ఎఫ్‌డీఐ.. రయ్‌ రయ్‌! | 49% stake in Air India is approved for sale | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీఐ.. రయ్‌ రయ్‌!

Published Thu, Jan 11 2018 12:08 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

49% stake in Air India is approved for sale - Sakshi

న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా బడ్జెట్‌కి ముందుగానే కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంలో కీలక సవరణలు చేసింది. సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్, నిర్మాణ రంగం, విద్యుత్‌ ఎక్సే్ఛంజీల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది.

అలాగే రుణ సంక్షోభంలో కూరుకున్న ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో 49 శాతం దాకా విదేశీ ఎయిర్‌లైన్స్‌ ఇన్వెస్ట్‌ చేసేందుకు అనుమతించింది. అటు వైద్య పరికరాల తయారీ సంస్థలు, విదేశీ నిధులు అందుకునే కంపెనీలకు సేవలందించే ఆడిట్‌ సంస్థల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను కూడా సరళతరం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.

దీంతో సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ రంగంలో ఆటోమేటిక్‌ విధానంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటిదాకా సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లో 49 శాతం దాకా ఆటోమేటిక్‌ పద్ధతిలో అనుమతులు ఉండగా, అంతకు మించితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటోంది. ఈ నెల దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో మోదీ పాల్లోనున్న నేపథ్యంలో ఎఫ్‌డీఐలపై తాజా నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సోర్సింగ్‌ నిబంధనలూ సరళతరం..
ఇక ఐకియా, హెచ్‌అండ్‌ఎం వంటి దిగ్గజాలు కోరుతున్నట్లుగా.. విదేశీ రిటైల్‌ సంస్థలు స్థానికంగా 30 శాతం దాకా తప్పనిసరిగా కొనుగోళ్లు చేయాలన్న నిబంధనలో కూడా కేంద్రం కొంత వెసులుబాటు కల్పించింది. విదేశీ మార్కెట్ల కోసం భారత్‌ నుంచి కొనుగోలు చేసే వాటిని కూడా ఈ 30 శాతం సోర్సింగ్‌ నిబంధనలో చూపించుకునే వీలు ఉంటుందని పేర్కొంది. తొలి స్టోర్‌ తెరిచిన ఏడాదిలో ఏప్రిల్‌ 1 నుంచి అయిదేళ్ల పాటు ఇది వర్తిస్తుందని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం డీఐపీపీ కార్యదర్శి రమేష్‌ అభిషేక్‌ తెలిపారు.

  ‘దేశీయంగా వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా.. విధానాన్ని సరళతరం చేసే లక్ష్యంతో ఎఫ్‌డీఐ పాలసీ సవరించడం జరిగింది. ఇది మరిన్ని ఎఫ్‌డీఐల రాకకు, తద్వారా పెట్టుబడులు, ఆదాయం, ఉపాధి కల్పన వృద్ధికి దోహదపడగలదు‘ అని ఒక ప్రకటనలో పేర్కొంది. విదేశీ పెట్టుబడుల రాకకు ఆటంకాలను తొలగించేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపడగలవని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి సురేశ్‌ ప్రభు అభిప్రాయపడ్డారు.

ఎకానమీ వేగవంతంగా అభివృద్ధి చెందేందుకు నిబంధనల సరళీకరణ తోడ్పడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్‌డీఐ విధానాన్ని ఇంత భారీ స్థాయిలో మార్చడం ఇది రెండోసారి. గతంలో 2016 జూన్‌లోనూ ఇదే విధంగా మార్పులు చేశారు. అప్పటి నిర్ణయాలతో 2016లో మొత్తం 60.08 బిలియన్‌ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయని, ఇది ఆల్‌టైమ్‌ గరిష్టమని కేంద్రం వెల్లడించింది.  

రియల్టీ బ్రోకింగ్‌ సేవలపై స్పష్టత
నిర్మాణ రంగానికి సంబంధించి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకింగ్‌ సేవలను.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా పరిగణించడం జరగదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్‌ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలు పొందేందుకు బ్రోకింగ్‌ సేవల సంస్థలకు అర్హత ఉంటుందని పేర్కొంది. మరోవైపు, విద్యుత్‌ ట్రేడింగ్‌ జరిగే పవర్‌ ఎక్సే్ఛంజీల్లో ఎఫ్‌డీఐలను సైతం సడలించింది. ప్రస్తుత పాలసీ ప్రకారం పవర్‌ ఎక్సే్ఛంజీల్లో ఆటోమేటిక్‌ పద్ధతిలో 49 శాతం దాకా మాత్రమే ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెకండరీ మార్కెట్‌కి మాత్రమే పరిమితంగా ఉంటున్నాయి.

‘ఈ నిబంధనను తొలగించాలని, ఎఫ్‌ఐఐలు/ఎఫ్‌పీఐలు కూడా ప్రైమరీ మార్కెట్‌ ద్వారా పవర్‌ ఎక్సే్చంజీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు అనుమతించాలని నిర్ణయించడం జరిగింది‘ అని కేంద్రం పేర్కొంది. ప్రక్రియపరమైన మార్పుల్లో భాగంగా ఆటోమేటిక్‌ రూట్‌ రంగాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుంచి వచ్చే పెట్టుబడి దరఖాస్తులను పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) పరిశీలించి కేంద్రం ఆమోదానికి పంపుతుంది.  

భారత్‌ ర్యాంకింగ్‌ మరింత మెరుగుపడుతుంది..
ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణతో దుస్తుల నుంచి ఎలక్ట్రానిక్స్‌ దాకా అనేక అంతర్జాతీయ బ్రాండ్స్‌ దేశీ వినియోగదారులకు అందుబాటులోకి రాగలవని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ రజత్‌ వాహి తెలిపారు. అలాగే, సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు అనువైన దేశాల జాబితాలో భారత ర్యాంకింగ్‌ మరింత మెరుగుపడటానికి కూడా ఇది ఉపయోగపడగలదన్నారు. ‘దీర్ఘకాలంలో చూస్తే ఈ సంస్కరణలు ఉపాధికి ఊతమివ్వగలవు.

అలాగే కొనుగోలుదారులకు మరిన్ని బ్రాండ్స్‌ అందుబాటులోకి రావడంతో పాటు ఎకానమీ వృద్ధికి కూడా ఇవి దోహదపడగలవు‘ అని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో కుమార్‌ రాజగోపాలన్‌ పేర్కొన్నారు. ‘దేశీ సంస్థలు.. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించడానికి ఈ సంస్కరణలతో కొత్తగా దారి లభించింది. దేశ, విదేశాల్లో విస్తరణ వ్యూహాలను మరింత మెరుగ్గా అమలు చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి‘ అని వైల్డ్‌క్రాఫ్ట్‌ సంస్థ సహ–వ్యవస్థాపకుడు సిద్ధార్థ్‌ సూద్‌ పేర్కొన్నారు.

అయితే, అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ మాత్రం సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లోకి ఆటోమేటిక్‌ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించడాన్ని వ్యతిరేకించింది. దీంతో బహుళజాతి దిగ్గజాలు రిటైల్‌ రంగంలోకి సులువుగా ప్రవేశించడానికి వీలు దొరుకుతుందని పేర్కొంది. ఇది, చిన్న వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.  సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ నిబంధనల సడలింపు.. టెక్‌ దిగ్గజం యాపిల్‌తో పాటు షావోమీ, ఒప్పో వంటి చైనా హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థలకు భారత్‌లోనూ స్టోర్స్‌ పెట్టేందుకు లాభించగలదని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ చెప్పారు. అయితే, ప్రీమియం ఉత్పత్తులను విక్రయించే యాపిల్‌..ఇక్కడ స్టోర్‌ పెడితే ఏ ధరకు వాటిని అందిస్తుందన్నది కీలకం కాగలదని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు,  ప్రాపర్టీ బ్రోకరేజి సర్వీసుల సంస్థల్లోకి 100 శాతం ఎఫ్‌డీఐలు.. దేశీ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ను సంఘటితం చేసేందుకు తోడ్పడుతుందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు. తాజా పరిణామంతో ఇప్పటికే భారత్‌లో పూర్తి స్థాయి కార్యకలాపాలు ఉన్న వాటికి, భవిష్యత్‌లో జాయింట్‌ వెంచర్లు కుదుర్చుకోవాలనుకునే అంతర్జాతీయ సంస్థలకు స్పష్టత లభించినట్లయిందని పీడబ్ల్యూసీ ఇండియా లీడర్‌ (డైరెక్ట్‌ ట్యాక్స్‌ విభాగం) అభిషేక్‌ గోయెంకా పేర్కొన్నారు.


మహారాజాకు ఊపిరి..
సుమారు 49 శాతం దాకా విదేశీ ఎయిర్‌లైన్స్‌ పెట్టుబడులకు అనుమతినివ్వడం ద్వారా వేల కోట్ల రుణభారంతో కుంగుతున్న ఎయిరిండియాకు ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఆటోమేటిక్‌ పద్ధతిలో కాకుండా ఈ పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం  కావాల్సి ఉంటుంది. అలాగే మరికొన్ని షరతులు వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం విమాన సేవలు అందిస్తున్న భారతీయ కంపెనీల్లో పెయిడప్‌ క్యాపిటల్‌లో 49% దాకా విదేశీ ఎయిర్‌లైన్స్‌ పెట్టుబడులకు అనుమతి ఉన్నప్పటికీ.. ఎయిరిండియాకి మాత్రం దీన్ని వర్తింపచేయడం లేదు.

‘తాజాగా ఈ ఆంక్షను ఎత్తివేయాలని, ప్రభుత్వ అనుమతుల మార్గంలో ఎయిరిండియాలో 49% దాకా విదేశీ ఎయిర్‌లైన్స్‌ పెట్టుబడులను అనుమతించాలని నిర్ణయించడం జరిగింది‘ అని కేంద్రం తెలిపింది. అయితే, యాజమాన్యం, నిర్వహణ బాధ్యతలన్నీ కూడా భారతీయుల చేతిలోనే ఉంటాయని స్పష్టం చేసింది. తాజా పరిణామంతో ఎయిరిండియాకు ఇకపై ప్రత్యేక హోదా ఏమీ ఉండబోదని పౌర విమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజు తెలిపారు. మిగతా ఎయిర్‌లైన్స్‌ కోవలోకే ఎయిరిండియా కూడా చేరుతుందన్నారు.

ఎయిరిండియాలో విదేశీ ఎయిర్‌లైన్స్‌ పెట్టుబడులను అనుమతించడంతో పాటు ఎఫ్‌డీఐ విధానాలను సడలించడాన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థల సమాఖ్య ఐఏటీఏ స్వాగతించింది. గతేడాది సెప్టెంబర్‌ ఆఖరు నాటికి ఎయిరిండియా రుణభారం సుమారు రూ. 52,000 కోట్ల మేర ఉంది. దీంతో సంస్థను గట్టెక్కించేందుకు పదేళ్ల వ్యవధిలో రూ. 30,231 కోట్ల మేర సహాయ ప్యాకేజీ అందించేలా గత యూపీఏ ప్రభుత్వ ప్రతిపాదన 2012 నుంచి అమల్లోకి వచ్చింది.  అప్పులకుప్పగా మారిన ఎయిరిండియాలో వాటా విక్రయంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 25న ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నాయి. టాటా తదితర సంస్థలు కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నాయి.

ఎయిరిండియా వివరాలు మరిన్ని..
దేశీ మార్కెట్‌కి సంబంధించి 2005–06లో 28 శాతం ఉన్న వాటా 2016–17 నాటికి 14 శాతానికి తగ్గిపోయింది.  
 విదేశీ రూట్లలో 25% మార్కెట్‌ వాటా  (2016–17).
సమయపాలనలో పరిశ్రమ ప్రమాణాలు 85 శాతంగా ఉండగా.. ఎయిరిండియాది 76 శాతంగా ఉంది.
107 విమానాలు, 11,912 మంది సిబ్బంది.
 మొత్తం రుణభారం రూ. 52,000 కోట్లు. వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణం రూ. 30,000 కోట్లు కాగా విమానాల కోసం తీసుకున్న రుణాలు రూ. 20,000 కోట్లు.
ఇంధన బిల్లు రూ. 5,745 కోట్లు (వ్యయాల్లో 29 శాతం)
వేతనాల బిల్లు రూ.2,400 కోట్లు (మొత్తం వ్యయాల్లో 12%)

వాటా కొనుగోలుకు సై: సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌
ఎయిరిండియాలో వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది.  ‘విస్తార’ విమానయాన సంస్థ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తామని కూడా పేర్కొంది.  అయితే ఎయిరిండియాలో 49 శాతం వరకూ వాటా కొనుగోలుకు విదేశీ విమాన సంస్థలను అనుమతించాలని కేబినెట్‌ నిర్ణయించడంతో వాటా కొనుగోలును పరిశీలిస్తామని వివరించింది. 

విస్తార విమానయాన కంపెనీలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటా ఉంది, మిగిలిన వాటా టాటాలది. కాగా, ఎయిరిండియాలో వాటా కొనుగోలుకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్‌లు సంయుక్తంగా బిడ్‌ చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement