ఫైనాన్స్ బిల్లులో ‘మ్యాట్’పై స్పష్టత!
ఎఫ్‌ఐఐలకు కేంద్ర ప్రభుత్వం సంకేతాలు..
- డీటీఏఏ పరిధిలో ఉన్న విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను నుంచి ఊరట...
- నిబంధనల్లో సవరణలపై కసరత్తు..!
న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) ఆందోళనల నేపథ్యంలో కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) వర్తింపుపై ప్రభుత్వం స్పష్టతనివ్వనుంది. పార్లమెంటులో 2015-16 ఫైనాన్స్ బిల్లు ఆమోదం సందర్భంగా ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి వరకూ మూలధన లాభాలన్నింటిపైనా ఎఫ్‌ఐఐలు 20 శాతం మ్యాట్ బకాయిలను (దాదాపు రూ. 40,000 కోట్లు) చెల్లిం చాలంటూ కేంద్ర రెవెన్యూ విభాగం డిమాండ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే.
దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎఫ్‌ఐఐలతో తాజాగా భేటీ అయిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కాస్త ఊరటనిచ్చే సంకేతాలిచ్చారు. ప్రధానంగా భారత్‌తో ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందాలున్న(డీటీఏఏ) దేశాలకు చెందిన ఎఫ్‌ఐఐలకు మ్యాట్ వర్తింపు ఉండబోదని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ బిల్లులో మ్యాట్ నిబంధనలకు స్పష్టతనిచ్చేవిధంగా సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన గురువారమిక్కడ విలేకరులకు వెల్లడించారు.
అయితే, ఈ ఒప్పందాల పరిధిలో లేని ఎఫ్‌ఐఐలు మాత్రం కోర్టుల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలంటూ ఆయన సూచించారు. ప్రస్తుతం పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. మే 8న లోక్‌సభ సమావేశాలు ముగియనుండగా.. 13 వరకూ రాజ్య సభ సమావేశాలు కొనసాగనున్నాయి. వచ్చే వారంలో ఫైనాన్స్ బిల్లు చర్చకు రానుంది.
డీటీఏఏల పరిశీలన...
మ్యాట్ వర్తింపు విషయంలో స్పష్టత కోసం వివిధ దేశాలతో భారత్‌కు ఉన్న డీటీఏఏలను అధ్యయనం చేయనున్నామని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి మూలధన లాభాలపై తమ స్వదేశాల్లో పన్ను చెల్లిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు 20 శాతం మ్యాట్ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు డీటీఏఏ ఒప్పందాలున్న మారిషస్, సింగపూర్ వంటి దేశాల్లో మూలధన లాభాలపై పన్నులు లేనప్పటికీ... ఆయా దేశాల ఎఫ్‌ఐఐలకు కూడా మ్యాట్ మినహాయింపు లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, స్థిర ఆదాయ సెక్యూరిటీలు, ఇతర డెట్ మార్గాల్లోని ఆదాయాలపై వడ్డీ రేటుకు సంబంధించి మ్యాట్ వర్తింపు విషయంలో కూడా ఫైనాన్స్ బిల్లులో స్పష్టతనివ్వనున్నట్లు ఆయా వర్గాల పేర్కొన్నాయి. భారత్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్న ఎఫ్‌ఐఐల్లో దాదాపు 90% మారిషస్, సింగపూర్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుండటం గమనార్హం. కాగా, పన్ను నోటీసులు అందుకున్న ఎఫ్‌ఐఐ లు మ్యాట్ నుంచి మినహాయింపు పొందాలంటే... డీటీఏఏ దేశాలకు చెందినవిగా రుజువు చేసుకోవాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.