పెట్టుబడులకు ‘ఉద్దీపన’ | Indian Government Invitation For Investments In Key Sectors | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు ‘ఉద్దీపన’

Published Sun, May 17 2020 2:48 AM | Last Updated on Sun, May 17 2020 5:10 AM

Indian Government Invitation For Investments In Key Sectors - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక రంగాన్ని కోవిడ్‌–19 ప్రభావం నుంచి గట్టెక్కించడానికి ‘స్వయం సమృద్ధి భారతం’పేరిట రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. దాన్లో భాగంగా తాము మరిన్ని సంస్కరణలకు తెరతీయబోతున్నట్లు స్పష్టంచేసింది. 4 రోజులుగా ప్యాకేజీలో అంశాల్ని వెల్లడిస్తూ వస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌... శనివారం పలు రం గాల్లో సంస్కరణలను ప్రకటించారు.  బొగ్గు గనుల తవ్వకంతో సహా, రక్షణ ఉత్పత్తుల తయారీ, అంతరిక్ష పరిశోధనలు, అణుశక్తి రంగం, విమా నాశ్రయాల నిర్వహణల్లో ప్రయివేటుకు స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడించారు. 

కేంద్ర పాలిత ప్రాంతా ల్లోని విద్యుత్‌ పంపిణీ సంస్థల్ని కూడా ప్రైవేటుకు అప్పగించనున్నట్లు స్పష్టంచేశారు. తాజా ప్రకటనపై వామపక్షాలు మండిపడ్డాయి. ధనికుల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వం కోవిడ్‌ మాటున ఆ ఎజెండాను బయటకు తీసిందంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తుల్ని పంచిపెట్టడానికి రంగం సిద్ధం చేశారన్నారు. ఇక ప్రభుత్వం వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. పిల్లలు దెబ్బతిన్నపుడు తల్లిదండ్రులు ఆదుకోవాలి తప్ప వడ్డీకి అప్పులిస్తామని చెప్పకూడదన్నారు.

పెట్టుబడులకు ఇక వేగంగా అనుమతి
ముఖ్యమైన రంగాల్లో పెట్టుబడులకు వేగంగా అనుమతులివ్వటానికి కార్యదర్శుల సాధికార బృందం ద్వారా ఫాస్ట్‌ట్రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ విధానాన్ని తీసుకొచ్చినట్లు నిర్మలా సీతా రామన్‌ గుర్తుచేశారు. ‘‘ప్రతి శాఖలో ప్రాజెక్టు డెవలప్‌మెంట్‌ సెల్‌ పెట్టాం. కొత్త ప్రాజెక్టుల రూపకల్పనతో పాటు పెట్టుబడిదారులు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెంచడమే ఈ సెల్‌ ఉద్దేశం. కొత్త పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్రాలకు ర్యాంకులిస్తున్నాం. ఇండస్ట్రియల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఐఐఎస్‌) పరిధిలోకి 3,376 పారిశ్రామిక ఎస్టేట్లు/సెజ్‌లను తీసుకొచ్చాం. అన్ని ఇండస్ట్రియల్‌ పార్కులకు 2020–21లో ర్యాంకులు ఇస్తాం’’అని వివరించారు.

త్వరలో మరో 6 విమానాశ్రయాల వేలం 
ప్రభుత్వ– ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానం కింద మరో 6 విమానాశ్రయాలను అతి త్వరలో వేలం వేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బిడ్డింగ్‌ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని చెప్పారు. మొత్తం 12 విమానాశ్రయాలను వేలం వేయడం ద్వారా ప్రైవేట్‌ సంస్థల నుంచి రూ.13,000 కోట్ల పెట్టుబడులు రాబట్టనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా అమృత్‌సర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చీ ఎయిర్‌పోర్టులను వేలం వేయడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. కేంద్రం గత ఏడాది లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి ఎయిర్‌పోర్టులకు వేలం నిర్వహించింది. మూడో దశలో ఇంకో 6 ఎయిర్‌పోర్టులను వేలం వేస్తామని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. 

ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎంఆర్‌వోకు హబ్‌గా ఇండియా 
ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్‌కు (ఎంఆర్‌వో) భారత్‌ను కీలక గమ్య స్థానంగా మార్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ‘‘దీనిద్వారా పౌర విమానాలే కాదు! రక్షణ విమానాలు సైతం ప్రయోజనం పొందుతాయి. ఈ నిర్ణయం వల్ల విమానాల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. అంతిమంగా ప్రయాణిలపై చార్జీల భారం తగ్గుతుంది. ఎంఆర్‌వోకు భారత్‌ను హబ్‌గా మార్చడానికి అవసరమైన సామర్థ్యాలు, మానవ వనరులు మన దగ్గరున్నాయి’’అని చెప్పారామె.

భారత గగనతలంపై తొలగనున్న ఆంక్షలు!
పౌర విమానాల అవసరాలకు గాను దేశంలో మరింత గగనతలాన్ని స్వేచ్ఛగా వాడుకునేలా నిబంధనలను సడలించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలియజేశారు. ‘‘ప్రస్తుతం వివిధ కారణాల దృష్ట్యా దేశ గగనతలంలో 60 శాతం మాత్రమే పౌర విమానయానానికి అందుబాటులో ఉంది. దీని వల్ల ప్రయాణించాల్సిన దూరం పెరుగుతోంది. అందుకని మిగిలిన గగనతలాన్ని కూడా వాడుకునేలా నిబంధనలను సడలించనున్నాం. దీనివల్ల దూరం తగ్గి ఇంధనం, సమయం ఆదా అవుతాయి. అలా చేయటంవల్ల భారత విమానయాన రంగానికి ఏటా రూ.1,000 కోట్ల మేర లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నాం’’అని మంత్రి తెలియజేశారు. 

అంతరిక్ష కార్యక్రమాల్లోకి ప్రైవేట్‌ సంస్థలు 
భారత అంతరిక్ష ప్రయోగాలు, కార్యక్రమాల్లో ప్రైవేట్‌ సంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించినట్లు నిర్మల వెల్లడించారు. శాటిలైట్ల ప్రయోగాలు, అంతరిక్ష ఆధారిత సేవల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యానికి చోటు కల్పిస్తామన్నారు. ప్రైవేట్‌ సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇస్రో సదుపాయాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు. భవిష్యత్తులో కొత్త గ్రహాల అన్వేషణ, అంతరిక్ష ప్రయాణాలు వంటి ప్రాజెక్టుల్లో ప్రైవేట్‌ రంగానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అలాగే క్యాన్సర్, ఇతర వ్యాధుల బారిన పడిన వారికి తక్కువ ఖర్చుతో చికిత్స అందించడానికి వీలుగా మెడికల్‌ ఐసోటోపుల ఉత్పత్తికి పీపీపీ విధానంలో రీసెర్చ్‌ రియాక్టర్‌ను నెలకొల్పనున్నట్లు చెప్పారు. 

ఢిల్లీ, ముంబై సహా కొన్ని ప్రాంతాల్లో డిస్కమ్‌లను ఇప్పటికే ప్రైవేటీకరించారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రయివేటు పరం చేయనున్నట్లు ప్రభుత్వ తాజా ప్రకటనతో జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి, చండీగఢ్‌ వంటి అధిక జనాభా గల ప్రాంతాలకు ఎక్కువ ప్రైవేట్‌ సంస్థలు పోటీపడే అవకాశం కనిపిస్తోంది. ఇక దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ –డియూ, అండమాన్‌ –నికోబార్, లడఖ్, లక్షదీవుల వంటి ప్రాంతాలు తక్కువ జనాభా ఉన్నవి. నిజానికి డిస్కమ్‌లు రాష్త్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. కాబట్టే కేంద్రపాలిత ప్రాంతాల్లోని డిస్కమ్‌లను ప్రయివేటీకరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 

సోషల్‌ ఇన్‌ఫ్రా... ప్రయివేటుకు సాయం
సామాజిక మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసే ప్రయివేటు కంపెనీలకిచ్చే వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను (వీజీఎఫ్‌) పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనికోసం రూ.8,100 కోట్లను అందజేయనున్నట్లు తెలిపారు. ‘‘సోషల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు మనగలగటం కష్టమవుతోంది. అందుకే ఇలాంటి ప్రాజెక్టులకిచ్చే వీజీఎఫ్‌ మొత్తాన్ని ప్రాజెక్టు వ్యయంలో 30 శాతానికి పెంచుతున్నాం. ఇతర ప్రాజెక్టులకు మాత్రం ప్రస్తుతం ఇస్తున్న 20 శాతం కొనసాగుతుంది’’అని తెలియజేశారు. 

‘బొగ్గు’ మైనింగ్‌కు ఊతం..
దేశంలో బొగ్గు రంగంలో ‘ప్రైవేట్‌’ను ప్రోత్సహించనున్నట్లు మంత్రి తెలిపారు. వాణిజ్య స్థాయిలో బొగ్గు మైనింగ్‌ కార్యకలాపాలకు ఊతమిస్తామన్నారు. ‘దీంతో ఈ రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యానికి తెరపడుతుంది. బొగ్గు మైనింగ్‌కు సంబంధించి ప్రస్తుత ఫిక్స్‌డ్‌ ధర విధానం బదులుగా ఇకపై రెవెన్యూ షేరింగ్‌ పద్ధతి అమల్లోకి వస్తుంది’ అని అన్నారు. 50 బొగ్గు బ్లాకులను బిడ్డింగ్‌ ద్వారా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగిస్తామన్నారు. ‘బొగ్గు ఉ త్పత్తిలో స్వావలంబన సాధించడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం ప్ర భుత్వ లక్ష్యాలు. బొగ్గు రంగంలో ప్రభుత్వం రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది’ అని చెప్పారు.

‘రక్షణ’లో ఎఫ్‌డీఐలు.. 74 శాతానికి
రక్షణ రంగంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు మరింత ఊపు తెచ్చేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమి తిని పెంచనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘‘రక్షణ ఉత్పత్తుల తయారీ విషయంలో ప్రస్తుతం 49% ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నాం, దీన్ని ఇకపై 74శాతానికి పెంచు తాం. అదే సమయంలో కొన్ని ఆయుధాల దిగుమతులను నిషేధించబోతున్నాం. వీటిని దేశీ సంస్థల నుంచే కొనుగోలు చేస్తాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని విడిభాగాలను ఇకపై మనదేశంలోనే తయారు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా రక్షణ దిగుమతుల వ్యయం తగ్గిపోతుంది’’అని ఆర్థిక మంత్రి వివరించారు. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డులు మరింత చురుగ్గా పనిచేయడానికి వాటి కార్పొరేటీకరణ ఉత్తమ మార్గమని చెప్పారామె. తద్వారా అవి స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యే అవకాశం ఉంటుందన్నారు. కార్పొరేటీకరణ అంటే ప్రైవేటీకరణ కాదని స్పష్టంచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement