ఎఫ్‌ఐఐలకు మ్యాట్ ఉపశమనం | CBDT circular on MAT doesn't strengthen FII case: Deloitte | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఐఐలకు మ్యాట్ ఉపశమనం

Published Tue, May 12 2015 12:36 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

ఎఫ్‌ఐఐలకు మ్యాట్ ఉపశమనం - Sakshi

ఎఫ్‌ఐఐలకు మ్యాట్ ఉపశమనం

కొత్త పన్ను నోటీసుల నిలిపివేత
న్యూఢిల్లీ: కనీస ప్రత్యామ్నాయ పన్నుల (మ్యాట్) విషయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ)కు ఊరటనిచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న ఎఫ్‌ఐఐలకు కొత్తగా మరిన్ని పన్ను నోటీసుల జారీని, తదుపరి పన్ను మదింపు ప్రక్రియలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఎఫ్‌ఐఐల గత లాభాలపై మ్యాట్ విధింపు అంశంపై అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఆదాయ పన్నులో భాగమైన అంతర్జాతీయ ట్యాక్సేషన్ విభాగాలకు ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.

మ్యాట్ విషయంలో విదేశీ ఇన్వెస్టర్లపై ఒత్తిడి ఉండబోదని ఆర్థిక మంత్రి ప్రకటించిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నిర్దిష్ట గడువేమీ నిర్దేశించనప్పటికీ అత్యున్నత కమిటీ సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎఫ్‌ఐఐల భయాలను పోగొట్టేందుకు ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా తాజా పరిణామం ఉందని అశోక్ మహేశ్వరి అండ్ అసోసియేట్స్ పార్ట్‌నర్ అమిత్ మహేశ్వరి అభిప్రాయపడ్డారు.

గతంలో ఆర్జించిన లాభాలపై మ్యాట్ కింద రూ. 602 కోట్ల మేర కట్టాలంటూ 68 ఎఫ్‌ఐఐలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. విదేశీ ఇన్వెస్టర్లు గగ్గోలు పెట్టడంతో దీనిపై రిటైర్డు జస్టిస్, లా కమిషన్ చైర్మన్ ఎ.పి. షా సారథ్యంలో అత్యున్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement