‘మ్యాట్’ పరిష్కారమే లక్ష్యం..!
న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ)కు తలనొప్పిగా మారిన కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) వివాదం పరిష్కారమే లక్ష్యంగా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఏర్పాటయిన కమిటీ చీఫ్... జస్టిస్ ఏపీ షాతో శుక్రవారం కేంద్ర రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ సమావేశమయ్యారు. వివాద పరిష్కారానికి సంబంధించి కమిటీ విధి విధానాలను, అలాగే నివేదిక సమర్పించాల్సిన కాలపరిమితిని ఆర్థిక శాఖ 4 రోజుల్లో ఖరారు చేస్తుందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
షా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు విషయాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారమే రాజ్యసభలో ప్రకటించారు. ఈ కమిటీలో పన్నుల వ్యవహారాల నిపుణులు సభ్యులుగా ఉంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. కాగా మ్యాట్ బకాయిల వసూళ్ల విషయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)పై ఎలాంటి బలవంతపు చర్యలు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. మూలధన లాభాల్లో 20% మ్యాట్ చెల్లించాలంటూ 68 మంది ఎఫ్‌ఐఐలకు పన్నుల శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.
ఎఫ్‌ఐఐల పునరాలోచన...: ఫిచ్
మిగతా దేశాలతో పోలిస్తే భారత్ వృద్ధి అవకాశాలు ఆకర్షణీయంగానే ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. అయితే, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి నెలకొందని అభిప్రాయపడింది.