DTAA
-
ఐటీ సంస్థలపై ద్వంద్వ పన్ను నివారించాలి
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాలో ఆఫ్‌షోర్ సేవల రూపంలో భారత ఐటీ సంస్థలకు వస్తున్న ఆదాయంపై ద్వంద్వ పన్నును నివారించేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని భారత్ కోరింది. ద్వంద్వ పన్నుల నివారణ చట్టం (డీటీఏఏ)లో ఈ మేరకు సవరణలు త్వరగా చేయాలని డిమాండ్ చేసింది. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రోగర్ కుక్‌తో సమావేశం సందర్భంగా గురువారం కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. డీటీఏఏకు సవరణ అన్నది ఎంతో ముఖ్యమైన విషయంగా గుర్తు చేశారు. భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం కింద దీనిపై లోగడ అంగీకారం కుదిరినట్టు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్-ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. కాకపోతే ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. భారత విద్యార్థులకు వీసాల జారీలో జాప్యాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. భారత విద్యార్థులు, పర్యాటకుల వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసే మార్గాలను చూస్తామని ఆ్రస్టేలియా అంగీకరించింది. విద్య, కీలకమైన ఖనిజాలు, వ్యవసాయం, ఇంధనం, పర్యాటకం, మైనింగ్ టెక్నాలజీలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న అభిప్రాయాన్ని ఇరు దేశాలు వ్యక్తం చేశాయి. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఆమోద ప్రక్రియలను వేగవంతం చేయాలని భారత్ కోరింది. -
దక్షిణ కొరియాతో సవరించిన డీటీఏఏ ఒప్పందం ఖరారు
ప్రధాని మోదీ పర్యటనలో సంతకాలు సియోల్: ద్వంద్వ పన్నుల నివారణకు సంబంధించి సవరించిన ఒప్పందంపై (డీటీఏఏ) భారత్, దక్షిణ కొరియాలు సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్య సహకారాన్ని మరింతగా పెంచుకునే దిశగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం దం పరిధిని విస్తరించడంపై ఈ ఏడాది జూన్ నాటికి చర్చలు ప్రారంభించాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హైతో ప్రధాని నరేంద్ర మోదీ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రెండు దేశాల మధ్య అనేక సారూప్యతలు ఉన్న దృష్ట్యా.. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఇరు దేశాల వ్యాపారవేత్తలు పరస్పరం సహకరించుకోవాలని వారు సూచించారు. భారత్, దక్షిణ కొరియా 2010లో కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సవరణలపై వచ్చే ఏడాది జూన్ కల్లా చర్చలు ప్రారంభం కాగలవని వెల్లడించారు. ఇన్ఫ్రా రంగంలో పరస్పర సహకారం కోసం దక్షిణ కొరియా ఆర్థిక శాఖ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ దాదాపు 10 బిలియన్ డాలర్లు సమకూర్చనున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం తక్కువ స్థాయిలో ఉందని, దీన్ని మరింతగా పెంచుకోవాలని మోదీ, గెన్ హై పేర్కొన్నారు. -
ఎఫ్ఐఐలపై పన్ను భారం రూ.603 కోట్లే!
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) నుంచి మ్యాట్ బకాయిలు రూ.603 కోట్లకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మార్చి వరకూ మూల ధన లాభాలపై 20 శాతం కనీన ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) చెల్లించాలంటూ(దాదాపు రూ.40,000 కోట్లు) రెవెన్యూ శాఖ 68 ఎఫ్ఐఐలకు డిమాండ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై విదేశీ ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తం కావడంతో ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందాల(డీటీఏఏ) జాబితాలో ఉన్న దేశాలకు చెందిన ఎఫ్ఐఐలకు మ్యాట్ నుంచి మినహాయింపునిచ్చేలా ఫైనాన్స్ బిల్లులో తగిన స్పష్టత ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ప్రకటన చేశారు. చాలావరకూ ఎఫ్ఐఐలు డీటీఏఏ దేశాలకు చెందినవే కావడం వల్ల బకాయిల మొత్తం గణనీయంగా 602.80 కోట్లకు తగ్గిపోనుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెలలో పెట్టుబడులు రూ.14,600 కోట్లు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఏప్రిల్ నెలలో ఇప్పటివరకూ దేశీయ క్యాపిటల్ మార్కెట్లో రూ. 14,673 కోట్లు పెట్టుబడి చేశారు. వీరు ఏప్రిల్ 24 వరకూ ఈక్విటీ మార్కెట్లో రూ. 16,316 కోట్ల విలువైన కొనుగోళ్లు జరపగా, రుణ మార్కెట్లో రూ. 1,643 కోట్ల పత్రాలను నికరంగా విక్రయించారు. అయితే గత 3 నెలలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో ఎఫ్ఐఐల నిధుల ప్రవాహం నెమ్మదించింది. వారిపై రూ. 40,000 కోట్ల పన్ను నోటీసులు జారీచేసిన ప్రభావం పడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఫైనాన్స్ బిల్లులో ‘మ్యాట్’పై స్పష్టత!
ఎఫ్ఐఐలకు కేంద్ర ప్రభుత్వం సంకేతాలు.. - డీటీఏఏ పరిధిలో ఉన్న విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను నుంచి ఊరట... - నిబంధనల్లో సవరణలపై కసరత్తు..! న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) ఆందోళనల నేపథ్యంలో కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) వర్తింపుపై ప్రభుత్వం స్పష్టతనివ్వనుంది. పార్లమెంటులో 2015-16 ఫైనాన్స్ బిల్లు ఆమోదం సందర్భంగా ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి వరకూ మూలధన లాభాలన్నింటిపైనా ఎఫ్ఐఐలు 20 శాతం మ్యాట్ బకాయిలను (దాదాపు రూ. 40,000 కోట్లు) చెల్లిం చాలంటూ కేంద్ర రెవెన్యూ విభాగం డిమాండ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎఫ్ఐఐలతో తాజాగా భేటీ అయిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కాస్త ఊరటనిచ్చే సంకేతాలిచ్చారు. ప్రధానంగా భారత్‌తో ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందాలున్న(డీటీఏఏ) దేశాలకు చెందిన ఎఫ్ఐఐలకు మ్యాట్ వర్తింపు ఉండబోదని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ బిల్లులో మ్యాట్ నిబంధనలకు స్పష్టతనిచ్చేవిధంగా సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన గురువారమిక్కడ విలేకరులకు వెల్లడించారు. అయితే, ఈ ఒప్పందాల పరిధిలో లేని ఎఫ్ఐఐలు మాత్రం కోర్టుల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలంటూ ఆయన సూచించారు. ప్రస్తుతం పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. మే 8న లోక్‌సభ సమావేశాలు ముగియనుండగా.. 13 వరకూ రాజ్య సభ సమావేశాలు కొనసాగనున్నాయి. వచ్చే వారంలో ఫైనాన్స్ బిల్లు చర్చకు రానుంది. డీటీఏఏల పరిశీలన... మ్యాట్ వర్తింపు విషయంలో స్పష్టత కోసం వివిధ దేశాలతో భారత్‌కు ఉన్న డీటీఏఏలను అధ్యయనం చేయనున్నామని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి మూలధన లాభాలపై తమ స్వదేశాల్లో పన్ను చెల్లిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు 20 శాతం మ్యాట్ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు డీటీఏఏ ఒప్పందాలున్న మారిషస్, సింగపూర్ వంటి దేశాల్లో మూలధన లాభాలపై పన్నులు లేనప్పటికీ... ఆయా దేశాల ఎఫ్ఐఐలకు కూడా మ్యాట్ మినహాయింపు లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, స్థిర ఆదాయ సెక్యూరిటీలు, ఇతర డెట్ మార్గాల్లోని ఆదాయాలపై వడ్డీ రేటుకు సంబంధించి మ్యాట్ వర్తింపు విషయంలో కూడా ఫైనాన్స్ బిల్లులో స్పష్టతనివ్వనున్నట్లు ఆయా వర్గాల పేర్కొన్నాయి. భారత్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్న ఎఫ్ఐఐల్లో దాదాపు 90% మారిషస్, సింగపూర్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుండటం గమనార్హం. కాగా, పన్ను నోటీసులు అందుకున్న ఎఫ్ఐఐ లు మ్యాట్ నుంచి మినహాయింపు పొందాలంటే... డీటీఏఏ దేశాలకు చెందినవిగా రుజువు చేసుకోవాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.