Double Taxation Avoidance Agreement
-
భారత్‌కు స్విస్ ఎంఎఫ్ఎన్ హోదా రద్దు..
న్యూఢిల్లీ: ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంలో (డీటీఏఏ) భాగంగా భారత్‌కి అనుకూల దేశంగా ఇచ్చిన హోదా (ఎంఎఫ్ఎన్) నిబంధనను స్విట్జర్లాండ్ ప్రభుత్వం రద్దు చేసింది. భారత్ ట్యాక్స్ ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏదైనా ఓఈసీడీలో (ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ) చేరినప్పుడు, ఎంఎఫ్ఎన్ నిబంధన ఆటోమేటిక్‌గా అమల్లోకి రాదంటూ నెస్లే కేసులో భారత సుప్రీంకోర్టు గతేడాది తీర్పునిచ్చిన నేపథ్యంలో స్విస్ ఫైనాన్స్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఇది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో భారత్‌లో స్విస్ పెట్టుబడులపై ప్రభావం పడనుండగా, ఆ దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ కంపెనీలపై అధిక పన్నుల భారం పడనుంది. తమ దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ కంపెనీలు ఆర్జించే డివిడెండ్లపై స్విట్జర్లాండ్ ఇకపై 10 శాతం పన్ను విధించనుంది. -
ఆస్ట్రేలియాలో భారత్ ఐటీ సంస్థల పన్ను భారంపై దృష్టి
న్యూఢిల్లీ: భారత్– ఆస్ట్రేలియాల వాణిజ్య మంత్రుల మధ్య వచ్చే నెలలో జరిగే కీలక సమావేశంలో భారతీయ ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న పన్ను సమస్యలను లేవనెత్తనున్నట్లు ఇక్కడ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిజానికి రెండు దేశాలూ 1991లో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (డీటీఏఏ)పై సంతకం చేశాయి. 2013లో ఈ ఒప్పందంలో కాలానుగుణ మార్పులూ జరిగాయి. కాగా, ఆస్ట్రేలియాలో సాంకేతిక సేవలను అందించే భారతీయ సంస్థల ఆఫ్‌షోర్ ఆదాయంపై పన్ను విధింపును కూడా డీటీఏఏ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. ఈ పన్ను విధింపును నిలిపివేయడానికి డీటీఏఏ కింద నిబంధనలను త్వరగా సవరించాలని ఆస్ట్రేలియాను భారత్ కోరుతోంది. ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్ సెప్టెంబరు చివర్లో జాయింట్ మినిస్టీరియల్ కమిషన్ సమావేశంలో పాల్గొనడానికిగాను భారతదేశాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా భారత్ డీటీఏఏ నిబంధనల సమస్యను లేవనెత్తుతుందని అధికారి తెలిపారు. -
ఐటీ సంస్థలపై ద్వంద్వ పన్ను నివారించాలి
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాలో ఆఫ్‌షోర్ సేవల రూపంలో భారత ఐటీ సంస్థలకు వస్తున్న ఆదాయంపై ద్వంద్వ పన్నును నివారించేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని భారత్ కోరింది. ద్వంద్వ పన్నుల నివారణ చట్టం (డీటీఏఏ)లో ఈ మేరకు సవరణలు త్వరగా చేయాలని డిమాండ్ చేసింది. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రోగర్ కుక్‌తో సమావేశం సందర్భంగా గురువారం కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. డీటీఏఏకు సవరణ అన్నది ఎంతో ముఖ్యమైన విషయంగా గుర్తు చేశారు. భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం కింద దీనిపై లోగడ అంగీకారం కుదిరినట్టు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్-ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. కాకపోతే ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. భారత విద్యార్థులకు వీసాల జారీలో జాప్యాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. భారత విద్యార్థులు, పర్యాటకుల వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసే మార్గాలను చూస్తామని ఆ్రస్టేలియా అంగీకరించింది. విద్య, కీలకమైన ఖనిజాలు, వ్యవసాయం, ఇంధనం, పర్యాటకం, మైనింగ్ టెక్నాలజీలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న అభిప్రాయాన్ని ఇరు దేశాలు వ్యక్తం చేశాయి. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఆమోద ప్రక్రియలను వేగవంతం చేయాలని భారత్ కోరింది. -
భారత్‌కు ‘బ్లాక్‌మనీ’ లెక్కలు
-
భారత్‌కు ‘బ్లాక్‌మనీ’ లెక్కలు
సమాచారాన్ని అందించిన న్యూజిలాండ్, యూకే, స్పెయిన్ న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో పన్ను ఎగవేతకు, అనుమానాస్పద నిధులకు సంబంధించిన.. 24 వేల ఉదంతాల సమాచారాన్ని భారత్ సంపాదించింది. విదేశీ బ్యాంకుల్లోని భారతీయులకు సంబంధించిన ఆ సమాచారాన్ని న్యూజిలాండ్, యూకే, స్పెయిన్ సహా దాదాపు డజను దేశాలు అందించాయి. ఆ సమాచారాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు అధికారులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణ ఫలితాల కోసం బ్లాక్‌మనీపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎదురుచూస్తోంది. భారత్‌కు చేరిన సమాచారంలో ఎక్కువ భాగం న్యూజీలాండ్ నుంచి(10,372 ఉదంతా లు), స్పెయిన్(4,169), యూకే(3,164), స్వీడన్(2,404), డెన్మార్క్(2,145) దేశాల నుంచి వచ్చింది. డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, పన్ను సమాచార మార్పిడి ఒప్పందం ఆధారంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ సమాచారాన్ని సేకరించింది. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ రూపొందించిన నిబంధనలకింద దేశాల మధ్య పన్ను సమాచార మార్పిడి జరుగుతుంది. చట్టాన్ని సవరించిన స్విట్జర్లాండ్ బెర్న్: స్విస్ బ్యాంకుల్లోని విదేశాలకు చెందిన నల్లధనం వివరాలను వెల్లడించే దిశగా సంబంధిత చట్టానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. భారత్ సహా పలు దేశాల ఒత్తిడికి తలొగ్గి చేసిన ఆ సవరణలు ఈ నెలనుంచే అమల్లోకి రానున్నాయి. వాటి ప్రకారం.. భారత్ సహా ఆయా దేశాలు తమ దేశస్తుల బ్లాక్‌మనీ ఖాతాల వివరాలు, వాటిని నిర్వహిస్తున్న వారి వివరాలను కోరినపుడు.. ఆ అకౌంట్హోల్డర్లకు దీనికి సంబంధించిన ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆయా దేశాలడిగిన సమాచారాన్ని ఇవ్వాలి. అయితే, ఆ హోల్డర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకూడదనడానికి కారణాన్ని సమాచారం అడిగిన దేశాలు చూపాలి. ఈ సవరణకు ముందు.. ‘ఫలానా దేశం మీ అకౌంట్ వివరాలను కోరింద’ంటూ ముందుగా ఆ అకౌంట్హోల్డర్లకు సమాచారమిచ్చి, వారికి తమ అకౌంట్లను సరిచూసుకునేందుకు, లేదంటే సమాచార మార్పిడిని వ్యతిరేకించేందుకు అవకాశమిచ్చే పరిస్థితి ఉండేది. ఈ సవరణలతో నల్లధనాన్ని భారత్‌కు తెప్పించేందుకు మోడీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రోత్సాహం లభించినట్లైంది. -
నల్లధనం’పై స్విస్‌కు భారత్ హెచ్చరిక
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందించకపోవడంపై కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఘాటుగా స్పందించారు. తమ విజ్ఞప్తులను పట్టించుకోనందుకు జీ 20 వంటి అంతర్జాతీయ వేదికలపైకి స్విట్జర్లాండ్‌ను గుంజుతామని హెచ్చరించారు. ఈ మేరకు స్విస్ ఆర్థికమంత్రి ఎవెలీన్ విడ్మర్ ష్లుంఫ్కు ఈ నెల 13న రెండు పేజీల లేఖ రాశారు. బ్యాంకు వ్యవహారాల్లో గోప్యతకు చెల్లుచీటీ ఇస్తున్నట్లు 2009 ఏప్రిల్‌లో జీ20 నేతలు ఓ డిక్లరేషన్‌ను ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం(డీటీఏసీ)లోని నిబంధనలను స్విట్జర్లాండ్ గౌరవించలేదని తీవ్ర పదజాలంతో రాసిన లేఖలో చిదంబరం పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన డీటీఏఏ ప్రకారమే భారతీయ పన్ను అధికారులు.. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని కోరారని చెప్పారు. దొంగిలించిన గణాంకాల ఆధారంగా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉందని పేర్కొంటూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం సమాచారాన్ని అందించకపోవడాన్ని బట్టి ఆ దేశం ఇప్పటికీ ‘బ్యాంకుల గోప్యత’ను పాటిస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. కాగా, 562 కేసులలో భారత్ చేసిన విజ్ఞప్తులను మూసేస్తున్నట్లు ఫిబ్రవరి 20న రాసిన లేఖలో స్విస్ అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే స్పందిస్తాం: స్విస్ ప్రతినిధి చిదంబరం లేఖపై త్వరలోనే స్పందిస్తామని స్విట్జర్లాండ్ సర్కారు గురువారం తెలిపింది. ‘భారత ఆర్థిక మంత్రి లేఖ అందింది. త్వరలోనే మా సమాధానాన్ని అందుకుంటారు’ అని స్విస్ ప్రతినిధి పేర్కొన్నారు.