రూ.710 కోట్ల ఎఫ్ డీఐలకు ఓకే
♦ మూడు ప్రతిపాదనలు తిరస్కరణ
♦ ఎనిమిది ప్రతిపాదనల వాయిదా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూ.710 కోట్ల విలువైన నాలుగు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలను ఆమోదించింది. అడ్వాన్స్‌డ్ ఎంై జెమ్ టెక్నాలజీస్‌కు చెందిన రూ.480 కోట్ల విలువైన ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కరోనా రెమిడీస్, మ్యాక్‌మిలన్ పబ్లిషర్స్ ఇంటర్నేషనల్, ఆర్డియన్ హెల్త్‌కేర్ గ్లోబల్ సంస్థల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు కూడా అంగీకరించామని వెల్లడించారు. ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) మొత్తం 14 ప్రతిపాదనలను పరిశీలించి నాలుగింటికి ఆమోదం తెలిపిందని వివరించారు.
ఫ్లాగ్ టెలికం సింగపూర్ పీటీఈ, స్టార్ డెన్ మీడియా సర్వీసెస్‌లతో సహా మొత్తం మూడు ప్రతిపాదనలను ఎఫ్‌ఐపీబీ తిరస్కరించిందని పేర్కొన్నారు. ఐబీఎం ఇండియా సహా మొత్తం ఎనిమిది ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసిందని ఆ అధికారి వివరించారు. రూ.5,000 కోట్ల వరకూ విలువ ఉన్న ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను ఎఫ్‌ఐపీబీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అంతకంటే అధిక పెట్టుబడుల ప్రతిపాదనలపై ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ-క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్) నిర్ణయం తీసుకుంటుంది. చాలా రంగాల్లో ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ రూట్‌లో అనుమతిస్తున్నారు. కొన్ని రంగాల్లో మాత్రం ఎఫ్‌ఐపీబీ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఫార్మాలో ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ
ఫార్మా కంపెనీల ప్రస్తుత ప్లాంట్లలో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం ఫార్మా కంపెనీల ప్రస్తుత ప్లాంట్లలో 49% ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ రూట్‌లో అనుమతిస్తారు. అంతకు మించే ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై ఎఫ్‌ఐపీబీ ఆమోదం తెలిపాల్సి ఉంటుంది.