‘మ్యాట్’ వివాదానికి... విదేశీ ఇన్వెస్టర్లే కారణం | Shah panel will go into 'legacy' tax issues: Jaitley | Sakshi
Sakshi News home page

‘మ్యాట్’ వివాదానికి... విదేశీ ఇన్వెస్టర్లే కారణం

Published Tue, May 19 2015 12:55 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

‘మ్యాట్’ వివాదానికి... విదేశీ ఇన్వెస్టర్లే కారణం - Sakshi

‘మ్యాట్’ వివాదానికి... విదేశీ ఇన్వెస్టర్లే కారణం

‘పాత పన్నుల’ వివాదాలపై షా కమిటీ దృష్టి...
* కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లపై (ఎఫ్‌ఐఐ) కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విధింపునకు సంబంధించి కీలకమైన పాత కేసులన్నింటినీ జస్టిస్ షా కమిటీ పరిశీలిస్తుందని జైట్లీ తెలిపారు. ఇదే అంశంపై పరస్పరం భిన్నమైన తీర్పులు రావడం వల్ల వివాదం ఏర్పడిందని పేర్కొన్నారు. 2012లో అథారిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ రూలింగ్స్‌ను (ఏఏఆర్) ఆశ్రయించడం ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు స్వయంగా మ్యాట్ సమస్యను తెచ్చిపెట్టుకున్నారని జైట్లీ వ్యాఖ్యానించారు.

ఇది ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తమ ప్రభుత్వం భవిష్యత్‌లో మినహాయింపులు ఇవ్వడం తప్ప...పాత కేసుల విషయంలో చేయగలిగిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కార్యాలయాలు లేని విదేశీ కంపెనీలకు మ్యాట్ వర్తించదంటూ 2010లో ఉత్తర్వులిచ్చిన ఏఏఆర్.. ఆ తర్వాత 2012లో క్యాజిల్‌టన్ సంస్థ తమ మారిషస్ విభాగం నుంచి సింగపూర్ విభాగానికి షేర్లను బదలాయించినప్పుడు నమోదైన లాభాలపై మ్యాట్ కట్టాలంటూ ఆదేశాలిచ్చింది.

ఇలాంటి భిన్నమైన ఉత్తర్వుల వల్ల తలెత్తిన పరిస్థితులు, కీలకమైన పాత పన్నుల వివాదాలను నిష్పక్షపాతంగా అధ్యయనం చేసేందుకే షా కమిటీని ఏర్పాటు చేసినట్లు జైట్లీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పాత లావాదేవీలపై పన్నులు విధించడం లేదని (రెట్రాస్పెక్టివ్), ప్రస్తుతం వివాదాస్పద మైనవన్నీ కూడా పాత కేసులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గత లాభాలపై మ్యాట్ పేరిట.. సుమారు 68 ఎఫ్‌ఐఐలకు పన్నుల శాఖ రూ.603 కోట్ల మేర ట్యాక్సులు కట్టాలంటూ నోటీసులు పంపడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
 
అవినీతి నిరోధక చట్టంలోనే లోపాలు..
అవినీతి నిరోధక చట్టంలోనే ప్రాథమికంగా లోపాలున్నాయని జైట్లీ వ్యాఖ్యానించారు.  ఉద్దేశపూర్వకమైన అవినీతి నిర్ణయాలను, తప్పిదాలను ఇది ఒకే గాటన కడుతోందని ఆయన చెప్పారు. దీనివల్లే పలువురు ప్రభుత్వాధికారులు, నియంత్రణ సంస్థల అధికారులు సీబీఐ విచారణలు ఎదుర్కొనాల్సి వస్తోందన్నారు. దీంతో సరళీకరణకు ముందు 1988లో రూపుదిద్దుకున్న ఈ చట్టాన్ని సవరించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని వివరించారు.

పలు నియంత్రణ సంస్థల అధికారులు, ఇతర ప్రభుత్వాధికారులపై అవినీతి ఆరోపణల కింద సీబీఐ విచారణ జరుపుతుండటం, వీటిలో చాలా మటుకు కేసులను ఆ తర్వాత ఉపసంహరిస్తుండటం మొదలైన పరిణామాల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ సీబీ భవే కూడా ఇలా సీబీఐ విచారణ ఎదుర్కొనాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిణామాల వల్లే 1991 తర్వాత ప్రభుత్వాధికారులు నిర్ణయాలు తీసుకోవడమనేది చాలా క్లిష్టంగా మారిందని జైట్లీ పేర్కొన్నారు.
 
త్వరలో షాంఘైకి కామత్
న్యూఢిల్లీ: ప్రస్తుతం నిర్వహిస్తున్న పదవీ బాధ్యతల నుంచి త్వరలో వైదొలగి, బ్రిక్స్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం ఉన్న షాంఘైలోని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అక్కడకు వెళ్లనున్నట్లు కె.వి.కామత్ వెల్లడించారు. ఆయన బ్రిక్స్ బ్యాంక్ తొలి ప్రెసిడెంట్‌గా నియమితులవడం తెలిసిందే. కామత్ ప్రస్తుతం ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్‌లకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement