మ్యాట్‌పై సుప్రీంకు ఎఫ్‌ఐఐలు
గత వారం బిజినెస్
టాప్ 500 అమెరికా బ్రాండ్లలో టీసీఎస్
13/05/15: అమెరికాలోని టాప్ 500 బ్రాండ్లలో టీసీఎస్‌కు చోటుదక్కింది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన జాబితాలో 57వ స్థానాన్ని ఆక్రమించింది. గడిచిన ఐదేళ్లలో టీసీఎస్ బ్రాండ్ విలువ దాదాపు 4 రె ట్లు పెరిగింది. 2012లో 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్న టీసీఎస్ ప్రస్తుతం బ్రాండ్ విలువ 8.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
మ్యాట్‌పై సుప్రీంకోర్టుకు విదే శీ ఇన్వెస్టర్లు
వివాదాస్పదమైన కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విధింపును వ్యతిరేకిస్తూ విదేశీ ఇన్వెస్టర్లు ఏకరువుపెడుతున్నారు. వీరిలో కొందరి తరపున హాంకాంగ్ లాబీ గ్రూప్ ‘ఆసియా సెక్యూరిటీస్ ఇండస్ట్రీ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అసోసియేషన్’ (అసిఫ్‌మా) సుప్రీంకోర్టుకు వెళ్లాలని యోచిస్తోంది. ఇందుకోసం లాయర్లు, ఆర్థిక సంస్థలు తదితర వాటితో సమాలోచనలు జరుపుతోంది. పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తే మ్యాట్‌ను సవాలు చేసిన తొలి విదేశీ లాబీ గ్రూప్‌గా అసిఫ్‌మా అవతరిస్తుంది. ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లపై మ్యాట్ విధించడాన్ని సవాలు చేస్తూ మారిషస్‌కు చెందిన క్యాజిల్‌టన్ ఇన్వెస్ట్‌మెంట్ సుప్రీంకోర్టులో కేసు వేసింది.
తెలంగాణలో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్?
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిమేరకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించే గూగుల్ ఫైబర్ బృందం త్వరలోనే తెలంగాణకు రానుంది. గూగుల్ ఫైబర్ సెకనుకు 1000 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇవి ప్రస్తుతం ఉన్న బ్రాడ్‌బ్యాండ్ వేగంతో పోలిస్తే దాదాపు 40 రెట్లు ఎక్కువ. 2011లో కన్‌సస్ (యూఎస్)లో ప్రారంభమైన గూగుల్ ఫైబర్ ప్రస్తుతం అట్లాంటా, అస్టిన్, ప్రోవో, చార్లోటీ, నాస్‌విల్లీ తదితర నగరాల్లో సేవలను అందిస్తోంది.
నిరాశ మిగిల్చిన ఎగుమతులు
15/05/15: భారత్ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలిమాసంలోనే నిరాశ పరిచాయి. 2014 ఏప్రిల్‌తో పోలిస్తే 2015 ఏప్రిల్‌లో14 శాతంమేర క్షీణించాయి. దీంతో గతేడాది 26 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈ ఏడాది 22 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు కూడా 7 శాతం మేర తగ్గాయి. వీటి విలువ 36 బిలియన్ డాలర్ల నుంచి 33 బిలియన్ డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మందగమన పరిస్థితులే ఎగుమతులు తగ్గడానికి ప్రధాన కారణం. ఇది ఇలాఉంటే ఏప్రిల్‌లో వాణిజ్య లోటు ఏప్రిల్‌లో 11 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. వాణిజ్య లోటు పెరుగుదలకు బంగారం దిగుమతుల వృద్ధి కూడా ఒక కారణం.
2020కి రిటైల్ రంగం @ 1.2 లక్షల కోట్ల డాలర్లు
ఈ-కామర్స్ జోష్‌తో భారత రిటైల్ రంగం జోరుగా వృద్ధి సాధిస్తోందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. ప్రస్తుతం 55 కోట్ల డాలర్లుగా ఉన్న భారత రిటైల్ రంగం 2020 నాటికి 1.2 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని తెలిపింది. అలాగే ఈ-కామర్స్ రంగం 290 కోట్ల డాలర్ల నుంచి 10,000 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తుందని వివరించింది.