న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాలో ఆఫ్‌షోర్ సేవల రూపంలో భారత ఐటీ సంస్థలకు వస్తున్న ఆదాయంపై ద్వంద్వ పన్నును నివారించేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని భారత్ కోరింది. ద్వంద్వ పన్నుల నివారణ చట్టం (డీటీఏఏ)లో ఈ మేరకు సవరణలు త్వరగా చేయాలని డిమాండ్ చేసింది. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రోగర్ కుక్‌తో సమావేశం సందర్భంగా గురువారం కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. డీటీఏఏకు సవరణ అన్నది ఎంతో ముఖ్యమైన విషయంగా గుర్తు చేశారు.
భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం కింద దీనిపై లోగడ అంగీకారం కుదిరినట్టు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్-ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. కాకపోతే ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. భారత విద్యార్థులకు వీసాల జారీలో జాప్యాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. భారత విద్యార్థులు, పర్యాటకుల వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసే మార్గాలను చూస్తామని ఆ్రస్టేలియా అంగీకరించింది. విద్య, కీలకమైన ఖనిజాలు, వ్యవసాయం, ఇంధనం, పర్యాటకం, మైనింగ్ టెక్నాలజీలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న అభిప్రాయాన్ని ఇరు దేశాలు వ్యక్తం చేశాయి. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఆమోద ప్రక్రియలను వేగవంతం చేయాలని భారత్ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment