భారతదేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డీజిల్, పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ అన్ని విభాగాల్లోనూ కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే ప్రజా రహదారులలో డ్రైవ్/రైడ్ చేయడానికి తప్పకుండా లైసెన్స్ అవసరం. కానీ మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అవాన్ ఇ ప్లస్ (Avon E Plus)
భారతదేశంలో లభించే సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'అవాన్ ఇ ప్లస్'. దీని ధర కేవలం రూ. 25,000 కావడం గమనార్హం. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 50 కిమీ రేంజ్ అందిస్తుంది. 48v/12ah కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 24 కిలోమీటర్లు మాత్రమే. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 6.5 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రధానంగా చెప్పుడోదగ్గ మోడల్ ఈ అవాన్ ఇ ప్లస్ కావడం గమనార్హం.
డీటెల్ ఈజీ ప్లస్ (Detel Easy Plus)
మన జాబితాలో మరో టూ వీలర్ 'డీటెల్ ఈజీ ప్లస్'. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 40,000 మాత్రమే. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 60 కిమీ రేంజ్ అందిస్తుంది. 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ కేవలం 4 నుంచి 5 గంటల సమయంలో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ.
ఆంపియర్ రియో ఎలైట్ (Ampere Reo Elite)
రూ. 44,500 ధర వద్ద లభించే ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ ఛార్జ్‌తో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 20Ah లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగి గంటకు 25 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 8 గంటలు.
హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 (Hero Electric Flash E2)
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మన జాబితాలో డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని వెహికల్ కావడం గమనార్హం. రూ. 52,500 ఖరీదైన హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 స్కూటర్ వినియోగించడానికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇందులోని 51.2v/30ah బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 4 నుంచి 5 గంటలు. ఇది ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 65 కిమీ రేంజ్ అందిస్తుంది.
లోహియా ఓమా స్టార్ లి (Lohia Oma Star Li)
రూ. 41,444 వద్ద లభించే ఈ 'లోహియా ఓమా స్టార్ లి' ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ రైడింగ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని వెహికల్స్ లో ఇది ఒకటి. ఇందులోని 48V/20 Ah బ్యాటరీ 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే.
ఒకినావా లైట్ (Okinawa Lite)
దేశీయ విఫణిలో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగానే ఉంది. ఇందులో భాగంగానే ఒకినావా లైట్ మంచి అమ్మకాలతో ముందుకు వెళుతోంది. ఈ స్కూటర్ ధర రూ. 67,000. ఇందులోని 1.25 కిలోవాట్ బ్యాటరీ ఇక ఫుల్ ఛార్జ్‌తో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఛార్జింగ్ టైమ్ 6 నుంచి 7 గంటలు.
(ఇదీ చదవండి: ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి)
ఓకినావా ఆర్30 (Okinawa R30)
మన జాబితాలో చివరి ఎలక్ట్రిక్ బైక్ 'ఓకినావా ఆర్30'. దీని ధర రూ. 62,500. ఈ స్కూటర్ రేంజ్ 65 కిలోమీటర్లు. ఇది 4 నుంచి 5 గంటల సమయంలో 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ డిటాచబుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది, ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు.
(ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన 2023 స్కోడా కొడియాక్ - ధర & వివరాలు)
నిజానికి దేశంలో వినియోగించే చాలా వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే తక్కువ వేగంతో లేదా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇలాంటి స్కూటర్లు లాంగ్ రైడ్ చేయడానికి ఉపయోగపడవు, కానీ రోజు వారి ప్రయాణానికి, నగర ప్రయాణానికి చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment