేలకుపైగా ద్విచక్ర వాహనాలే కావడం గమనార్హం.
భారీగా వెయిటింగ్ లిస్టు...
ప్రస్తుతం డిమాండ్ మేరకు వాహనాలు లభించడం లేదు. కొన్ని బ్రాండ్‌లకు చెందిన వాహనాల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని కనీసం 3 నెలల పాటు ఎదురు చూడవలసి వస్తోంది. పెట్రోల్ వాహనాల కంటే ధర కొద్దిగా ఎక్కువే అయినా ఇంధన భారాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఒకసారి చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్‌ల వరకు మాత్రమే బండి నడిచేది. ఇప్పుడు వంద కిలోమీటర్ల వరకు పరుగులు పెట్టే వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.
నిస్సందేహంగా కొనొచ్చు
ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత చాలా బాగుంది. ఎలాంటి సందేహం లేకుండా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. నాణ్యమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉన్న వాహనాలే ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్నాయి. దీంతో భద్రతా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. – సంధ్య గద్దె, ఎలక్ట్రిక్ వాహన డీలర్, లింగంపల్లి
పెట్రో ‘బాదుడు’ నుంచి ఊరట
పెట్రోల్ ధరల దృష్ట్యా బండి బయటకు తీయాలంటేనే వెనుకడు గు వేయాల్సి వస్తోంది. బ్యాటరీ బండితో చాలా వరకు ఈ భారం తగ్గుతుంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ అయ్యే వాహనాలు వస్తే బాగుంటుంది. – కోల రవికుమార్ గౌడ్
ధరలు కాస్త ఎక్కువే
లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చి నప్పటికీ ధరలు ఎక్కువగా నే ఉన్నాయి. మధ్యతరగ తి వర్గాలకు భారంగానే ఉంది. పెట్రోల్, డీజిల్ భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాల వైపు వస్తున్నా రు. కానీ ధరలు చూడగానే వెనుకడుగు వేయాల్సి వస్తోంది. – సుధాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment