సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ కంపెనీల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించినట్టు ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. ఎయిర్ ఇండియా, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, భారత్ ఎర్త్ మూవర్స్ (బీఈఎంఎల్) సహా రెండు డజన్ల కంపెనీల్లో వాటాలను విక్రయించేందుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది. ఇందులో తొమ్మిది కంపెనీల్లో వాటా విక్రయానికి ముందే వీటికి సంబంధించిన భూములు, ఇతర ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారు. వీటిల్లో స్కూటర్స్ ఇండియా, ఎయిర్ ఇండియా, భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్, ప్రాజెక్ట్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా, హిందుస్తాన్ ప్రీఫ్యాబ్, హిందుస్తాన్ న్యూస్‌ప్రింట్, బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ, హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ ఉన్నాయి.
ఆస్తుల అమ్మకాలకు సంబంధించిన కార్యాచరణను పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్) ఇప్పటికే రూపొందించింది. ‘‘ఆస్తుల నగదీకరణ కార్యాచరణ అన్నది... ఆస్తులను నిర్వచించడం, భిన్న మార్గాల్లో ఏ ప్రక్రియను అనుసరించేది తెలియజేస్తుంది’’ అని దీపమ్ సెక్రటరీ అతనూ చక్రవర్తి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పీఎస్‌యూల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా రూ.80,000 కోట్ల సమీకరణ లక్ష్యం పెట్టుకోగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.90,000 కోట్లుగా ఇటీవలి బడ్జెట్లో ఆర్థిక మంత్రి పేర్కొన్న విషయం గమనార్హం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆస్తుల అమ్మకం కూడా ఓ భాగం.
Comments
Please login to add a commentAdd a comment