16 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే
విలువ రూ.4,722 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూ.4,722 కోట్ల విలువైన 16 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలి పింది. హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్, ఏగాన్ రెలిగేర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతిపాదనలు ఆమోదం పొందిన వాటిల్లో ఉన్నా యి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక బోర్డ్ (ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్-ఎఫ్‌ఐపీబీ) సూచనల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎఫ్‌డీఐలకు పచ్చజెండా ఊపింది.
కాగా 8 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు తిరస్కరణకు గురయ్యాయి. వీటిల్లో సిప్లా హెల్త్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ ప్రతిపాదనలు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రూ.2,400 కోట్ల హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రతిపాదన, రూ.560 కోట్ల విలువైన ఏగాన్ రెలిగేర్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రూ.250 కోట్ల విలువైన సన్ ఫార్మా, రూ.40 కోట్ల విలువైన ఆదిత్య బిర్లా నువో ఎఫ్‌డీఐల ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.