ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్‌ | Tatas moving closer to a decision to bid for Air India | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్‌

Published Wed, Feb 5 2020 10:39 AM | Last Updated on Wed, Feb 5 2020 11:09 AM

Tatas moving closer to a decision to bid for Air India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు 87 ఏళ్ల క్రితం తాము ప్రారంభించిన విమానయాన సంస్థ ఎయిరిండియాను తిరిగి దక్కించుకునేందుకు టాటా గ్రూప్ గట్టిగా కసరత్తు చేస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఎయిరిండియా కోసం బిడ్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా నిబంధనలకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుంటోంది. ఎయిరిండియా ఫుల్ సర్వీస్ విభాగాన్ని విస్తారాతో కలిసి, చౌక చార్జీల విభాగం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్‌ఏషియా ఇండియాతో కలిసి నడపవచ్చని యోచిస్తోంది. ప్రస్తుతం మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాతో కలిసి చౌక చార్జీల ఎయిర్‌లైన్స్ వెంచర్‌ ఎయిర్‌ఏషియా ఇండియా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్ వెంచర్ విస్తారాను టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. ఎయిర్‌ఏషియాతో భాగస్వామ్య ఒప్పందం ప్రకారం.. ముందస్తు అనుమతి లేకుండా మరో చౌక బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూప్ 10 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయడానికి వీలు లేదు. ఎయిరిండియాకు బిడ్ చేసే క్రమంలో ఈ నిబంధనను సడలింపచేసుకునేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎయిరిండియాలో బడ్జెట్ విభాగమైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను .. ఎయిర్‌ఏషియా ఇండియాలో విలీనం చేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనికి ఆమోదం పొందేందుకు ఎయిర్‌ఏషియా చీఫ్ టోనీ ఫెర్నాండెజ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త ఒప్పందం త్వరలోనే కుదుర్చుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు దాఖలు చేయడానికి ఆఖరు తేది. మార్చి 17.

ఉభయతారకం..
ఒకవేళ ఫెర్నాండెజ్ గానీ టాటా గ్రూప్ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లయితే రెండు వర్గాలకు ఇది ప్రయోజనకరంగానే ఉండగలదని నిపుణులు పేర్కొన్నారు. టాటా సన్స్‌తో జాయింట్ వెంచర్ కింద 2013లో ఎయిర్‌ఏషియా .. భారత్‌లో చౌక చార్జీల విమానయాన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందులో టోనీకి 49 శాతం, టాటా సన్స్‌కు 51 శాతం వాటాలు ఉన్నాయి. ఆ తర్వాత సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ విస్తారా పేరిట ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభించింది. ఇందులో టాటాలకు 51 శాతం వాటాలు ఉన్నాయి. ఎయిర్ఏషియా ఇండియా.. విదేశాలకు సర్వీసులు ప్రారంభించేందుకు చాలాకాలంగా పర్మిషన్ల కోసం ఎదురు చూస్తోంది. ఇటీవలే క్రిమినల్ కుట్ర, మనీ లాండరింగ్ ఆరోపణలతో ఫెర్నాండెజ్‌తో పాటు ఎయిర్‌ఏషియా బోర్డులో టాటా గ్రూప్ నామినీ ఆర్‌ వెంకటరమణన్‌ తదితరులపై కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌ఏషియా ఇండియాకు విదేశీ సేవల కోసం అనుమతులు రావడంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎయిర్‌ఏషియా ఇండియాలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విలీనం ప్రతిపాదనకు ఫెర్నాండెజ్ గానీ అంగీకరిస్తే.. భారత ఏవియేషన్ రంగంలో మరింత పెద్ద పాత్ర పోషించేందుకు సత్వరం అవకాశం లభించగలదు. అలాగే, ఎయిరిండియా.. విస్తారాలు కలిస్తే దేశీయంగా ఫుల్ సర్వీస్ విభాగంలో టాటాలకు గుత్తాధిపత్యం దక్కగలదని నిపుణులు పేర్కొన్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం 20 భారతీయ నగరాలు, గల్ఫ్‌.. ఆగ్నేయాసియాలోని 13 ప్రాంతాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. 25 బోయింగ్ 737 విమానాలు ఉన్నాయి. ఎయిర్‌ఏషియా 29 ఎయిర్‌బస్ ఏ320 రకం విమానాలతో దేశీయంగా 21 నగరాల మధ్య సర్వీసులు నడుపుతోంది. 

ఎయిరిండియాలోకి 100 శాతం ఎఫ్‌డీఐలపై దృష్టి  
ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళికను మరింత వేగవంతం చేసే దిశగా.. కంపెనీలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎయిరిండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్‌డీఐ) పరిమితి 49 శాతంగా ఉంది. దీన్ని 100 శాతానికి పెంచిన పక్షంలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 49 శాతం పరిమితి నిబంధనను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ)కి పౌర విమానయాన శాఖ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై వివిధ శాఖల అభిప్రాయాలు కోరుతూ డ్రాఫ్ట్ నోట్‌ జారీ చేసినట్లు వివరించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement