5 కోట్ల ఉద్యోగాల కల్పన.. 2030 నాటికి అంచనాలు
సియామ్ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ 2030 నాటికి ఏటా ఒక కోటి యూనిట్ల స్థాయికి చేరగలదన్న అంచనాలు నెలకొన్నాయని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే 5 కోట్ల ఉద్యోగాల కల్పన కూడా జరగగలదని వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ 64వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఆటోమోటివ్‌లకు సంబంధించి భవిష్యత్తులో భారత్ నంబర్‌వన్ తయారీ హబ్‌గా ఎదగగలదని తెలిపారు. 2030 నాటికి దేశీయంగా మొత్తం ఈవీ వ్యవస్థ రూ. 20 లక్షల కోట్ల స్థాయికి, ఈవీ ఫైనాన్స్ మార్కెట్ రూ. 4 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని గడ్కరీ పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో లిథియం అయాన్ బ్యాటరీల ఖరీదు మరింత తగ్గి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగి వస్తాయని, ఈవీల వినియోగం గణనీయంగా పెరిగేందుకు ఇది దోహదపడగలదని ఆయన చెప్పారు. 2023–24లో ఈవీల అమ్మకాలు 45 శాతం పెరిగాయని, 400 స్టార్టప్‌లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తి ప్రారంభించాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా సుమారు 30 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయని, మొత్తం అమ్మకాల్లో టూ–వీలర్ల వాటా 56 శాతంగా ఉందని పేర్కొన్నారు.
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో (పీఎల్‌ఐ) బ్యాటరీ సెల్ తయారీకి ఊతం లభించగలదని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పరిశ్రమగా ఎదిగేందుకు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై ఆటోమొబైల్ సంస్థలు మరింత ఇన్వెస్ట్ చేయాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు. ఎగుమతులను పెంచుకునే దిశగా తమ ఉత్పత్తులకు గ్లోబల్ ఎన్‌క్యాప్ (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం) రేటింగ్స్‌ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పారు.
పీఎల్‌ఐ కింద రూ. 75 వేల కోట్ల ప్రతిపాదనలు..
పీఎల్‌ఐ కింద రూ. 75,000 కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. కంపెనీలు ఇప్పటికే సుమారు రూ. 18,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. సుమారు 30,000 ఉద్యోగాల కల్పనకు స్కీము తోడ్పడిందని మంత్రి వివరించారు. మరోవైపు, వాహనాల వయస్సును బట్టి కాకుండా వాటి నుంచి వచ్చే కాలుష్యాన్ని బట్టి స్క్రాపేజీ విధానం ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ కార్యదర్శి తెలిపారు. ‘విశ్వసనీయమైన‘ పొల్యూషన్ పరీక్షల విధానాన్ని రూపొందించడంలో ప్రభుత్వానికి వాహన పరిశ్రమ దన్నుగా నిలవాలన్నారు.
ఆర్థిక వృద్ధికి ఆటోమోటివ్ దన్ను
భారత్ అధిక స్థాయిలో వృద్ధిని సాధించేందుకు ఆటోమోటివ్ రంగం చోదకంగా ఉంటుంది. ఇందుకు కొత్త ఆవిష్కరణలు తదితర అంశాలు తోడ్పడతాయి. ఈ క్రమంలో పెరిగే డిమాండ్‌తో పరిశ్రమ కూడా లబ్ధి పొందుతుంది. దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ గత దశాబ్దకాలంలో గణనీయమైన స్థాయిలో, గతంలో ఎన్నడూ చూడనంత వృద్ధిని సాధించింది. రాబోయే రోజుల్లో దేశ పురోగతి వేగవంతంగా మాత్రమే కాకుండా పర్యావరణహితంగా కూడా ఉండాలి. – ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment