మ్యాట్‌పై సుప్రీం కోర్టుకు విదేశీ ఇన్వెస్టర్లు!
హాంకాంగ్ లాబీ గ్రూప్ ఆధ్వర్యంలో సన్నాహాలు
ముంబై/హాంకాంగ్: వివాదాస్పదమైన కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) విధింపును వ్యతిరేకిస్తూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ) ఏకమవుతున్నారు. వీరిలో కొందరి తరఫున హాంకాంగ్ లాబీ గ్రూప్ ‘ఆసియా సెక్యూరిటీస్ ఇండస్ట్రీ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అసోసియేషన్’ (అసిఫ్‌మా) ఈ అంశపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని యోచిస్తోంది. ఇందుకోసం ఆర్థిక సంస్థలు, లాయర్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లతో సమాలోచనలు జరుపుతోంది. మ్యాట్ విషయంలోఅసిఫ్‌మా జూన్‌లో పిటీషన్ వేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లపై మ్యాట్ విధించడంలో చట్టబద్ధతను ప్రశ్నిస్తూ మారిషస్‌కి చెందిన క్యాజిల్‌టన్ ఇన్వెస్ట్‌మెంట్ సుప్రీం కోర్టులో కేసు వేసింది. విస్తృతమైన అంశాలతో కూడిన క్యాజిల్‌టన్ కేసుతో సంబంధం లేదని భావించిన పక్షంలో ఆసిఫ్‌మా పిటీషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ కోర్టు గానీ విచారణకు స్వీకరిస్తే అసిఫ్‌మా.. మ్యాట్‌ను సవాల్ చేసిన తొలి విదేశీ లాబీ గ్రూప్ అవుతుంది. విదేశీ ఇన్వెస్టర్లు వ్యక్తిగతంగా వేర్వేరు కేసులూ వేయొచ్చు. అయితే, ఇవి తేలడానికి చాలా ఏళ్లు పట్టేసే అవకాశం ఉండటంతో గ్రూప్‌గా వే సేందుకు సిద్ధమవుతున్నాయి. ఎఫ్‌ఐఐలకుకొన్నాళ్లుగా ఐటీ శాఖ మ్యాట్ నోటీసులు జారీ చేస్తోంది. ఈ ఆందోళనలతో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ బాండ్లు, షేర్లను భారీ స్థాయిలో విక్రయించి, వైదొలుగుతున్నారు.
కమిటీలో స్వతంత్ర సభ్యులు: జైట్లీ
మ్యాట్‌పై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీలో స్వతంత్ర సభ్యులు ఉంటారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. వారు పక్షపాతరహితంగా, నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు తెలియజేయగలరని ఆయన చెప్పారు.
మ్యాట్ అన్ని సంస్థలకూ వర్తిస్తుంది.. కానీ..
సాంకేతికంగా చూస్తే మ్యాట్ అనేది ప్రతీ కంపెనీకి వర్తిస్తుంది. కేవలం భారతీయ కంపెనీలకు మాత్రమే వర్తిస్తుందని నిబంధనల్లో ఎక్కడా లేదు. అయితే, ఇదే అంశం వివాదాస్పదమైంది కూడా. సాధారణంగా ఎఫ్‌పీఐలకు కంపెనీల చట్టం కింద అకౌంట్ల నిర్వహణ ఉండదు. ఆ రకంగా అవి మ్యాట్ పరిధిలోకి రావు.
- రాజేష్ హెచ్ గాంధీ, పార్ట్‌నర్, డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్
ప్రత్యేక కేటగిరీకి మినహాయింపు ఉంటుంది..
పన్నుల విషయంలో ఎఫ్‌ఐఐలకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. వీరి రేట్లు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేక కేటగిరీ కింద ప్రత్యేక పన్నులు విధించేటప్పుడు ఇక మ్యాట్ ఎందుకు? సవరించిన ఫైనాన్స్ బిల్లులో ఈ విషయాన్నే చెప్పారు.
- షెఫాలి గరోదియా, పార్ట్‌నర్, బీఎంఆర్ అండ్ అసోసియేట్స్