ఎఫ్‌ఐఐలపై పన్ను భారం రూ.603 కోట్లే!
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) నుంచి మ్యాట్ బకాయిలు రూ.603 కోట్లకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మార్చి వరకూ మూల ధన లాభాలపై 20 శాతం కనీన ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) చెల్లించాలంటూ(దాదాపు రూ.40,000 కోట్లు) రెవెన్యూ శాఖ 68 ఎఫ్‌ఐఐలకు డిమాండ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
అయితే, దీనిపై విదేశీ ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తం కావడంతో ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందాల(డీటీఏఏ) జాబితాలో ఉన్న దేశాలకు చెందిన ఎఫ్‌ఐఐలకు మ్యాట్ నుంచి మినహాయింపునిచ్చేలా ఫైనాన్స్ బిల్లులో తగిన స్పష్టత ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ప్రకటన చేశారు. చాలావరకూ ఎఫ్‌ఐఐలు డీటీఏఏ దేశాలకు చెందినవే కావడం వల్ల బకాయిల మొత్తం గణనీయంగా 602.80 కోట్లకు తగ్గిపోనుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నెలలో పెట్టుబడులు రూ.14,600 కోట్లు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఏప్రిల్ నెలలో ఇప్పటివరకూ దేశీయ క్యాపిటల్ మార్కెట్లో రూ. 14,673 కోట్లు పెట్టుబడి చేశారు. వీరు ఏప్రిల్ 24 వరకూ ఈక్విటీ మార్కెట్లో రూ. 16,316 కోట్ల విలువైన కొనుగోళ్లు జరపగా, రుణ మార్కెట్లో రూ. 1,643 కోట్ల పత్రాలను నికరంగా విక్రయించారు. అయితే గత 3 నెలలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం నెమ్మదించింది. వారిపై రూ. 40,000 కోట్ల పన్ను నోటీసులు జారీచేసిన ప్రభావం పడిందని విశ్లేషకులు పేర్కొన్నారు.