న్యూఢిల్లీ: అమ్మకాల్లో శరవేగంగా దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమకు స్పీడ్ బ్రేకర్లు ఎదురుపడ్డాయి. పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’ పథకం కింద ఒక్కో వాహనంపై పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తోంది. స్థానికంగా విడిభాగాలను సమీకరించుకుని తయారు చేసే వాహనాలకే ఈ సబ్సిడీ ప్రయోజనాన్ని పరిమితం చేసింది. విడిభాగాలు స్థానికంగా సమకూర్చుకోకుండానే, చైనాలో తయారైన వాటిని ఇక్కడివిగా చూపించి కొన్ని కంపెనీలు, నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలను దుర్వినియోగం చేస్తున్నట్టు కేంద్రం గుర్తించింది. దీంతో కొన్ని కంపెనీలకు సబ్సిడీల మంజూరును నిలిపివేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించాలన్న లక్ష్యాన్ని తాజా పరిణామాల నేపథ్యంలో చేరుకోలేకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం సుమారు రూ.1,100 కోట్ల సబ్సిడీని నిలిపివేసినట్టు తెలిపాయి.
‘‘తాజా పరిణామం కొన్ని కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది. మూలధన నిధులకు సైతం కొరత ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే విక్రయించిన వాహనాలపై సబ్సిడీని కస్టమర్లకు అందించాయి. ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ కోసం అవి ఎదురు చూస్తున్నాయి’’ అని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
25 శాతం తక్కువ అమ్మకాలు..
‘‘ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) 7,20,000-7,50,000 మించకపోవచ్చు. నీతి ఆయోగ్, ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల సంఘం (ఎస్‌ఎంఈవీ) అంచనా వేసినట్టు మిలియన్ వాహనాల మార్క్ కంటే ఇది 25 శాతం తక్కువ’’అని ఎస్‌ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. హీరో ఎలక్ట్రిక్ సీఈవోగానూ గిల్ పనిచేస్తున్నారు. ఫేమ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు వచ్చిన ఆరోపణలను ఎస్‌ఎంఈవీ ఖండించింది. ఫేమ్ సబ్సిడీకి అర్హత సాధించేందుకు కృత్రిమంగా వాహనాల ధరలను తక్కువగా నిర్ణయించినట్టు అనుమానాలతో మరో నాలుగు కంపెనీల వ్యవహారాలను సైతం కేంద్ర సర్కారు పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్‌పై సమాచారాన్ని పరిశీలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి 6 లక్షల మార్క్‌ను చేరుకున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో మరో 1.5 లక్షల విక్రయాలు నమోదు కావచ్చన్నది సోహిందర్ గిల్ అంచనా. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2,31,000 యూనిట్లుగానే ఉండడం గమనార్హం.
ప్రధాన బ్రాండ్ల జోరు
ప్రముఖ బ్రాండ్లు అయిన టీవీఎస్ మోటార్, ఏథెర్, ఓలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు మంచి వృద్ధిని చూస్తున్నాయి. హీరో ఎలక్ట్రిక్, ఒకినవా, యాంపియర్ తదితర కొన్ని కంపెనీలు సబ్సిడీ దుర్వినియోగం ఆరోపణలతో దర్యాప్తును ఎదుర్కొంటున్నాయి. టీవీఎస్ మోటార్, ఏథెర్, ఓలా, హీరో విదా సంస్థలు ఉత్పత్తుల ధరలను తప్పుదోవ పట్టించే విధంగా నిర్ణయించాయనే ఆరోపణలు చవిచూస్తున్నా యి. మరోవైపు కస్టమర్ల నుంచి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి ఆదరణ కొనసాగుతోంది. డిమాండ్‌ను అందుకునేందుకు కొన్ని కంపెనీలు తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు రెవ్‌ఫిన్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు సమీర్ అగర్వాల్ తెలిపారు. నూతన బ్యాటరీ ప్రమాణాలతో ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయ ధరలు పెరగొచ్చని ప్రరిశ్రమ చెబుతోంది. ధరల పెరుగుదల అమ్మకాల వృద్ధికి అవరోధం కాబోదని, డిమాండ్ గణనీయంగా ఉందని అంటోంది.
సబ్సిడీలతోనే వృద్ధి..
దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలు శరవేగంగా వృద్ధిని చూడడం వెనుక ప్రధాన మద్దతు ఫేమ్ సబ్సిడీలేనని పరిశ్రమ అంటోంది. ఒక కిలోవాట్ సామర్థ్యానికి కేంద్ర సర్కారు రూ.15,000 సబ్సిడీగా అందిస్తోంది. మొత్తం వాహన వ్యయంలో ఇలా ఇచ్చే సబ్సిడీ గరిష్ట పరిమితి 40 శాతంగా ఉంది. దీంతో ఒక వాహనంపై రూ.30–60వేల స్థాయిలో సబ్సిడీ లభిస్తోంది. సబ్సిడీ అంశాన్ని త్వరగా పరిష్కరించకపోతే, సంప్రదాయ కర్బన ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యాన్ని కేంద్రం కొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేసుకోవాల్సి వస్తుందని గిల్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment