
భారత్‌కు ‘బ్లాక్‌మనీ’ లెక్కలు
సమాచారాన్ని అందించిన న్యూజిలాండ్, యూకే, స్పెయిన్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో పన్ను ఎగవేతకు, అనుమానాస్పద నిధులకు సంబంధించిన.. 24 వేల ఉదంతాల సమాచారాన్ని భారత్ సంపాదించింది. విదేశీ బ్యాంకుల్లోని భారతీయులకు సంబంధించిన ఆ సమాచారాన్ని న్యూజిలాండ్, యూకే, స్పెయిన్ సహా దాదాపు డజను దేశాలు అందించాయి. ఆ సమాచారాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు అధికారులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణ ఫలితాల కోసం బ్లాక్‌మనీపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎదురుచూస్తోంది. భారత్‌కు చేరిన సమాచారంలో ఎక్కువ భాగం న్యూజీలాండ్ నుంచి(10,372 ఉదంతా లు), స్పెయిన్(4,169), యూకే(3,164), స్వీడన్(2,404), డెన్మార్క్(2,145) దేశాల నుంచి వచ్చింది. డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, పన్ను సమాచార మార్పిడి ఒప్పందం ఆధారంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ సమాచారాన్ని సేకరించింది. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్’ రూపొందించిన నిబంధనలకింద దేశాల మధ్య పన్ను సమాచార మార్పిడి జరుగుతుంది.
చట్టాన్ని సవరించిన స్విట్జర్లాండ్
బెర్న్: స్విస్ బ్యాంకుల్లోని విదేశాలకు చెందిన నల్లధనం వివరాలను వెల్లడించే దిశగా సంబంధిత చట్టానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. భారత్ సహా పలు దేశాల ఒత్తిడికి తలొగ్గి చేసిన ఆ సవరణలు ఈ నెలనుంచే అమల్లోకి రానున్నాయి. వాటి ప్రకారం.. భారత్ సహా ఆయా దేశాలు తమ దేశస్తుల బ్లాక్‌మనీ ఖాతాల వివరాలు, వాటిని నిర్వహిస్తున్న వారి వివరాలను కోరినపుడు.. ఆ అకౌంట్‌హోల్డర్లకు దీనికి సంబంధించిన ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆయా దేశాలడిగిన సమాచారాన్ని ఇవ్వాలి. అయితే, ఆ హోల్డర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకూడదనడానికి కారణాన్ని సమాచారం అడిగిన దేశాలు చూపాలి. ఈ సవరణకు ముందు.. ‘ఫలానా దేశం మీ అకౌంట్ వివరాలను కోరింద’ంటూ ముందుగా ఆ అకౌంట్‌హోల్డర్లకు సమాచారమిచ్చి, వారికి తమ అకౌంట్లను సరిచూసుకునేందుకు, లేదంటే సమాచార మార్పిడిని వ్యతిరేకించేందుకు అవకాశమిచ్చే పరిస్థితి ఉండేది. ఈ సవరణలతో నల్లధనాన్ని భారత్‌కు తెప్పించేందుకు మోడీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రోత్సాహం లభించినట్లైంది.