Center actions
-
రూ. 25కు కిలో ఉల్లి
న్యూఢిల్లీ: నానాటికీ పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసి వినియోగదారులకు ఊరట కలి్పంచేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. శుక్రవారం ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా కిలో ఏకంగా 47 రూపాయలకు చేరాయి. దాంతో గోదాముల్లోని అదనపు నిల్వలను కిలో రూ.25కే విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ముఖ్యంగా ఉల్లి ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అదనపు నిల్వలను 25 రూపాయల సబ్సిడీ ధరకే టోకు, రిటైల్ మార్కెట్లలోకి విడుదల చేస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రోహిత్‌కుమార్ సింగ్ తెలిపారు. ఇలా ఆగస్టు నుంచి ఇప్పటిదాకా 22 రాష్ట్రాల్లో ఏకంగా 1.7 లక్షల టన్నుల ఉల్లిని విడుదల చేసినట్టు వివరించారు. ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ఆధ్వర్యంలో దుకాణాలు, వాహనాల ద్వారా సబ్సిడీ ధరకు ఉల్లిని అందుబాటులో ఉంచుతున్నారు. -
ఎఫ్ఐఐలకు మ్యాట్ ఉపశమనం
కొత్త పన్ను నోటీసుల నిలిపివేత న్యూఢిల్లీ: కనీస ప్రత్యామ్నాయ పన్నుల (మ్యాట్) విషయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ)కు ఊరటనిచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న ఎఫ్ఐఐలకు కొత్తగా మరిన్ని పన్ను నోటీసుల జారీని, తదుపరి పన్ను మదింపు ప్రక్రియలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఎఫ్ఐఐల గత లాభాలపై మ్యాట్ విధింపు అంశంపై అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఆదాయ పన్నులో భాగమైన అంతర్జాతీయ ట్యాక్సేషన్ విభాగాలకు ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. మ్యాట్ విషయంలో విదేశీ ఇన్వెస్టర్లపై ఒత్తిడి ఉండబోదని ఆర్థిక మంత్రి ప్రకటించిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నిర్దిష్ట గడువేమీ నిర్దేశించనప్పటికీ అత్యున్నత కమిటీ సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎఫ్ఐఐల భయాలను పోగొట్టేందుకు ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా తాజా పరిణామం ఉందని అశోక్ మహేశ్వరి అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి అభిప్రాయపడ్డారు. గతంలో ఆర్జించిన లాభాలపై మ్యాట్ కింద రూ. 602 కోట్ల మేర కట్టాలంటూ 68 ఎఫ్ఐఐలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. విదేశీ ఇన్వెస్టర్లు గగ్గోలు పెట్టడంతో దీనిపై రిటైర్డు జస్టిస్, లా కమిషన్ చైర్మన్ ఎ.పి. షా సారథ్యంలో అత్యున్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.